30/12/2012

"నిర్భయ"కామాంధుల చేతిలో 
బలి అయిన  నిర్భయ కోసం 
భారతావని 
కంట తడి పెట్టింది.
కొత్త సంవత్సరపు 
సంబరాలను చేసుకోమనే 
శపధాలు వినిపించాయి.
ఫేస్ బుక్ టైం లైన్లలో
వాగ్దానాలు కనిపించాయి.
పట్టణాల్లో కొన్ని చౌరస్తాల్లో 
కొవ్వొత్తులు వెలిగించారు 
'నిర్భయ' ఆత్మశాంతికి 
నివాళులర్పించారు.

పురుషులు 
సాయంకాలం 
తమకిష్టమైన క్లబ్బుల్లో 
నచ్చిన వైను చుక్కలతో గొంతు 
తడుపుకున్నారు.
కిళ్ళీ బడ్డీల దగ్గర 
లేటెస్ట్ ఐటెం సాంగుల గురించి 
చర్చిస్తూ వెకిలి నవ్వులు నవ్వుకున్నారు.
అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో 
డేటింగులకి వెళ్ళారు.
స్త్రీలు తమకిష్టమైన 
సీరియళ్ళు చూసుకున్నారు.
కుర్రకారు ఎప్పటిలాగే 
అసభ్యపు జోకులతో ఈ సాయంత్రం కూడా 
ఆమ్మాయిలను వేధించారు.

ఎక్కడో ఎ మూలో మరో నిర్భయ 
ఏ మదాంధుల కామానికో 
బలియై పోతూ ఉంటుంది.
ఎక్కడో మరో కుసుమం 
నేలరాలి పోతూ ఉంటుంది.
ఎక్కడో మరో అబల
కన్నీటితో సాయం కోసం 
అరణ్య రోదన చేస్తూ ఉంటుంది.

కొత్త సంవత్సరపు సంబరాలకి 
ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరో రెండు రోజుల్లో 
లెక్కలేని గాలన్ల 
మద్యం ఏరులై పారేందుకు 
సిద్ధమౌతోంది.
బార్లు,రెస్టారెంటులు 
ముందస్తు బుకింగు  
చేసుకొంటున్నాయి.
వ్యాపార చానెళ్ళు 
తమ ప్రోగ్రామ్స్ 
పబ్లిసిటీ చేసుకుంటూ ఉన్నారు.

ఇదేనా మనమిచ్చే నివాళి?
ఒక్క సారి ఒక్క చుక్క కన్నీరేనా వదిలేది?
ఆ మదాంధులకి శిక్ష పడుతుందో లేదో తెలీదు.
వాళ్ళను తప్పించేందుకు 
ఎన్ని జేబులు బరువెక్కుతున్నాయో తెలియదు.

ఈ "నిర్భయ" (2012)నామ సంవత్సరం 
ఆఖరి రోజంటే...
ఆ మృగాలకు  సరైన శిక్ష పడిన రోజే.
మహిళల రక్షణకి సరైన 
చట్టం చేసిన రోజే...
ఆ చట్టాన్ని సరిగా అమలు చేసిన రోజే...
దేశంలోని  ప్రతి మహిళా "నిర్భయంగా"
బైటకి వెళ్ళగలిగిన రోజే...

"నిర్భయ"కి దుఖాశ్రువుల తో నివాళులర్పిస్తూ ...@శ్రీ 


 
 24/12/2012

అదృశ్య బంధం
ఎక్కడో నువ్వు... 
ఇక్కడ నేను...
ఒకరితో ఒకరు 
నిత్యం మాట్లాడుతున్నాం...
ఒకరినొకరు 
చూసుకుంటున్నాం...
భావాలు పంచుకుంటున్నాం...
చిత్రాలు పంపుకుంటున్నాం
తలపులు చేరవేసుకుంటున్నాం...

నిన్ను నన్ను దగ్గర చేసిందదే అయినా 
దాని వలెనే నీ పలకరింపులు 
నిత్యం వింటున్నా, 
ఎందుకో అదంటే నాకింత అసూయ?

నీ మెడలో ఉంటె 
నీ ఎద సవ్వడి వింటుంటుంది
నాకంటే చేరువగా ఉన్నట్లుంటుంది...
మాట్లాడుతుంటే 
నా ఊపిరి కంటే దగ్గరగా...
నీ ముత్యాల జూకాలను స్పృశిస్తూ..
చెవిని వెచ్చగా తాకుతూ...
నునుపైన నీ చెంపను ముద్దాడుతూ 
"నీకంటే నీమాటలు వినిపించే నేనే ప్రియం"
అంటూ వెక్కిరిస్తుంటుంది...

నాకు సందేశాలు పంపే 
నీ చేతివేళ్ళ లాలిత్యం 
తనకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదేమో!
నీ ప్రేమ సందేశం చదువుతుంటే...
మునివేళ్ళతో నా గుండెల మీద అక్షరాలు వ్రాస్తూ...
నీ ఎదలోని  భావాలకు 
పద రూపం ఇస్తూ...
నీ వలపు సిరాతో...
నేరుగా నా హృదయ పత్రంపై 
లిఖిస్తునట్లుంటుంది...

నా ఎదురుగా 
నీవుసిగ్గుతో చెప్పలేని భావాలు 
నీ సందేశాలలో కనిపిస్తూ...
నా కళ్ళు సైతం సిగ్గుపడేలా చేసేస్తాయి...

కాల్ లాగ్ లో...
డయల్ చేసిన నంబర్లలో,
రిసీవ్ చేసుకున్న నంబర్లలో ,
మిస్ కాల్స్ లో ,
మొదట నువ్వే కనిపిస్తూ...
నువ్వు నాకు దూరంగా ఉన్నావనే భావాన్ని 
దగ్గరకు రానీయదు...

నీ పిలుపుకి 
సైలెంట్ లో సైతం పెద్దగా మోగేస్తుంది.
నీ మాటల ముత్యాలను
పోగు చేసుకుంటుంది... 
నా మనసుపై మల్లెల్లా చల్లగా కుమ్మరిస్తుంది...


నువ్వు నేను ఒక్కటయ్యేంత వరకూ...
మన 'మన 'లోని అనుభూతుల గుచ్చాన్ని 
అదృశ్యంగా బంధించే దారం...ఆధారం ఇదే కదూ!....  @శ్రీ 

14/12/2012

అభినందనా?...నిందా?
నిన్ను చూడాలని ఉందో సారి
 
ఒకసారేనా?...ముమ్మాటికీ కాదు...
ఒకసారి చూసాక
 
మళ్ళీ మళ్ళీ నిన్ను చూసేలా
 
చూడాలని ఉంది.

తొలి సారి నిన్ను చూస్తూ
 
నిశ్చేష్టుడనై
చిత్త్తరువులా నిలిచిపోయా...
నోట మాట రాక
 

సంభ్రమాశ్చర్యాలలో మునిగి పోయా...


ఈ మనోజ్ఞ రూపమేనా...
నే స్వప్నాల్లో చూసేది?
ఈ మందస్మితమేనా
 
నను రేయింబవళ్ళు వెంటాడేది?
ఈ అందాన్నేనా
 
నేను కాంక్షించేది?
ఈ సోయగాన్నేనా
 
నా కన్నులు వెదికేది?

ప్రేయసిని ఊహిస్తే
 
ప్రేమ వేలుపుగా సాక్షాత్కరించావు...
నా ఊహారూపానికి
 

ప్రతి రూపంగా నిలిచావు...


నీ ప్రతి కదలిక
 
నాకు అపురూపమే...
నీ ప్రతి మాట
 
నాచెవికి అలంకృతమే...
నీలో కనిపించిన ప్రతి భావం
నామదిని తాకిన
శీతల సమీరమే...

నా మనోచిత్రాన్ని
 
అనుకరించి,
అనుసరించి
 
నిన్ను సృజించిన
 

ఆ విరించి "అభినందనీయుడా?"...


నిన్నందనంత దూరాన నిలిపి
 
అందుకోలేని స్థానంలో నిలిపిన
 
ఆ బ్రహ్మ "నిందనీయుడా?."..                              @శ్రీ 


11/12/2012

ఆనంద క్షణం
నీ తలపులతో  
మొదలవుతుంది 
నా ప్రతి ప్రభాతం....
నీ నామ జపంతో  చేస్తాను
ప్రతి రాత్రి... స్వప్నలోక ప్రవేశం.

నన్నెందుకు 
అంతగా గుర్తు చేసుకుంటావు?
నీ పనుల్లో మునిగిపోవచ్చుగా?అంటావు....

నానుంచి నీ తలపులను 
కాసేపు పక్కన పెడదామనుకుంటా..
కానీ యింతలోనే,
చెప్పింది చేసేయడమేనా?
అంటూ, చిరుకోపంతో.... 
నా మనసులోకి తొంగి చూస్తావు.

నిన్ను మర్చిపోవాలనుకొనే 
సమయంలో  
మరీ ఎక్కువ   గుర్తొస్తావ్  సుమా!

దివారాత్రాలలో ...
తొలి, మలి సంధ్యలలో ...
నా స్మృతిపథంలో మెదలడం  సహజమే...
కాని తలపు- తలపుకీ  మధ్య కూడా 
తలపుల్లోకి  వచ్చేస్తే  ఎలా???
నాలోని నీ జ్ఞాపకాలకి 
దూరంగా ఉండడం  ఎలా???

బహుమతి పొందిన కవితను మీముందు ఉంచుతున్నాను...
గతంలో బ్లాగ్ లో పోస్ట్ చేసినదే...కొంతమంది మిత్రులు చదివి ఉండొచ్చు..
ఆనంద క్షణాలని మీతో పంచుకుంటున్నాను...@శ్రీ 

04/12/2012

నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నానని...నిన్ను చూస్తూ..
నీ మాటలు వింటూ...
నీ కనురెప్పల చప్పుళ్ళు కంటూ...
వెల కట్టలేని లేని నీ చిరునవ్వులని
నా ఆరాధనల్తో కొంటూ...
బుగ్గల్లోని  సిగ్గులు గమనిస్తూ...
సొట్టల్లో అందాలకి మైమరుస్తూ

మొన్న చెప్పాల్సింది నిన్న చెప్పక.. 
నిన్న అనుకున్నది ఈ రోజు చెప్పలేక...
సాహసం చేయలేక...
మనసు ముడి విప్పలేక...
మనసుచేసే గొడవ ఆపలేక 
మనసు మాట మెదడుకి చేరనివ్వక...
స్నేహం చెడుతుందేమోనని ఆలోచించక...
నీకళ్ళనుంచి  కురిసేవి నిప్పులా?
వెన్నెల చినుకులా? అని భయపడక...

అసంకల్పితంగానే సంకల్పిస్తూ...
గుండెలోని ప్రేమాణువును పేల్చేస్తూ...
ఆ విస్ఫోటనంలో నేను జ్వలిస్తూ...
ఆ సెగలలో నేను తపిస్తూ...
ఆ ధూమంలో నేను ఉక్కిరిబిక్కిరౌతూ...
మనసులో అనాలనుకున్నది జపిస్తూ...
పాదరసంలా జారిపోతున్న కాలాన్ని 
ఒక్క క్షణం ఆపేస్తూ...

చెప్పేసా....
మనసులోని మాట...
తేటి నెలవుల మూట...
దిక్కులు పిక్కటిల్లేలా...
దిశలు ప్రతిధ్వనించేలా..
వినే జనం ఉలిక్కిపడేలా...
నేను... నిన్ను.....
కాదు... నేను నిన్నే...
కాదు కాదు...
నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నానని.....@శ్రీ 
02/12/2012

సహ జీవనం
సహ జీవనం....
ఎంత అందమైన పేరు?
జీవితంలో 
నీకోసం నీ పెద్దలు వెదికి
లేదంటే నీకు తగిన
 సోల్ మేట్ లభించి 
వేద మంత్రాల మధ్య (ఎవరి మతానికి  వారు అన్వయించుకోవచ్చు...)
సప్తపది సాక్షిగా 
ఓ తరాన్ని సృష్టించేందుకు 
చేసేది సహజీవనం

ఒకరి మీద ఒకరికి నమ్మకం
భిన్నాభి ప్రాయాల్లో ఏకాభిప్రాయాలు...
ఒకరికొకరు కావాలనుకొని..
ఒకరిని విడచి మరొకరు 
బ్రతకలేమనుకొని...
ఆడంబర వివాహాలకి దూరంగా...
కుల మతాలకు అతీతంగా...
ఒకరిని కోసం  మరొకరు...
ఓ జీవితకాలం 
కలిసి జీవించడాన్ని కూడా 
సహజీవనం అనొచ్చేమో!....

ఆరు నెలలకి మగడిని మార్చి...
ఏడాదికి సహచరిని మార్చి...
సహజీవనం పేరుతొ చేసేది 
సహజీవనమా?
చట్టబద్ధమైన వ్యభిచారమా?

వయసు వేడిలో
యవ్వనపు జోరులో...
ఉడుకు రక్తానికి ఎదో కావాలనే తపనతో 
కొత్త రుచులకి అలవాటు పడుతూ...
పూటకో బట్ట మార్చినంత 
సులువుగా 
భాగస్వాములను మార్చేస్తూ
సహజీవనంలో కొత్తదన్నాన్ని 
వెతుక్కునే ప్రయత్నం 
చేస్తోంది నవతరం...

దానికి వత్తాసు పలుకుతోంది 
ఆధునిక పంథాను 
అనుసరిస్తున్నామనుకొనే 
ఆడ/మగ బుద్ధి జీవుల సమూహాలు...

పవిత్రమైన 
వైవాహిక వ్యవస్థకి జన్మనిచ్చిన చోటే...
ఒక పటిష్టమైన బంధం లేని 
సహ జీవనమని చెప్పే 
విషసంస్కృతి 
తన విషపు చుక్కలు 
స్వచ్చమైన సమాజంలో 
వెదజల్లుతోంది...

ఈ రోజు దాకా నీతో ఉన్న 
సహచరుడు 
రేపటి నుంచి 
నీ చెల్లితో సహజీవనం
చేస్తాననే మాట 
అశనీ పాతంలా 
నిన్ను తాకినపుడు...

నీతో మొహం మొత్తింది 
నీ తమ్ముడే నాకు సరిజోడీ 
అని నీ భాగస్వామి 
నీతో చెప్పినపుడు....

నాన్నా!
ఇదిగో నీ ఆరో కోడలు...
అంటూ నీ కొడుకు ..
అమ్మా!
ఇదిగో 
నీ  అల్లుళ్ళ సంఖ్య
తొమ్మిదికి చేరింది 
అంటూ నీ కూతురు...
అన్నపుడు 
తెలుస్తుంది 
'సహజీవనం' అనేది 
ఎంత భయంకరమైనదో?...

పిల్లలు పుడితే 
తండ్రి ఎవరో తెలియని పరిస్థితి...
అమ్మతో ఉండాలో 
అమ్మ ..'నాన్న' అని చెప్పిన 
నాన్నతో ఉండాలో తెలియని అనిశ్చితి...
ఫాదర్స్ నేమ్ అంటే...అందరివీ వ్రాయాలా ?
అంటూ అమాయకంగా 
అడిగే పిల్లల్ని ఒక్క సారి మనో చిత్రంలో 
ఊహించుకుంటేనే భయంకరంగా ఉండే 
సహజీవనం అందమైనదా?....

ఎప్పుడు తెగిపోతుందో?
ఎన్నాళ్ళుంటుందో?
తెలియని బంధం 
సహజీవనమనిపించు కుంటుందా?...

అందమైన కలగా కనిపించే 
దుస్వప్నాల జగత్తులోకి 
ప్రవేశం ఎందుకు?...
పూల బాటలా కనిపించే...
అగ్నికణాల... కత్తుల దారిలో 
అడుగు మోపే దుస్సాహసం ఎందుకు?... శ్రీ