31/03/2014

జయ ఉగాది(అందరికీ శ్రీ జయ నామ సంవత్సర శుభాకాంక్షలు )


|| జయ ఉగాది  ||

మావిచివుళ్ళను ఆరగించిన గండుకోయిల 
మత్తెక్కి మధురగీతాలు ఆలపిస్తుంటే

వగరు మామిడిపిందెలను కొరుకుతూ
తీపి పలుకులు వల్లిస్తూ చిలుకలు సందడి చేస్తుంటే

ప్రతితరువు చిత్రసుమాల సొబగులద్దుకుంటూ
వసంతునితో కళ్యాణానికి ముస్తాబులౌతుంటే

ప్రకృతి కాంత పచ్చని పట్టుచీర చుట్టుకొని 
ప్రతి మార్గంలో సుమాలు వెదజల్లుతుంటే

కొమ్మల కొప్పులెక్కిన సిరిమల్లెలు 
పలుదిశల పరిమళనృత్యం చేస్తుంటే

తుంటరి తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ
విరికన్నెల ప్రసాదాలకై  ప్రదక్షిణలు చేస్తుంటే

చెరకు విల్లుతో మదనుడు సుమశరసంధానం చేస్తూ 
తేనెటీగల అల్లెతాడును ఏకబిగిన మ్రోగిస్తుంటే

శ్రీగంధం పూసుకొని సుమలతలు చుట్టుకొని
చైత్రరథం చక్రాలధ్వనితో పుడమిని పులకింపజేస్తూ

తరువులన్నిటినీ  పలకరిస్తూ...సుమగంధాలను ఆఘ్రాణిస్తూ
శిశిరాన్ని తరిమి కొడుతూ...విజయదుందుభి మ్రోగిస్తూ

జయకేతనం ఎగురవేస్తూ...విచ్చేసాడు ఋతురాజు
అపజయమెరుగని 'జయ'నామధేయుడు.                    ...@శ్రీ (చిత్రకారులు వాసు గారికి ధన్యవాదాలతో ...)

17/03/2014

|| హోలీ ||
మకరందపానం చేస్తూ...
మాధుర్యాన్ని అందించిన సీతాకోక చిలుకలకి 
సిగ్గులభారాన్ని లెక్కచేయక...
వాటి రెక్కలకి తమ వర్ణాలని అద్దుతూ ప్రతి సుమం
నిత్యం ఆడుతుంటుంది రంగుల హోలీ

ఉదయకిరణాలను
క్షణానికో రంగులోనికి మార్చేస్తూ
ప్రతివర్ణాన్నీ తూరుపు సంధ్యకు పులిమేస్తూ
అస్తాద్రి చేరుతూ వీడ్కోలు పేరుతో
సంధ్యాసుందరి బుగ్గలకి సిందూర వర్ణాలు పూసేస్తూ
ఆదిత్యుడు నిత్యం ఆడుతుంటాడు రంగుల హోలీ


ప్రతి తరువునీ తపనతో తాకేస్తూ
ప్రతి కొమ్మపై రంగుపూలు చల్లేస్తూ
పుడమి నిండా సందడి చేస్తూ
ఋతురాజు ఆడేది రంగుల హోలీ 


సంధ్యా సమయాలలో
మేఘమాలికలు కురిపించే చిరుజల్లులను
ప్రభాకరుని కిరణాల సాయంతో అల్లరి పెడుతూ
ఆ నీలాలగగనం ఆడేది సప్తవర్ణాల హోలీ.


క్రోధంలో కెంపురంగుని విసురుతూ
నవ్వులతో ముత్యపువర్ణంలో తడుపుతూ
ప్రేమలో సతతహరితాన్నందిస్తూ
నా మదిలో లెక్కలేనన్ని వర్ణాలు నింపుతూ
నీవాడేది రంగురంగుల హోలీ...వేల వసంతాల కేళి. ...@శ్రీ