14/08/2012

స్వర్ణ భారత్.....



నిత్యం పరవళ్ళు తొక్కే నదీ,నదాలతో
నిరంతరం సాగే  ప్రవాహాలతో 
ఉరికే  జలపాతాలతో 
నిండి ఉంది మనదేశం 
అయినా  త్రాగేందుకు గుక్కెడు నీరు కొనుక్కొనే
దౌర్భాగ్యమే మన భాగ్యం...

ప్రత్తి పంటకి  లేదు కొదవ...
వస్త్రోత్పత్తికి లేదు లోటు....
అయినా బీదరాలికి 
చిరుగు చీరేలే శరణ్యం...

సస్యశ్యామలం  మన దేశం...
ఆహార ధాన్యాలు నిండిన  భాండాగారం..
అయినా..
ఆకలి చావులు రోజూ తప్పని వైనం..
కుపోషణతో చిన్నారులు నిత్యం  కంటపడే  దృశ్యం.

యత్ర నారీ అస్తు పూజ్యంతే  రమంతే తత్ర దేవతా!

అన్న శ్లోకం పుట్టింది ఈ భూమి పైనే....


నేడు అభినవ దుశ్శాసన,కీచకుల వారసులు 

అడుగడుగునా కనిపించేదీ ఇక్కడే....

గర్భంలోనే ఆడకూనలని విచ్చిన్నం చేసేదీ ఈ గడ్డ మీదే.


నాడు శాస్త్రీయ సంగీత నృత్యాలు పుట్టినది ఈ భూమిలోనే...

నేడు అర్థనగ్న నృత్యాల  డిస్కోథెక్ లు పెరుగుతున్నదీ ఇక్కడే... 



నాడు వైవాహిక వ్యవస్థ ఊపిరి పోసుకున్నదిక్కడే...

నేడు సహజీవనం (living together) అనే  

కుసంస్కృతి నెమ్మదిగా కాళ్లూనుతోందీ ఇక్కడే...


నాడు న్యాయానికీ,ధర్మానికీ పట్టుకొమ్మ మనదేశం...

నేడు అక్రమార్క  నేతలు మన సొత్తు..

ఆ నాయకుల  చేతిలో  మన విత్త వ్యవస్థ అవుతోంది చిత్తు.




'భారత్ వెలిగిపోతోంది' అని ఒక పార్టీ అన్నా...

'మేరాభారత్ మహాన్' అని ఇంకో పార్టీ అన్నా...

వాస్తవాల్ని చూద్దాం...

న్యాయం కోసం పోరాడుదాం..

అవినీతిని అంతం చేద్దాం 

చేయి, చేయి కలుపుదాం....

బంగారు భారతాన్ని  నిర్మిద్దాం...




బాపు కలలు కన్న భారత దేశాన్ని


నేడు కాకున్నా రేపైనా 

నిర్మించగలమని ఆశతో జీవిద్దాం...
  

  (బ్లాగ్ మిత్రులందరికీ...స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు...)