27/09/2012

ఆగంతకుని సంసారం...


ఇది ఓ 3 దశకాల క్రిందటి మాట...
మీతో పంచుకుంటున్నా ఈ పూట...

నాన్నతో ఓ  ఆగంతకుని పరిచయం...
అయింది ఆయనకు అతనిలో ఏదో  ప్రియం...
వెంటనే చేసారు ఆహ్వానం...
మా ఇంట్లోనే పెట్టించాము మకాం...


అమ్మ నాన్న చెప్పేవారు మంచి చెడుల మధ్య భేదం...
ఆగంతకునిదంతా  వేరే మార్గం...
ఆకట్టుకోవడం అతని నైజం....
సాహసాలు..కథలు...కావ్యాలు...హాస్యాలు అతని సొంతం..
అవి చెప్పడంలోనూ అందె వేసిన హస్తం...

ఒకోసారి నవ్విస్తాడు..ఒకోసారి ఏడ్పిస్తాడు..
మాటలాపడు...నిద్రపోడు...
నా మీదే  అమ్మ నాన్నల  ప్రతాపం...
చూస్తూనే ఉన్నా... అతనిపై  ఇవేవీ చెల్లకపోవడం...

ఇంటికి ఎవర్నీ రానిచ్చేవాడు కాడు,
వచ్చినవాళ్ళతో సరిగా మాట్లాడనిచ్చేవాడు కాడు,
మమ్మల్ని ఎక్కడికీ కదలనిచ్చేవాడు కాడు.
అయినా నాన్న అతన్ని ఏమి అనేవారు కాదు...

మద్యం అపుడపుడు తాగమని ప్రోత్సహించేవాడు...
సిగరెట్లు బాగుంటాయని చెప్పేవాడు...
అశ్లీలమైనవి కూడా బాహాటంగా చర్చించడం మొదలెట్టాడు...

మామీద నెమ్మదిగా అతని ప్రభావం పడింది...
స్నేహితులు ఇంటికి రావడం తగ్గింది...
బంధువులు రావడం కూడా తగ్గింది...

చాలా కాలం గడిచిపోయింది...
మాపై అతని మాటల ప్రభావం తగ్గిపోయింది...
అతని పలకరింపులు వినడం కూడా మానేసాం...
ఓ మూలన అతనికి స్థలం కేటాయించాం...

మేమతన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం...
అయినా పెళ్లి చేసుకున్నాడు...పిల్లల్ని కన్నాడు...
వాళ్ళని మామీద వదిలేసాడు....
తాను మాత్రం నిశ్చింతగా నిద్ర పోతున్నాడు....  :-) ... :-)

 (ఈ 'టపా'కి నా మిత్రుడు ఫార్వర్డ్  చేసి పంపిన ఓ ఇంగ్లీష్ మెయిల్ ఆధారం)

25/09/2012

వేరే చెప్పాలా ప్రియా?


నా చంద్రవదన 
వదనాన్ని 
ప్రతిబింబిస్తోంది 
నీలాకాశపు
చుక్కల నిలువుటద్దం .

చందమామ 
అసూయతో కందిపోతోంది 
తానుండగా 
మరో చందమామ
చుట్టూ భూమి తిరుగుతోందని... 

వెన్నెల విస్తుపోతోంది 
నా వన్నెలు 
ఈ  వన్నెల 
విసనకర్ర ముందు
కానరావటం లేదని...


నీ యవ్వనపు నదీ ప్రవాహంతో 
కలిసేందుకు సాగరమే 
కదిలి ముందుకొస్తోంది 
నీ పాదాలు 
అలల నురుగుతో 
కడుగుతూ 
స్వాగతించేందుకు... 

అంతటి వాళ్ళే 
నీ సౌందర్యానికి దాసోహమంటే....
ఇక నా మాట వేరే చెప్పాలా ప్రియా?...   @శ్రీ 


21/09/2012

వారికెందుకు తెలియదంటావ్???
నీ కళ్లెప్పుడూ 
కలువరేకులతో
పోట్లాడుతూనే ఉంటాయి...

నీ చెవులెప్పుడూ 
శ్రీకారంతో
తగువులాడుతూనే  ఉంటాయి...

నీ గొంతు ఎప్పుడూ 
కోకిల పాటను
పరిహాసం చేస్తూనే ఉంటుంది...

నీ కనుబొమలెప్పుడూ
మదనుని  వింటిని 
వెక్కిరిస్తూనే ఉంటాయి...

నీ చూపులెప్పుడూ 
పూల బాణాలకు ధీటుగా 
బదులిస్తూనే ఉంటాయి...

నీ ఎర్రని పెదవులెప్పుడూ...
గులాబీ రేకులను
ఈసడిస్తూనే ఉంటాయి...

నీ మెడ ఎప్పుడూ
శంఖంతో 
పోరు పెట్టుకుంటూనే ఉంటుంది...

నీ  చేతులు 
తెల్లని తామరలని 
ఎదిరిస్తూ...
కాళ్ళని
కెందామరలతో కయ్యానికి 
కాలుదువ్వమంటూ  
ఉసిగొలుపుతూనే  ఉంటాయి...

అంతా 'నిన్ను' 'జగడాలమారి' 
అనుకుంటారు గానీ...
'సజాతి  ధ్రువాలు '
వికర్షించుకుంటాయని
వారికెందుకు తెలియదంటావ్???...@శ్రీ 

( చిత్రకారునికి కృతఙ్ఞతలు @శ్రీ )
           

18/09/2012

గణేశ శరణం...శరణు గణేశా...

అయోనిజుడవు నీవు...
తల్లి ప్రేమతో ప్రాణం 
పోసుకున్న నలుగు పిండి బొమ్మవు నీవు...

తల్లి రక్షణకు ప్రాణమిచ్చిన
మాతృ వాక్పరిపాలకుడవు నీవు...

తల్లిదండ్రులే  విశ్వరూపమని 
తెలియజెప్పావు నీవు...
కుశాగ్ర బుద్ధితో తొలిపూజ 
అందుకుంటున్న వేలుపు నీవు...


ప్రకృతికి  దగ్గరగా ఉండమన్నది నీ పూజ...
ఫల పుష్ప పత్రాదుల పూజకి అదే అర్థం... 

నేడు కృత్రిమ రసాయనాల సమ్మేళనం
నీ మూర్తి నిర్మాణం...
జలాలను చేస్తున్నారు  కలుషితం...
ముందు తరాలకు మిగులుస్తున్నారు
ప్రదూషిత పర్యావరణం...

అంతా యోచించండి...
మట్టి గణపతులనే అంతటా ప్రతిష్టించండి...
ప్రకృతికి దగ్గరగా ఈ ఉత్సవాలను జరుపుకోండి...   @శ్రీ 
16/09/2012

గానామృత సామ్రాజ్ఞి


నీవు గళం విప్పితే...

కోకిలలు సిగ్గు పడతాయి...
ఇంత చక్కని గొంతు 
మాకు లేదెందుకని...

చిలుకలు చిన్న బుచ్చుకుంటాయి 
ఆ పలుకుల  తీయందనం... 
మా సొంతమెందుకు  కాలేదని...

'సరిగమలు' నీ గొంతులో 
కొత్త విన్యాసాలు చేస్తాయి...
శాస్త్రీయ బద్ధమైన నృత్యాలే చేస్తాయి...

తాము వ్రాసిన కీర్తనలు 
సార్థకం అయినందుకు 
ఆనందపడతారు 
అన్నమయ్య,  త్యాగయ్యలు 

ఎన్ని పాపాలు చేసినా 
గంగలో ఒక్క స్నానంతో 
పోయినట్లు...

అర్థం కాని భాషతో...
చెవులు బద్దలయ్యే రణగొణ ధ్వనుల 
సంగీత నేపధ్యంలో 
కర్కశంగా పాడే పాటలు  విన్న చెవులు...

అమృతప్రాయమైన  నీ గానంతో 
పరిశుద్ధమౌతాయి...
తిరిగి మంచి సంగీతం వినేందుకు 
సన్నద్ధమౌతాయి...

(సంగీత సామ్రాజ్ఞి  భారతరత్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారికి సమర్పితం).....@శ్రీ 


14/09/2012

తనలోనే దాచేసుకుంటుందిగా ఈ వర్షం!...


గ్రీష్మ తాపాలకు వేడెక్కి 
నింగి నుండి జారే ప్రతి చినుకుని 
ఒడిసి పట్టుకోవాలనే ప్రయత్నంలో...
తలమునకలై ఉంది
ప్రకృతిలోని ప్రతి కణం...

రాత్రనక..పగలనక,
చేసిన తపస్సు ఫలించి 
వరం పొందిన వసుంధర 
పులకరించి పరవశిస్తోంది...

వేసవి వేడికి చిక్కి, శల్యమై
నెమ్మది నెమ్మదిగా సాగరుని వైపు 
పయనించే నదీ నదాలు...
మేఘమిచ్చిన జలోత్సాహంతో
వడివడిగా తమ ప్రియతముని
చేరాలని వేగిర పడుతున్నాయి...

ఎందరికో సంతోషాన్నిచ్చే ఈ వర్షం...
నాకు ఎందుకు  ఇష్టమో,
నిత్యం...వర్షంకోసం 
ఎందుకు ఎదురు చూస్తానో
తెలుసా నీకు?


నీకోసం 
నా కనులు చిందించే 
దుఃఖాశ్రువులను 
పరుల కంట పడనీయక
తనలోనే  దాచేసుకుంటుందిగా
ఈ వర్షం!...                                         @శ్రీ 

                                                                   


06/09/2012

తనువే...తాంబూలంతమలపాకు... నీ అరచేతి కోమలంతో  పోటీ పడింది...
మౌక్తికం... నీ ముక్కెరకి నేనే సరిజోడు అంది...
కస్తూరి... నీ నుదుట తిలకమై వెలిగింది...

యాలకుల  సుగంధం...
నీ శ్వాసలో ఒదిగింది...
జవ్వాది... 
నీ యవ్వనంలో అమరింది...
పోకచెక్క... 
నీ నాభిలో చక్కగా ఇమిడింది...
కర్పూరం...
నీ అందానికి నీరాజనమంది...
తాంబూలపు పంట...
నీ పెదవిపై మెరిసింది...

బొటనవేలి  చిలుక - బాహులతలతో అల్లుకుంది...
చూపుడువేలి చిలుక - చనువు తీసుకొమ్మంది...
మధ్యవేలి చిలుక - మధ్య గాలిని చొరనీయనంది...
ఉంగరపువేలి చిలుక - నాతో ఉండిపొమ్మంది...
చిటికెనవేలి చిలుక - సిగ్గులొలికిస్తూ...
    'ఇకచాలు' అనే మాటే లేదంది...
(ఈ రోజు ఎవరి బ్లాగ్ లోనో  ఈ చిత్రం చూసి అల్లిన భావమాలిక....@శ్రీ)

04/09/2012

తస్మైశ్రీ గురవే నమఃఅమ్మలా  లాలించావు 
నాన్నలా బుజ్జగించావు...
ఓనమాలు నేర్పించావు... 
అక్షరాలు దిద్దించావు..

మా  అల్లరిని  భరించావు...
మా  తుంటరితనాన్ని తట్టుకున్నావు...
సున్నితంగా మందలించావు...
బెత్తంతో బెదిరించావు...

తెలుగా? ఆంగ్లమా? అని భేదం లేదు...
విజ్ఞానమా? భూగోళమా? అని తేడా లేదు...
అన్నీ నీకు కొట్టిన పిండి...
నీతి కథలు చెప్పడంలో విదురుడివి..
లెక్కల చిక్కులు విప్పడంలో నేర్పరివి...
చిత్రలేఖనంలో నిపుణుడివి..

నాలో విద్యను మలిచిన  అక్షర శిల్పివి. 
సకల విద్యా స్త్రాలను  ప్రసాదించిన విశ్వామిత్రుడివి.
లక్ష్యసాధనలో  వెన్ను తట్టిన ద్రోణుడివి.

నిరక్షరుల పాలిటి 'అక్షరశ్రీ' నీవు.
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలిన  'జ్ఞానజ్యోతి'వి నీవు.
అంతే కాదు...
మానుషరూపం దాల్చిన 'వాణీతేజమే' నీవు.
(సెప్టెంబరు 5 - ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నా గురువులకు 
 అక్షర నివాళి....ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మిత్రులందరికీ శుభాకాంక్షలు )