06/03/2012

నిజమైన అందం


నిజమైన అందం


నీ కొప్పున ఉన్న మల్లెలకెంత
 గర్వం? 

ఆ కొప్పుకి వాటి వలెనే  అందం వచ్చిందట.
నా ముఖంపై చెదిరినప్పటి నీ కురుల అందం
అవెప్పుడైనా చూసాయేమో అడుగు?


నీవు కట్టిన తెల్లచీరకెంత బడాయి?
ఆ చీర వలెనే నీ మేనికి అందం వచ్చిందట.
నా ప్రేమతో నేసిన చీర మాత్రమే నీ శరీరానికి
సొగసులద్దుతుందని  ఆ తెల్లచీరకెలా చెప్పను?


ప్రియా!
జీవం లేని వాటి  వల్ల వచ్చే అందం తాత్కాలికం.
జీవంతమైన వాటి వల్ల వచ్చే అందం శాశ్వతం.


నా ప్రేమ లోని ఇంద్ర ధనుస్సు మెరుపులతో 
నీ అందం ద్విగుణీకృతం అవుతుంది.....
నా వలపుతలపుల  వెండి జల్లులోతడిసి
ఆ అందం యింకా మెరుస్తుంది...


అదే అందం నన్ను మరింత మురిపిస్తుంది.
అదే అందం నన్ను మరింత మురిపిస్తుంది.                                                                    @శ్రీవసంతం

లేత మావిచివుళ్ళను   
ఆరగించిన గండు కోయిల 
మత్తెక్కి చేస్తున్న
మధుర గానలహరి 
ఒకవైపు వీనులవిందు చేస్తోంది.......

లేత  వగరు మామిడిపిందెలను కొరుకుతూ
తీపి పలుకులు వల్లిస్తున్న చిలుకలు  
మరొక వైపు సందడి చేస్తున్నాయి.

నవ పల్లవ కుసుమ పరాగాన్ని
మోసుకొచ్చే 'పిల్ల'గాలుల పరిమళం
మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.

వన్నెల వయ్యారుల 
కొప్పుల మల్లెమాలలు
కొత్త పరిమళాలతో, 
మనసున చెలరేగే 
ఊహలకు
మరింత మత్తెక్కిస్తున్నాయి.

ప్రకృతి కాంత పచ్చని చీరతో...
లతల ఆభరణాలతో...
పూల తేనియ తీయదనంతో...
వసంతపు కొత్త సొగసులద్దుకొని
వలపు వానల ఋతురాజు రాకకై 
ఎదురు చూస్తోంది.
వలపు వానల ఋతురాజు రాకకై 
ఎదురు చూస్తోంది.