08/06/2012

నా వశంలో లేని 'నా మనసు'

చీకటి తెరలను పటాపంచలు చేస్తూ
తీవ్ర గతితో  ధరిత్రిని తాకేందుకు తొందరపడే 
భానుని తొలి కిరణంలా....

రెప్పలు తెరిచి ఆకాశం వంక ఆశగా చూసే 
ముత్యపు చిప్పలో పడి ముత్యమయ్యేందుకు
తపన పడే  స్వాతి చినుకులా...

చీకటైతే చాలు ముకుళిత పత్రాల కలువని తాకి,
పులకింప చేసి, వికసింప చేసేందుకు
వేగిరపడే వెన్నెలసోనలా...


తీరాన్ని తాకాలనే తొందరలో  వడి వడిగా పరుగులెత్తే 
పున్నమి రాత్రి  పోటెక్కిన 
సాగర తరంగంలా ......

'నీ రాక ' కోసమే ఎదురు చూస్తోంది  
నా వశంలో లేని 'నా మనసు',
నీవే కావాలని మారాము చేస్తున్న 'నా అల్లరి వయసు'.