31/10/2012

తీయని తెలుగు



సహ్యాద్రి గిరులలో ప్రతిధ్వనించేది  తెలుగు.
తిమ్మమ్మ మర్రిమాను నీడలో సేద తీరేది తెలుగు.

శ్రీ వేంకటేశుని  గానామృతంలో తడిసేది తెలుగు.
పావన గోదావరి వేదనాదాలలో ఎగసేది తెలుగు.

అమరావతి కథలలో మెరిసేది తెలుగు.
భాగ్యనగరంలో భాసించేది తెలుగు.

కాకతీయుల కాలంలో కాకలు తీరింది తెలుగు.
భీమకవి పాండిత్యంలో ప్రకాశించింది తెలుగు.

నేలకొండపల్లి శాంతి స్తూపాలలో దాగింది తెలుగు.
రామదాసు కీర్తనల్లో ప్రాణం పోసుకుంది తెలుగు.

కృష్ణమ్మ పరవళ్ళలో పరవశించేది తెలుగు.
సిద్దేంద్రయోగి నృత్యంతో పదం కలిపింది తెలుగు 

శ్రీశైల క్షేత్రంలో జ్యోతిర్మయమయ్యేది  తెలుగు.
నల్లమల  కోకిల నోట మధుర గీతమయ్యింది తెలుగు...

నీలిగిరుల సౌందర్యాన్ని తనలో దాచుకుంది తెలుగు.
'బాసర భారతి'కి అక్షర నీరాజనమిచ్చింది తెలుగు...

మొల్ల రామాయణంలో మల్లియలై పరిమళించింది తెలుగు.
మంజీర నాదాలలో అడుగు కలిపి నర్తించింది తెలుగు 

త్యాగయ్య గొంతులో సరిగమలు పాడింది  తెలుగు.
కవిత్రయం కావ్యంలో కమనీయమైంది  తెలుగు 

నాగావళీ తీరాన నాట్యమాడింది  తెలుగు.
ఘంటసాల గళంతో  గొంతు కలిపింది తెలుగు.

విశాఖ సాగర ఘోషయై పలికింది తెలుగు.
రామప్ప గుడిలోన రాగమాలపించింది తెలుగు.

నన్నయ నోట శబ్దశాసనమయ్యింది  తెలుగు
శ్రీ కృష్ణ దేవరాయల స్తుతి అందుకుంది తెలుగు  

కృష్ణ శాస్త్రి భావుకతలో భావమైనది  తెలుగు...
శ్రీ శ్రీ చేతిలో అక్షర ఖడ్గమయ్యింది  తెలుగు.

తేనెకన్న తీయనిది  తెలుగు...
మధురిమకే మాధుర్యం నేర్పినది  తెలుగు...
సుకవులకి అలవోకగా పదాలనందించేది  తెలుగు.
అజంతమైన భాష మన తెలుగు...
అనంతమైన భాష మన తెలుగు...                 @  శ్రీ 

(మన తెలుగు భాష ...ప్రపంచ భాషల్లో
 "ద్వితీయ అత్యుత్తమమైన లిపి "ఉన్న భాషగా
 సత్కరించబడిన నేపథ్యంలో 
తెలుగు మాట్లాడే అందరికీ గర్వకారణం 
అనే భావాన్ని చెప్పాలనుకొని 
తెలుగు భాషా సరస్వతికి అర్పించే అక్షర సుమహారం)

29/10/2012

అందరికీ ఎందుకు చెప్పనీయవూ???



చంద్రబింబాన్ని 
ముఖంగా చేసుకొని 
చంద్రాననవే  అయ్యావు...

కనిపించవనేమో!..
చంద్రవంకను రెండుగా తుంచి 
కాటుక అద్ది కళ్లపై
అలంకరించుకున్నావు!

శరచ్చంద్రికలు 
నీ దరహాసాల్లో  దాగిన విషయం 
నీవు దాచినా 
దాగేవి కాదుగా!

వెన్నెలలో తడిసి మురిసే 
కలువ రేకులనే కదా 
నీ నేత్రద్వయం చేసుకున్నావు!

శశాంకునికి ప్రియమైన 
తారాకాంతులనే కదా 
కళ్ళలో నింపుకున్నావు!

నెలవంకలను
నిలువుగా చేసి 
నీ నడుము వంపులు 
చేసుకోమని చెప్పింది 
ఎవరో?

జాబిల్లికి 
జన్మనిచ్చిన 
క్షీరసాగారాన్నే 
ఉదరంగా చేసుకున్నావే?
మందర పర్వతం చిలికిన 
గుర్తు కూడా వదలకుంటివే?

చంద్రకాంతులు 
కనిపించడమే కాదు 
వినిపిస్తాయి కూడా 
నీ పాదాలనల్లుకొని!

శరద్వెన్నెలరాజు  
సోయగం  చూడాలంటే 
అంతా ఓ సంవత్సర కాలం 
వేచి చూస్తారు...

నిత్యం 
ఆ శోభలు 
నాకంటికి శోభనిస్తాయనే విషయం 
అందరికీ ఎందుకు చెప్పనీయవూ ?...   @ శ్రీ 


















24/10/2012

చలించని హృదయం




ఏటిలోని తెల్లకలువలు కోసి
నీకిచ్చే నేను...
         నిర్దాక్షిణ్యంగా వాటి రేకులను 
         ఒక్కక్కటే తుంచుతూ నీవు...

అక్షరమక్షరం కూర్చి నీకోసం
పత్రాలు వ్రాసే నేను...
         ప్రతి లేఖనూ చిన్నచిన్న ముక్కలు
         చేసి పైకెగరేసే నీవు...

నా మనో భావాల మాలికలల్లి
నీకు సమర్పించే నేను
         ఒక్క భావానికి కూడా 
         చలించని హృదయంతో నీవు...

ప్రేమ మందిరం కోసం 
చలువరాళ్ళు సేకరిస్తూ నేను 
          ప్రేమకు సమాధి కట్టేందుకు
          ఇటుకలు పేరుస్తూ నీవు...

ప్రేమ విజేతనవ్వాలనే
తపనతో నేను...
          ఈ పోటీలో గెలుపు 
          నీదేనన్న ధీమాతో నీవు...
        
నీ ప్రేమ కోసం అహరహం
ఎదురు చూపులు చూస్తూ నేను ...
          నా  ప్రేమను నీ ద్వేషాగ్నిలో 
          దగ్ధం చేస్తూ నీవు...                    @ శ్రీ  










21/10/2012

నిజమైన నీ స్నే'హితుడు'







కిళ్ళీ బడ్డీల దగ్గర 
రోజూ నీతో సిగరెట్టు
తాగేవాడు కాదు  స్నేహితుడు
సిగరెట్టు మానేందుకు 
నికోటేక్స్  పాకెట్టు గిఫ్ట్ 
ఇచ్చేవాడే  స్నేహితుడు....

వారాంతంలో 
బారుల్లో బీరు మగ్గుతో 
చీర్స్ కొట్టేవాడు కాదు  స్నేహితుడు
మద్యం మానమని మెత్తగా  
మందలించే వాడే  స్నేహితుడు...



పేకాటలో డబ్బులోడిపోతుంటే 
అప్పిచ్చేవాడు కాదు స్నేహితుడు... 
నీకోసం ఎదురుచూసే 
పిల్లలతో , ఇల్లాలితో
ఈ సమయాన్ని గడపమంటూ 
సలహా ఇచ్చే వాడే స్నేహితుడు...


పుట్టినరోజులకీ, 
పెళ్లి రోజులకీ ఖరీదైన బహుమతులతో 
హాజరయ్యేవాడు కాదు  స్నేహితుడు...
కష్టకాలంలో 
నీ కన్నీటిని తుడుస్తూ 
నీకు నేనున్నానంటూ 
ఒదార్చేవాడే నీ  స్నేహితుడు...


చెడుమార్గాల్లో నడవమని 
ప్రోత్సహించేవాడు కాదు  స్నేహితుడు..
నీ ఆలోచనలు సన్మార్గం వైపు 
సాగేలా చూసే వాడే స్నేహితుడు...


సెల్ ఫోనులో  రోజూ నాలుగు మాటలు 
మధురంగా మాట్లాడేవాడు కాదు  స్నేహితుడు...
నువ్వు తప్పు చేస్తే  కటువుగా 
చీవాట్లు పెట్టేవాడే  స్నేహితుడు...


నిన్ను నలుగురు మోసే రోజు..
ఆ నలుగురిలో ఒకరైన వాడే నీ స్నేహితుడు...
ఆరోజు  'తన అంతిమయాత్ర'ను  సైతం 
వాయిదా వేసుకొని 
నీముందు వాలిపోయేవాడే
నిజమైన నీ స్నే'హితుడు'...
                                      @శ్రీ ... 












19/10/2012

యా దేవీ సర్వ భూతేషు



"శైల పుత్రి" గా ఉద్భవించావు. 
హిమవంతునికి తనయవయ్యావు...

శివుని కోరి తపమాచారించావు.
అకుంఠిత దీక్షతో "బ్రహ్మచారిణి" వైనావు...

దశ హస్తాలతో...దశాయుధాలతో దర్శనమిచ్చావు.
"చంద్రఘంట"వై చల్లగా చూసావు...

అష్ట సిద్ధులు నవనిధులు ఇచ్చే మాతవైనావు.
అష్టభుజివై..."కూష్మాండ" వై  కొలువు తీరావు... 

షణ్ముఖునికి జన్మనిచ్చి  "స్కందమాత"వైనావు.
ఆ రూపంతో కాళిదాసుని కరుణించిన అమ్మవైనావు...

త్రిమూర్తుల తేజస్సునే తీసుకున్నావు.
లోకహితం కోరి  "కాత్యాయని"గా అవతరించావు...

తంత్ర సిద్ధులు కోరే  తాంత్రికుల దేవతగా మారావు...
అనుచర గణాలతో  "కాళరాత్రి"వై పూజలందుకున్నావు...

వేల ఏళ్ళ  ఘోరతపానికి నల్లబడినావు..
శివుని స్పర్శతో గంగ శుద్ధితో "మహాగౌరి"వైనావు...

శివుని అర్చనకు నోచుకున్నావు...
అష్టాదశ సిద్ధులను అనుగ్రహించి "సిద్ధిధాత్రి "వైనావు...

పదవనాడు  భక్తుల పాలిటి విజయదుర్గవైనావు...
"విజయదశమి"నాడు విజయోత్సాహాన్ని పంచావు...

"యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా...
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై  నమో నమః"                @ శ్రీ   




    









14/10/2012

అమితానందం



విరిసినమల్లెలు నీ నీలికురులకు అందం...
విడిన కొప్పు నా ముఖాన్ని కప్పితే ఆనందం...

నల్లని కాటుక నీ వాలు కన్నులకు అందం...
 చూపుల గాలానికి నా మనసు చిక్కుకుంటే ఆనందం...

ఎర్ర గులాబి రంగు నీ పెదవులకు
  అందం...
ఆ పెదవులు పదే పదే నా నామమే స్మరిస్తే  ఆనందం...

నల్లని అంచు నీ తెల్లని చీరెకు అందం....
ఆ కొంగున ముడిపడి నీతో ఉంటే ఆనందం...

నున్నని
 బుగ్గల ఎర్రని సిగ్గుల కెంపులు  నీకు అందం...
ఆ సిగ్గుల మొగ్గలు నా చెక్కిలిపై విచ్చుకుంటే ఆనందం...

తెల్లని పట్టీలు నీ అందాల పాదాలకు అందం...
వాటి మువ్వల సవ్వడులు  నా చెవులకు ఆనందం...

నందన వనమున సైతం...అందని 'అందం' నీ 'అందం'...
ఆ అందము పొందిన డెందము పొందెను
అమితానందం....@శ్రీ 


12/10/2012

పొరలు కరగవెందుకో???


బస్సు స్టాపుల్లో...
ఆడపిల్లల మందహాసాలు చూస్తూ
బైకులు ఆపి లిఫ్ట్ కావాలా?
అంటూ అడిగే యువకులకు 
వృద్ధులు చూపే చేతులు చూసి కూడా 
ఆగరెందుకో?...

సిటీ బస్సుల్లో... 
వనితల నడుము  ముడుతలు 
చూసి తాము కూర్చున్న చోటు 
త్యాగం చేసే అపర కర్ణులకు...
ఆ పక్కనే నిలుచున్న వృద్ధుల 
ముఖం మీది ముడుతలు కనపడవెందుకో?...

తమ అందాలకు కొత్త కొత్త మెరుగులు దిద్దుకోనేందుకు 
వేలకు వేలు ఖర్చు చేసే ఆడువారు
వృద్ధులైన  తమ అత్త మామలు 
తినే పట్టెడన్నం ఖర్చు లెక్కలు వ్రాస్తారెందుకో?...

భార్య చీర కొంగు రెపరెపలకు పరవశిస్తూ...
ఆ కొంగుముడికి బందీలయ్యే వారికి 
తమ తల్లి ముతక చీర చిరుగులు కనిపించవెందుకో?...

వృద్ధులైన తల్లిదండ్రులకు వచ్చే 
పెన్షన్లు దోచుకొనే చేయి...
వారి అనారోగ్యానికి మందులు కొనాల్సి వచ్చినపుడు 
ముందుకు రాదెందుకో?...

ఆదాయపు పన్నులో రాయితీ కోసం
వృద్ధాశ్రమాలకు దానాలు చేసే మహాదాతలు 
వారి తల్లిదండ్రులను కూడా 
ఆ ఆశ్రమాలకు దానం చేసేస్తూ ఉంటారు ఎందుకో?...

వృద్ధాప్యం తప్పదనీ...
మనలను కూడా ఆ శాపం వీడదనీ 
తెలిసి కూడా వర్తమానాన్ని చూడనివ్వని 
ఆ కళ్ళముందు కమ్ముకున్న పొరలు కరగవెందుకో???...... @శ్రీ 









09/10/2012

వాస్తవాన్ని గ్రహించని మానవజాతి



చేపను తింటే  గుండెకు మంచిదని...
పావురం  రక్తం పక్షవాతానికి మందు అని...

కుందేలు మాంసం సంతానోత్పత్తికి ఉత్ప్రేరకమనీ...
మొసలి చర్మం డబ్బు దాచేందుకు అనీ...

పాము చర్మం నడుమును  చుట్టేందుకు అనీ...
ఏనుగు దంతం షోకేసులకి శోభనిస్తుందనీ...

లేడి కొమ్ము గుమ్మానికి అలంకారమనీ...
పులితోలు గోడకి అందమనీ...

ఔషధ విలువలున్నాయని తిమింగలాలని వేటాడి చంపేస్తూ 
నక్షత్రాల తాబేటి చిప్పల్ని డ్రాయింగు రూముల్లో అలంకరిస్తూ

ఇలా అన్ని జీవుల్నీ చంపుకుంటూ,
అన్నిటినీ నిర్దాక్షిణ్యంగా కబళిస్తూ,
అన్నీ పోయినా, నేను మాత్రం ఉంటాననే భ్రమలో 
బతుకుతోంది వాస్తవాన్ని గ్రహించని మానవజాతి...  @శ్రీ