11/11/2012

ముఖపుస్తకపు మనోహరి




ఎవరో తెలియదు...
ముఖం చూడలేదు..
ఎక్కడుంటావో  తెలియదు..
ప్రత్యక్షంగా నీతో స్నేహం లేదు..
ముఖపుస్తకంలో కనిపిస్తుంటావు.
అందరితో బాటు మామూలుగా పలకరిస్తుంటావు.

భావ కవిత్వంలో భాషిస్తావు...
మణిమాలికలో మాధుర్యాన్ని చూపిస్తావు...
పద్యనగరిలో విహరిస్తావు...
ఏక్ తారలో హృదయ తంత్రిని మీటుతావు...
కవుల సమూహాల్లో కవితా సుమాలు వెదజల్లుతావు...


నీ ప్రతి అక్షరాన్ని ఆరాధిస్తాను 
వాటిలోని ప్రతిభావాన్నీ ఆస్వాదిస్తాను...
నీ భావానికి నేనేమని వ్యాఖ్యిడితే 
నీవు ఆనందిస్తావో అనుకుంటూ 
ఆలోచించే సమయం 
నేనో కవిత వ్రాసేందుకు పట్టే కాలం కంటే ఎక్కువే.

నా భావవ్యక్తీకరణకు నీ స్పందన కోసం,
ఎదురు చూడటం అలవాటుగా మారింది...
నీ స్పందన లేకుంటే గుండె పిండినట్లుంటుంది 
కనీసం ఇష్టపడ్డట్టు కనిపిస్తే సంతృప్తిగా ఉన్నట్లుంటుంది 


నా అక్షరాల్ని ప్రేమిస్తున్నట్లు..
నా భావుకత్వాన్ని ఇష్టపడుతున్నట్లు 
నా కవితలను క్రమం తప్పక చదువుతున్నట్లు..
వాటికై రోజూ ఎదురుచూస్తున్నట్లు...
తెలిసే నీ స్పందనలోని  పదపారిజాతాలు 
నా మదిలో నిత్యం గుబాళిస్తూ ఉంటాయి...

అనునిత్యం నాతొ ఉన్న మిత్రుల స్నేహం కంటే 
నీ స్నేహం ఎంత అపురూపంగా కనిపిస్తుందో తెలుసా?
మన భావ సారూప్యత వల్లనే ఏమో ఇదంతా!

నీ శుభ ప్రభాతంతో తెరుచుకొనే సందేశాల పెట్టె 
నీకు శుభరాత్రి అని చెప్పాకే మూత  పడుతుంది....
మధ్యలో ఆ పెట్టె ఎప్పుడు వెలిగినా 
నీ పలకరింపేమోనని ఆశగా తెరుస్తుంటాను...

ప్రత్యక్షంగా కనపడక,వినపడక 
వేల మైళ్ళ దూరంలో ఉన్నావో...
కూతవేటు దూరంలో ఉన్నావో తెలియదు గానీ,
నా మనసుకి మాత్రం నీ శ్వాస లోని 
వెచ్చదనాన్ని నేను గుర్తించేంత దూరంలో ఉంటావు...


నీ అక్షరాల్లోని అందమైన రూపాన్ని బట్టి 
నీ సౌందర్యం అంచనా వేసే ప్రయత్నం చేస్తుంటాను...
అయినా ముఖపుస్తకపు ముసుగు తీసి ఎన్నడూ 
నాకు కనిపించకు నేస్తం...
నాకు నచ్చేటి అందం నీలో లేదని నిరాశ పడతానని 
అనుకుంటున్నావా?
కాదు కాదు...
నా ఊహకందని సౌందర్యం నీలో కనపడితే..
అందని అందాన్ని అందుకోలేకున్నానని... 
నా కవితల్లో విరహం ఎక్కువైపోతే 
అది నా కవి మిత్రులు పసిగడతారని భయం...

శైలి మారితేనే  పసిగట్టే సత్తా ఉన్నవాళ్ళు వారు...
భావం మారితే ఆట పట్టించరూ! ...    @శ్రీ