30/06/2012

ఏకంలో అనేకమా?...అనేకంలో ఏకమా?...


ఒక పుష్పం తావి 
మరో  పుష్పానికి లేదు...
ఒక వస్తువు  రంగు
మరొక  వస్తువుకి  లేదు...
ఒక  మనిషి  రూపు
మరో  మనిషికి  లేదు ...
అయినా భిన్నవర్ణాల  మేళవింపుతో  ప్రపంచం 
కంటికి ఇంపుగా కనిపిస్తుంది.


నింగి,నేల ఒకే వర్ణంలో ఉంటే
ఒకదానికొకటి ప్రతిబింబాలేమో
అని భ్రమిస్తామేమో!

అందరి మనసును ఆహ్లాదపరిచే
సప్తవర్ణాల ఇంద్ర ధనసు ఏర్పడేది
శ్వేత వర్ణం, వర్షపు బిందువులో వక్రీభవిస్తేనే కదా!
సప్త స్వరాలు వేరైనా 
అవి కలిస్తేనే కదా సుమధుర సంగీతం!

ప్రకృతిలో స్త్రీ ,పురుషులు వేరైనా,
వారి భావాలు, ఇష్టాలు వేరైనా, 
వారిద్దరి మధురమైన కలయికలోనే కదా
మరో జీవి ప్రాణం పోసుకోనేది!

పగలు... 
కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగుతో ప్రకాశిస్తే,
రాత్రి...
అంధకార బంధురంలో మునిగిపోతుంది.
అవి రెండూ కలిస్తేనే కదా ఒక దినం ఏర్పడేది!

జన్మ వెలుగైతే...
మృత్యువు చీకటి...
ఈ రెంటి మధ్యే కదా జీవితం!

తెలుపు నుండి నలుపు వరకూ ఉండే జీవితంలో
అసంఖ్యాకమైన వర్ణాల్లో మునిగి తేలుతుంటాం.
పరస్పరం విరుద్ధమైన భావాలతో కనిపించినా,
వాస్తవానికి ఒకదానికింకోటి పూరకమే!

భిన్నత్వంలో ఏకత్వం.
ఏకత్వంలో భిన్నత్వం.
ఇదే జీవన తత్వం
ఇదే గ్రహించాల్సిన సత్యం.           @శ్రీ