27/09/2013

|| వృద్ధాప్యం ||






కళ్ళ చివర మొదలై 
బుగ్గలమీదికి పాకుతూ 
మెడమీద విశ్రమిస్తూ మెలమెల్లగా 
ముందుకి కదులుతూ
మన ప్రమేయం లేకుండానే
ఒళ్లంతా ఆక్రమిస్తాయి ముడుతలు.

నుదిటిపై స్పష్టమౌతుంటాయి 
అనుభవాలు గీసిన వక్రరేఖలు 
శైవుల త్రిపుండ్రాలని తలపిస్తూ.
వెండితీగలుగా మారిపోతూ ఉంటాయి 
సంపెంగనూనెల మెరిసిన నల్లని కేశాలు.

బ్రతికే రోజులు తగ్గుతున్నా 
తనకేం పట్టనట్టు 
దినదినప్రవర్ధమానమౌతూ ఉంటుంది 
కళ్ళజోడు నెంబరు.
తగ్గిన ఎముక బరువును కూడా మోయలేక
వంగిపోతూ ఉంటుంది  నడుము.

కళ్ళల్లో కరిగిన స్వప్నాల్లా 
కండలు...వేలాడే చర్మంలో
కలిసిపోతూ ఉంటాయి.
కాలం చెల్లిందంటూ చివుళ్ళ నుంచి 
రాలిపడుతూ ఉంటుంది ఒకో పన్ను.
యవ్వనపు చిందులు చూసి 
మనసు గెంతులేసినా...
శరీరం మాత్రం అలిసిపోతూ ఉంటుంది.

వద్దనుకున్నా...వృద్ధాప్యం 
ధృతరాష్ట్రుని ఉక్కుకౌగిలిలా
ఊపిరి ఆడనివ్వకుండా నలిపేస్తూ    
శరీరాన్ని తన వశంచేసుకుంటుంది 
నెమ్మదిగా అణువణువునూ
నిర్దాక్షిణ్యంగా కబళించేస్తుంది.
బ్రతికుండగనే నరకమేమిటో చూపిస్తుంది.
మృత్యువుకి దగ్గరగా తీసుకుపోతుంది...            @శ్రీ 27/09/2013

19/09/2013

|| నిశ్శబ్ద నివేదన ||



నీవు వ్రాసేవి లిప్తకి వేయి ప్రేమలేఖలు అంటావు.
నా నిరీక్షణాక్షణాలను క్షణానికి వెయ్యి చొప్పున లెక్కించినా
నీకు కొన్నియుగాలు పడుతుంది లెక్కింపు పూర్తి చేసేందుకు.
ఆక్షణాలలో సగం దాచాలన్నా 
వందల గేలక్సీలు కావాలి.
ఆక్షణాలను కుప్పలుగా పోస్తే
సప్త సముద్రాల తీరాలు చిన్నవిగానే కనిపిస్తాయి...చిన్నబుచ్చుకుంటాయి.


(నీ)కలలనిచ్చే రేయి కోసమే
ఎదురుచూస్తుంటాయి మూతబడని (నా)కన్నులు.
ఎంత చూసినా కల'కావలేనా' ప్రతి రేయి?
నిజమయ్యే స్వప్నాల కోసమే
కలలు కంటున్నాయి 'ఆశలమేనా'ని మోసే నా ఊహలు.
నీవుండే కల కోసం
ఎన్ని నిద్రలేని రాత్రుల మూల్యం చెల్లించాలన్నా సిద్ధమే.
ఎన్ని కాళరాత్రులిచ్చానో నా స్వప్నాలకి
నిన్ను రప్పించేందుకు రుసుముగా.
తీరని ఆరాటమే
తీపికలల తీరం చేరాలని కలతల సుడిలో చిక్కిన కన్నులది.
ప్రతి రేయికీ అలసటే
నా కళ్ళకి...నీ కళలు చూపే కలల లోకాల దారులు చూపుతూ.
నీఅందాలను చూసే కలలు 'కనేందుకు'
నా రెప్పలు పడే నొప్పులు నీకెలా తెలుస్తాయి.

కలలోనైన కానరాని నీకోసం మనసు పడే వేదన నీకెలా చెప్పేది?
గుండె సవ్వడులతోనే మనమధ్యనున్న
నిశ్శబ్దాన్నిభేదించే ప్రయత్నంలో తలమునకలౌతున్నా.
ఆశబ్దం ఎదలోనున్న నీకు నిద్రాభంగమౌతుందని భయమోపక్క వేధిస్తోంది.
అందుకే ....నిశ్శబ్దంగానే నీ ఆరాధన...సవ్వడి లేకుండానే నామది నీకు నివేదన... ...@శ్రీ 

12/09/2013

|| సైకత రేణువులు ||






ఎన్ని రోహిణీకార్తెలలో 
చండ్రనిప్పుల్లా కాలిపోయాయో 
ఎన్ని తొలకరి జల్లులలో
తడిసి మురిసిపోయాయో 
ఎన్ని శిశిరాలలో 
గజగజ వణికిపోయాయో
ఎన్ని పున్నమితరగలలో
అప్రమేయంగా కలిసిపోయాయో 
ఎన్ని అమాసల చీకటి కెరటాలకు 
తోడుగా ఉన్నాయో 

ఎన్ని అందమైన పాదాలకు
చక్కిలిగిలిగింతలు పెట్టాయో 
ఎన్ని మువ్వల సవ్వడులకు
తాళమేస్తూస్తూ తలలూచాయో
ఎన్ని వేళ్ళు వ్రాసుకున్న ప్రేమాక్షరాలలో
మునిగి పరవశించాయో

ఎన్ని సాయంత్రాలు... 
ప్రేయసీ ప్రియుల నిరీక్షణాక్షణాలను లెక్కించాయో
ఎన్ని జతల సప్తపదులను ప్రత్యక్షంగా తిలకించాయో
ఎన్ని అనురాగ సంగమాలకు పులకించాయో
ఎన్ని అందాల కింద నలిగి సిగ్గిల్లాయో

ఎన్ని ఆకృత్యాలకు రోదించాయో
ఎన్ని చీకటి క్రీడలకి వేదికలయ్యాయో
ఎన్ని అశ్రుబిందువులతో తలంటుకున్నాయో 
ఎన్ని రుధిరకణాలలో తడిసి ముద్దయ్యాయో 

ఎన్ని సంఘటనలు చూసినా,
ఎన్ని క్రియలకి మూగసాక్షులైనా...
స్వచ్చంగా తమ తళుకులతో నవ్వుతూ 
ప్రతి ఉషస్సునీ స్వాగతిస్తూనే ఉంటాయి.
ప్రతి రేయినీ సాదరంగా సాగనంపుతూనే ఉంటాయి. ...@శ్రీ 

07/09/2013

|| చిన్నబోయింది మబ్బులపానుపు ||







చిన్నబోయింది మబ్బులపానుపు
చుక్కలతో రేరేడు పక్క ఎక్కలేదని 

చిన్నబోయింది మబ్బులపానుపు
వెన్నెల దుప్పట్లు పరచలేదని 

చిన్నబోయింది మబ్బులపానుపు
వెన్నెలకాంతలో(కాంతిలో) శశి మాయమయ్యాడని

చిన్నబోయింది మబ్బులపానుపు
చుక్కలతో శశి సరసాలుచూసి వెన్నెలమ్మ అలిగిందని.

చిన్నబోయింది మబ్బులపానుపు
వెన్నెలకాంతతో శశికాంతుని  సరసాలు లేవని.

చిన్నబోయింది మబ్బులపానుపు
తారాశాశాంకుల సరసాలకు వేదిక కాలేనందుకు

చిన్నబోయింది మబ్బులపానుపు
వెన్నెలదొరతో వ(వె)న్నెల దొరసాని నిశాయుద్ధం లేక

చిన్నబోయింది మబ్బులపానుపు
వెన్నెలమ్మ వన్నెల చిన్నెలు తనకు తళుకులద్దలేదని.

చిన్నబోయింది మబ్బుల పానుపు 
పరిచిన ఆకాశ సుమాలు...కౌముదీ సోముల క్రింద నలగలేదని.       ...@శ్రీ  

04/09/2013

" ఏకవాక్య కవితా విశారద "


సింహాచలం లోని శ్రీ సూర్య కళ్యాణమండపంలో
రోజా మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అకాడమీ వారిచే
 సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రముఖ సాహితీ వేత్తల సమక్షంలో నాకు

"ఏకవాక్య కవితా విశారద"


అనే బిరుదునిచ్చి సత్కరించిన విషయం మిత్రులందరితో పంచుకుంటున్నాను. 
నేను వ్రాసిన ఏక వాక్య కవితల కవితా సంపుటి "శ్రీ వాక్యం" ను అదే వేదికపై ఆవిష్కరించడం జరిగినది. 
.అందరికీ హృదయపూర్వక కృతజ్ఞాంజలి.../\...లతో ...శ్రీ