01/01/2013

నా ప్రణయమే వేలుపైరాత్రి అయితే చాలు,
టన్నుల బరువుతో అదిమేస్తూ,
నాకనురెప్పలపై 
అదనపు బలాన్ని 
ప్రయోగిస్తూ,
నా కన్నులు మూసేందుకు 
విశ్వప్రయత్నం చేస్తూ 
ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది నిద్ర..

నిన్ను 
తొలిసారి
చూసినప్పటినుండి
కంటికి కనిపించనంత 
దూరంగా పారిపోయింది,
సున్నితమైన కనురెప్పల్ని సైతం 
మూయలేని బలహీనురాలైంది.

నల్లని నిశీధి సాగరం నుంచి 
నిత్యం వికసించే రజతకమలం 
ఆ సాగరాన్ని కాంతిమయం చేసినట్లు,
నీ ప్రణయ ప్రభలు 
నాకళ్ళకెప్పుడు వెన్నెలనిస్తాయో?

ఆ వెన్నెల వెలుగులు  చూడకుండానే 
ఈ శ్వాస ఆగుతుందేమోననే భయం...
రాత్రనక పగలనక
నన్ను కలలో సైతం 
తరుముతూనే ఉంటుంది.

ఎందుకా వెదుకులాట?
నీ అన్వేషణ ఆగేది ఎప్పటికో?
అంటారంతా.
వారికేం తెలుసు?
నా ప్రణయమే వేలుపై నా ముందు నిలిచినా,
అది ...నీవుకాలేదుగా!                                                              @శ్రీ