31/01/2013

ఓ ప్రేమలేఖ..

                                               శ్రీ ||ఓ ప్రేమలేఖ...||

ఏయ్ కన్నా!
          నీ తలపుల పరిమళాలతో నిండిన నా హృదయానికి నీకు  లేఖ ఎలా రాయాలో , యేమని వ్రాయాలో తెలియక తికమక పడుతున్న నా మనోభావాలకు అందాల రూపం ఇచ్చింది నీవే.నాలో మెదిలే భావాలకు అక్షర రూపం ఇవ్వలేక అవస్థపడుతున్న నా కలంలో వలపుసిరా నింపి  నాకు అందించింది నువ్వే కదరా...
       నీ కన్నుల్లో మెదిలే కల నేనై ఉండాలనిపిస్తుంది... నీ యెద కనుమల్ని తాకే   వలపుల సంద్రపు అల నేనై అవ్వాలనిపిస్తోంది...కోటి జన్మలకైనా నీకై వేచి ఉండే అభిసారికనై , నీ మది వాకిట రంగ వల్లినై ఉండిపోవాలని , నీ హృదయ ద్వారానికి  బంగరు తోరణమై మెరిసిపోవాలని, చెరగని చెలిమికి నే సాక్షాన్నై మిగిలి పోవాలని ఆశ పడుతున్నా
           కలవై నువ్వు నన్ను కలవర పెడుతుంటే, కలత నిదురతో నా కనురెప్పలు వాలిపోతుంటే , నీ రాక కోసం కళ్ళలో కోటి ఆశలతో ఎదురుచూస్తోంది నీ బంగారు. ..నీ పేరులో ఏమైమరపు ఉందొ ఏమో...నాలో నేనే కన్నా ..అంటూ పిలుచుకున్నా  వళ్ళంతా ఎదో తుళ్ళింత...మదిలో ఎదో అలజడి... నీపేరు నెమ్మదిగా పలికేది పెదవులైతే మనసెందుకో మరి చిన్నగా సిగ్గుపడుతుంది?నా పేరు నీ నోటినుంచి  వినగానే గుండెల్లో పన్నీటి జల్లులు కురిసినట్లు..... హిమఖండం  కరిగి గల గల మనే సరిగమల శబ్దాలతో జారినట్లు... వళ్ళంతా ఒకటే పులకింతలు, మది కోవెల గంటలను సుతారముగా మ్రోగిస్తున్నట్లు ఏదో తెలియని తీయని గిలిగింత... ఇది ప్రేమేనంటావా?
   కంతుడు.. వసంతుడు... జయంతుడు నీ అందం ముందు వెలవెల బోతారని అందాల తారాదీపం నీవని ...ఇంతటి అందగాడు నావాడవుతున్నాడని  మదిలో ఎంత మురిసిపోతున్నానో నీకేం తెలుసు? పండువెన్నెల్లో , పచ్చదనాల పూతోటల్లో ఆడే అందాల వెన్నెల కన్యకనై... నీ కావ్య నాయిక నేనై ...తిలక్ అక్షరంలా కౌముది కన్యకనై నీ వొడిలో సేదదీరాలని అలసిన నానుదుట ఓ తీపిసంతకం నీ పెదవి కానుకగా ఇవ్వాలని యెంత ఆశ పడుతున్నానో తెలుసా?  మనసంతా నీ దగ్గర జారవిడిచి ప్రాణం మాత్రం ఉన్న బొమ్మను నేనై ఎదురు చూస్తున్నా. నా మనోహరా తొందరగా వచ్చేయవూ?
                మా పెరటి పూబాలలు ఆశతో ఎదురు చూస్తున్నాయి, తమ రేఖా కుసుమాల తివాచీపై నడచి వచ్చే నీ పాదాలను తనివి తీరా ముద్దాడాలని ,
నా ప్రియ నేస్తాలు ..చిలుక,కోకిల,మైనా, ఆత్రం గా వేచి ఉన్నాయి నీకు సుస్వర స్వాగతాలు పలకాలని , నీ కమ్మని , తీయని స్వరంతో జత కలిపి పాడాలని .
          నీ చిత్రం నా పక్కన చూసి  నెల రాజెందుకో ఈర్ష్య పడి చూస్తున్నాడు చూడు... ఈ మచ్చ లేని వన్నెల చిన్నెల  వెన్నెల రాజు నీకెలా సఖుడయ్యాడో అని ? నిన్ను  పక్కన చూసి పూలతోపులను  అల్లరి చేసే పిల్లగాలుల సైతం నన్ను కూడా తాకి కలవర పెడుతుంటే , ఉలికి పడి వెతుకుతుంది , నా మనసు నా నీడగా మారిన నీ  కోసం . పాలరాతిని సైతం ప్రతిబింబించే నీ ఛాయను స్పృశించాలని , నీ నవ్వుల తెల్లదనాలను తమ సొంతం చేసుకోవాలని సిరిమల్లెలు  ఎంత ఆరాట పడుతున్నాయో తెలుసా?
            నా ప్రతి తలపులో నువ్వు ..నా ప్రతి ఊహలో నువ్వు ...నీలి మబ్బులోన నీ నీడను చూసి నెమలిని నేనై నర్తిస్తున్నా ...నా  నల్లని కురులను నా ముని వేళ్ళతో చేయించే నాట్యం కోసం ఎదురు చూస్తునా...ఏయ్ కన్నా!నాకు సిగ్గేస్తోంది తెలుసా? ఇలా నేను వ్రాసినవన్నీ నువ్వు చదువుతూ అక్షరాలను గుచ్చే చూపులు భావయానం చేసి నన్ను తాకేస్తాయో ఏమిటో?...అక్కడికీ ..అల్లరిచేసే మనసుకి నీ మాటలు చెప్పి బుజ్జగించి నిద్రబుచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను.నీ మాటలు విని మరింత చెలరేగి వాటితో పాటు నన్ను కూడా జాగారం చేయించేస్తాయి.నీకోసమే నామనసుకు వయసోచ్చిందని నీకెలా చెప్పేది?...చిన్నప్పుడే శృంగార నైషదం  చదివేసానన్నావు...మరి నావిరహాన్ని  గుర్తించడంలో   ఎందుకో  ఆలస్యం చేస్తున్నావు...నీ మనసు నా మనసుతో ఏడడుగులు వేసేసినట్లే అనిపిస్తోంది...చేతికి పెట్టిన గోరింట పంట చూస్తానంటూ ఆ ఎర్రదన్నాన్ని నీ పెదవుల కెంపులతో కోసేసి...వళ్ళంతా...ఆ ఎర్రదనం పాకిన అనుభూతిని ఎలా మరచిపోగలను చెప్పు...చేతి రేఖలు చూస్తానంటూ నీ చేతిలోకి చొరవగా నా చేతిని తీసుకున్నపుడే అనుకున్నాను నీతో పాణి గ్రహణం అయిపోయిందని...
            ఒక్క క్షణం కన్ను మూసుకుంటే...అమ్మో... ఏ కొమ్మతోనైనా ముచ్చట్లాడడం లేదు కదా!..అని ఫోన్ చేస్తే కాల్ వెయిటింగ్ వస్తుంటుంది...నే కోపంలో ముక్కున ఉన్న ముక్కెర ఎగరేసే లోపే...కాల్ చేసేసి కొమ్మలేందుకు?..అనుక్షణం ప్రేమవృక్షం నీడన నీ ఊహల ఊడలలోనేగా నన్ను నీవు ఊయలలూపేది  అంటూ నా కోపాన్ని క్షణాల్లో పోగొట్టేస్తావు...ఏయ్ కన్నా!...ఐ మిస్ యు రా...నీ తీయని మాటలకు,చిలిపి సందేశాలకు పుట్టిన వంట్లోని ఆవిరులకు వెన్నెల కూడా వైద్యం చేయలేక చేతులెత్తేసింది...శ్రీ చందనం వ్రాసుకున్నా క్షణాల్లో పొడి పొడిగా రాలిపోతోంది...ఇప్పుడు నీ మాటలకి...వ్రాతలకే  ఇలా సిగ్గు పడిపోతుంటే,,,అమ్మో! రేపు నేను నీదాన్నయ్యాక నీ అల్లరి ఎలా తట్టుకుంటానో ఏమిటో?...
               నీవు నన్ను చూసి నచ్చుకొని...మెచ్చుకొని వెళ్ళిన ప్రతిక్షణం నుంచే నా మనసు నీ రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.
I LMN U (LOVE YOU...MISS YOU...AND NEED YOU...)...నామనసుని నామాట వినకుండా చేసిన నిన్ను...నీలో ఉన్న నా మనసు ఊరికే వదలదులే...నన్ను త్వరగా నా నుంచి తీసుకు  పోవూ!
నీ రాక కోసం నిలువెల్ల కనులై .....
                                                                                  నీ బంగారు...                                                      


27/01/2013

మోస్తూనే ఉంటావు.


పుట్టినపుడు
'అయ్యో ...ఆడపిల్లా!' 
అనే లోకం నిట్టూర్పులు మోసావు...

వైవాహిక జీవితంలో
మెట్టినింటి 
బరువు బాధ్యతలు మోసావు... 

బిడ్డను ప్రసవించడానికి 
గర్భంలో నవమాసాలు 
నీ చిన్నారిని మోసావు...

పిల్లల వెంట వారి 
పుస్తకాల సంచులు 
మోసావు...

ఇల్లు గడవక 
బైట (పని) బరువులు 
మోస్తున్నావు...

ఆఖరికి "నీ బరువు"
మరో నలుగురు మోసేదాకా...
జీవితాంతం 
ఏదో  ఒకటి మోస్తూనే ఉంటావు...


23/01/2013

నీ చూపులు...

ప్రేమగా
 నా కళ్ళలోకి  
చూసే లోతైన  చూపులు 
చిరుకోపంతో  చురుక్కుమంటూ
గుచ్చే  చూపులు

మదన  శరాలను   సానపట్టి
సంధించే  చూపులు 
తలుపు  వెనుకనుంచి
ఓరగా  చూసే  చూపులు 

నా
  గుండెని  తాకే
వెన్నెల  తూపుల  చూపులు 
సిగ్గుతో  నా  వంక  చూస్తూ
నా మనసు దోచే చూపులు 

సాయం  సంధ్యలో  నాకోసం
వేచి  చూసే  చూపులు 
ఆలస్యమైతే  చూసే
వాడి  వేడి చూపులు

నన్ను   గారంగా
పూలతీగలా అల్లుకునే  చూపులు ...
నేను  అలిగితే 
నను  ప్రసన్నం  చేసుకునే  చూపులు

నను అలరించే  చూపులు 
నను  కవ్వించే  చూపులు 
నన్నారాధించే 
అర్థనిమిలీత  నేత్రాల చూపులు


నా మది వాకిలిలో 
రంగవల్లులేసిన చూపులు.
ప్రియ సమాగమంలో 
సిగ్గుతో స్వీట్ నథింగ్స్ చెప్పే చూపులు 

నిశ్శబ్ద సంగీతమాలపించే చూపులు
మది వేణువుని పలికించే చూపులు 
నా హృదయం భేదించిన చూపులు.
మన ప్రేమకి మూలమైన చూపులు.
మన బంధాన్ని శాశ్వతం చేసిన చూపులు.                        @శ్రీ 

19/01/2013

మిథునం అద్భుతః

                                                                  

  
                     "అద్భుతః" సినిమా గురించి చెప్తానంటూ ఇలా అంటున్నానని ఆశ్చర్యపోతున్నారా?...సినిమా చూసాక మీ నోటినుంచి కూడా అదే మాట వస్తుంది 
                        సుమారు ఓ దశాబ్దం క్రిందట 'రచనమాస పత్రికలో శ్రీరమణ గారి కథ చదివాక అనుకున్నాను.
ఈ కథను అదృశ్యంగా మా అమ్మమ్మ,తాతయ్య గార్లను చూసి వ్రాసారేమో అని. ఈ కథని చక్కని నాటకంగా రెండు పాత్రలతో ప్రదర్శిస్తే అద్భుతంగా ఉంటుందని అనిపించింది...క్రిందటేడాది తెలిసింది భరణి గారు ఈ కథని చలన చిత్రంగా  తీస్తున్నారు అని...పాటలు రిలీజ్ అయ్యాక ఎంత జనాదరణ పొందాయో మీకు వేరే చెప్పక్కర్లేదు...
కాఫీ ప్రియులకు కాఫీ దండకం...భోజన ప్రియులకు ఆవకాయ మన అందరిదీ..ఇంకా ఆటకదరా శివా అంటూ జీవిత సత్యాన్ని చెప్పే పాట...అన్నీ నచ్చేసాయి నాకు...(చిత్రీకరణ కూడా)
                         

                        30+...40+ వారికి ఇందులో ఆకాశవాణి కార్యక్రమాలతో అప్పాదాసు పనులను లింక్ చేయడం బాగా అర్ధమౌతుంది బహుశా...చిత్రంలో సన్నివేశానికి తగినట్లుగా ఆ కార్యక్రమాల సిగ్నేచర్ ట్యూన్ (వాటిని A I R లో అలాగే అంటారు లెండి.)వినిపిస్తుంటుంది...
                        వృద్ధాప్యం మరో బాల్యం అంటూ అప్పదాసు పాత్రలో అతని అల్లరి...చపలత్వం అమాయకత్వం చూపిస్తూనే...భోజన ప్రియత్వంలో ఏ దినుసు ఎలా వాడాలో చెప్పడం ద్వారా ...అతని జిహ్వ చాపల్యాన్ని మనకి రుచిగా చెప్పారు భరణి. మీనాక్షికి సహాయం చేయటంలో ఆతని పరిపక్వత కనిపిస్తుంది...పిల్లల మీద ఉన్న ప్రేమని భార్యకి తెలియకుండా దాచుకోవడంలో గాంభీర్యం కనిపిస్తుంది...దర్శకుడు అన్ని రంగుల్లో అన్ని కోణాల్లో ఆ పాత్రని మలచడంలో సఫలమయ్యారు.
                         నువ్వు లేనప్పుడు నీ చీర కప్పుకొని పడుకుంటాను...నేను ఎ చీర కప్పుకుంటే...నువ్వు ఆ చీర కట్టుకొని ఎదురుగా కనిపిస్తావు "అంటాడు అప్పదాసు.కనిపించని శృంగారం ఎంత ఉందొ...విరహం ఎన్ని పాళ్ళుందో చెప్పగలమా అసలు?..."ఎన్ని తిట్లైనా భరిస్తావు... పొగడ్త ఒక్కటి కూడా భరించవు కదా!."..అంటాడు...ఇలాంటివి మాటలు వ్రాయడం చాలా కష్టం.
                           భార్య ఏ చీర ఆరోజు ఉదయం కట్టుకుందోమధ్యాహ్నం కూర ఏమి చేసిందోఆమె రెగ్యులర్ గా చేతికి వేసుకునే గాజులు ఎన్నో...ఇలాంటివి గుర్తుండని(గుర్తించని) భర్తలు సిగ్గుపడేలా...తన భార్య కాపురానికోచ్చిన నాటి నుంచి అప్పటి దాకా ఏ సందర్భంలో ఎ చీర కట్టిందో తడుముకోకుండా అదే ఫీల్ తొ చెప్తాడు అప్పదాసు.
                           ప్రతి ఫ్రేం లోనూ ఆమె అతన్ని ఎక్కువ ప్రేమిస్తోందేమోననే భావాన్ని పుట్టిస్తూ...అతనే ఎక్కువ ప్రేమిస్తున్నాడంటూ అతని చేతల్లో చూపించేసాడు. ఇలా చూపడం కత్తి మీద సాము వంటిదే...
                           అప్పదాసుకి తెలు కుట్టినపుడు మంత్రం వేస్తానంటూ...తర్వాత నాకే మంత్రము రాదు దేముడిని నీ బాధని నాకు ఇచ్చేయమని ప్రార్ధించాను అంటుంది బుచ్చి లక్ష్మి. ఒక్క సారి "Night of the Scorpionగుర్తొ చ్చేస్తుంది అందరికీ...
                            ముగించే ముందు మా అమ్మమ్మ తాతయ్య గార్ల గురించి చెప్పకపోతే ఈ సమీక్ష అసంపూర్ణం 
అవుతుంది. తాత గారి వయసు 10 అమ్మమ్మ వయసు సంవత్సరాల వయసు ఉన్నపుడు వారికి పెళ్లైంది.
మేనత్త మేనమామ పిల్లలు వాళ్ళు.ఒకేచోట పెరిగారు చిన్నప్పటి నుంచి.ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమకేరింగ్.
ఎప్పుడూ అంటుండేది అమ్మమ్మ."నేను ముందుగా పోతే మీకు వండి పెట్టేవాళ్ళు...చూసే వాళ్ళు ఉండరు."..అచ్చు బుచ్చిలక్ష్మిలా. ఆయన 77 ఏళ్ళ  వయసులో కాలం చేసారుసరిగ్గా వ రోజున పసుపుకుంకుమలు తీయకుండానే అమ్మమ్మ వెళ్లి పోయింది ఆయనకు స్వర్గంలో కూడా తోడు  ఉందామని. సంవత్సారాల వయసు తేడాతో అంకెతో ఉన్న బంధం బహుశా జన్మలదేమో అనుకున్నాను నేను...
                               

                                అస్తమానం ద్రాక్షారం సంబంధం అంటూ అప్పదాసుని హేళన చేసే బుచ్చి...ఆ సంబంధం  అసలు లేదని చెప్పేసరికి అందరికీ ఆనందంగా గెంతుతూ చెప్తాడు అప్పాదాసు.ఆ సంతోషంతోనో... జబ్బు పడిన భార్య ముందు చనిపోతున్దేమోననే బెంగ తోనో అప్పాదాసు కన్ను మూయడంతో చిత్రం పూర్తవుతుంది.
                                 
                              కథకి అనుగుణంగా  చేసిన మార్పులు కథ అందాన్ని ఎక్కడా తగ్గించలేదు.బుచ్చి లక్ష్మి పాత్రలో జాతీయ నటి 'లక్ష్మిపరకాయ ప్రవేశం చేసింది.అప్పదాసు పాత్రలో బాలసుబ్రహ్మణ్యం నటన కూడా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ గంటల కాలాన్ని వెచ్చించి తప్పక చూడదగ్గ సినిమా ఈ "మిథునం".
                              
                               త్రిపాత్రాభినయం చేసిన (కథ...మాటలు...దర్శకత్వం) భరణి గారు అభినందనీయులు...
కళాదర్శకుడు సంగీత దర్శకులు పూర్తిగా న్యాయం చేసారు. చిత్రం ఎలా ఉంది అని మళ్ళీ చెప్పాలంటారా?...
"అద్భుతః "
       

చివరగా చిన్నమాట : 'అప్పదాసు 'పాత్ర భరణి గారు చేసి ఉంటె ఇంకా బాగుండేది.నటుడిగా ఆయన్ను పలు చిత్రాల్లో చూసాక నా మనసులో పుట్టిన భావం ఇది..............
                                                                                                            @శ్రీ