31/08/2012

అదే...అదే...అదే...రవి కిరణం...
ముకుళించిన 
అరవిందాన్ని
వెచ్చగా స్పృశిస్తూ...
చెప్పేది...

చల్లని వెన్నెల... 
కొలను లోని 
కలువబాలను 
మెత్తగా తాకుతూ...
రహస్యంగా 
చెప్పేది....

నదీనదాలు... 
తమ వయ్యారపు  
వంపుసొంపులు 
చూపుతూ...
తమ ప్రియుని చేరే వేళ 
గలగలలాడుతూ 
చెప్పేది...

నురుగుల తరగ...
వడి వడి నడకలతో
ఉత్తేజంగా కదులుతూ 
తీరాన్ని తాకుతూ
చెప్పేది...

కరిమబ్బు...
మెరుపు తీగల 
వెలుగులతో 
నిశను ఝల్లున తాకుతూ
చెప్పేది...

పరిమళ భరిత
మకరందాన్ని గ్రోలుతూ
మత్తెక్కిన భ్రమరం..
విరికన్యకు తీయగా 
చెప్పేది...

ఆర్తిగా నోరు తెరిచిన
ముత్యపు చిప్పలో 
జారుతూ... ముత్యమయ్యే 
స్వాతి చినుకు చెప్పేది....

అనుక్షణం...
నా మనసు నీ మనసుకు 
చెప్పేది...
అదే....అదే...అదే..


27/08/2012

కృతజ్ఞతాంజలి.


నాకు చిన్నపుడు  అక్షరాభ్యాసం చేసిన 
శ్రీ కందుకూరి శ్రీరామచంద్రమూర్తిగారి
పాద పద్మములకు శిరసు వంచి నమస్సుమాంజలి అర్పించుకుంటున్నాను... 


నీవు చదువుకునే రోజుల్లో ఏవేవో వ్రాసేవాడివి కదా...ఇపుడు మళ్ళీ వ్రాయవచ్చుకదా! 
అంటూ ఈ బ్లాగ్ మొదలు పెట్టడానికి ప్రోత్సహాన్నిచ్చిన బాల్య మిత్రులకు ప్రత్యేకమైన 
కృతజ్ఞతాంజలి. పూజ్యులు శ్రీ రాజారావు ,శ్రీ శర్మ ,
శ్రీ శ్యామల రావు,శ్రీ సుధామ

శ్రీ /శ్రీమతి/కుమారి ...
( తగిన సంబోధన వారి పేర్ల ముందు తగిలించుకొనవలసినదిగా  ప్రార్థన.) :-)

సుబ్రహ్మణ్యం,భాస్కర్,ఫాతిమా,జలతారు వెన్నెల,యోహంత్,రమేష్ 
పద్మరాజి ,మధురవాణి ,సృజన, ప్రేరణ , ప్రిన్స్ ,anrd,అనుపమ 
హర్ష,అనికేత్, ఆనంద్ ,భారతి, వీణ ,శ్రీలక్ష్మి,లిఖిత,కృష్ణప్రియ,సాయి, 
చిన్ని ఆశ, నాగేంద్ర ,వనజ వనమాలీ,సీత,కే.ఆనంద్ ,మానస కిరణ్ ,
లక్ష్మీ దేవిరసజ్ఞ  , మోహన్ , కే క్యూబ్ వర్మ ,రవి శేఖర్ ,ఫణీంద్ర 
మంజు, జ్యోతి ,మాలా కుమార్ ,వాసుదేవ్ , ఫణి, అక్షర కుమార్ , 123 

మీరంతా నేను వ్రాసిన టపాలను మీ సమయం వెచ్చించి చదివి 
మీ అభిప్రాయాలను తెలియజేస్తూ...
ప్రతి టపాకూ ముందంజ వేయమని ప్రోత్సాహాన్ని అందించి నందుకు...
(స్పందనలు తెలియజేసిన వారి పేరు ఎవరిదైనా మిస్ అయితే మన్నించాలి)
ధన్యవాదాల సుమాంజలి....
అలాగే...స్పందన తెలియ జేయక పోయినా...
నా టపాలను చదివిన అందరు బ్లాగ్ వీక్షకులకూ,
నా బ్లాగ్ ఫాలో  అవుతున్న మిత్రులందరికీ నా 
హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


అలాగే నా బ్లాగ్ ని చేర్చుకున్న 
కూడలి...మాలిక...హారం...బ్లాగర్స్ వరల్డ్ లకు కూడా 
నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

నేను ఇతరుల బ్లాగ్ లలో చేసే వ్యాఖ్యల వలన  గానీ,
నా ప్రతిస్పందనల వలన గానీ,
ఎవరైనా నొచ్చుకుంటే....క్షంతవ్యుడిని...
అవి కేవలం స్నేహ పూర్వకంగానే తీసుకొమ్మని ప్రార్థన...

నేను చూసే బ్లాగ్ లలో కొన్ని చూసినపుడు నాకు అనిపించే భావాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను...

నాకు నచ్చే విషయం:
ఏ బ్లాగ్ లో నైనా ఆ టాపిక్ పూర్తిగా చదివి 
దానికి తగిన వ్యాఖ్యని ఇవ్వటం...
వారిని ప్రోత్సహించేలా..అది ఎవరి స్పందనైనా కావచ్చు...

నాకు నచ్చని విషయం
1.వ్యాఖ్యకి "టపా వ్రాసిన వారు"కాకుండా "వేరే వారు ఆ వ్యాఖ్యకి సమాధానం ఇవ్వడం."
2.వ్యాఖ్య  చేసేటపుడు సభ్యతని మరచి స్పందించడం..
3. టపా వ్రాసిన వారిని ఉద్దేశపూర్వకంగా ఎద్దేవా చేయటం...
అవహేళన చేయటం...అమర్యాదపూర్వకంగా వ్యాఖ్యానించడం...

నా అభిప్రాయాలను మీ అందరితో పంచుకుంటున్నాను ఇలా...
మీ ఆదరణ, అభిమానం, స్నేహం, ప్రోత్సాహం మున్ముందు కూడా ఇలాగే ఉంటుందని ఆశిస్తూ 
మీ మిత్రుడు


24/08/2012

చంద్ర హాసాల "చంద్ర హాసాలు".వెన్నెల రాత్రుల చిత్రాలు ఇక్కడ ఈ వీడియోలో  చూడండి.

వెన్నెల 

క్షీర సాగరాన్ని
చిలికితే వచ్చిన వెన్న గోళం చిమ్మే 
దివ్య కాంతి పుంజాలు...

రజనీకాంతకు శశికాంతుడు పంపిన 
వెలుగు జిలుగుల 
పాల నురుగుల  జలతారు వలువలు...

ప్రకృతి కన్నె  కప్పుకున్న చీకటి వస్త్రంపై 
వెండి కుంచెతో నెలరాజు 
  వ్రాసుకున్న ప్రేమ లేఖలు...

తారా శశాంకుల సరసాల సయ్యాటలలో 
  విసురుకున్న పారిజాతపు రేకుల తుఫానులు...

నీలి అంబరాన విరిసిన రజత కమలం 
వెదజల్లే శ్వేత ప్రభలు...

పగలంతా తాపంతో,
రాత్రి విరహ తాపంతో...
వేగి వేడెక్కిన 
నిశా సుందరిని చల్లబరిచే
  సోముని శీతల సుధా చంద్రికలు...

చంద్రుని చాటు చేసుకొని 
ప్రేమికులపై కాముడు  సంధించే ధవళ  శృంగార అస్త్రాలు 

నీవు నాచెంత  ఉన్నపుడు నను ముంచెత్తే 
నీ ప్రేమ వెలుగుల పరవళ్ళు...

ఒంటరిగా  నేనున్నపుడు... నన్ను వెంటాడి వేటాడే 
వెండి వేట కొడవళ్ళు.....
గాయం కనపడకుండా  'నా మనసుని' 
కోసే చంద్ర హాసాల "చంద్ర హాసాలు".
ఇది నా 100వ టపా...
వంద టపాలు వ్రాయటం  కొంతమంది బ్లాగర్స్ కి  మంచినీళ్ళ ప్రాయం.
కానీ ఆ సంఖ్య  క్రికెట్లో ఎంత ప్రాముఖ్యమైనదో మనకి తెలుసు.
అందుకని ఈ వంద సంఖ్యని అందుకున్నందుకు..
నాకు చాలా సంతోషంగా ఉందండీ!
నా సంతోషాన్ని నా బ్లాగ్ మిత్రబృందంతో  పంచుకుంటున్నాను...
నా 101 వ టపా చూడటం మర్చిపోవద్దు...
@మీ మిత్రుడు 'శ్రీ' 
17/08/2012

లోహ విహంగాల చప్పుడు...లోహ విహంగాల చప్పుడు బాల్యంలో చాలా యిష్టం...
ఆకాశంలో కదలని రెక్కలతో వేగంగా ముందుకు
దూసుకుపోతుంటే చూడటం ఎంతో యిష్టం...
అంతా నా వంకే చూస్తున్నారనే భ్రమతో 
చేతులు ఊపుతూ చూడటం మరీ ఇష్టం...

పరుగులు పెట్టి బైటికి వచ్చి 
ముందు నేనే చూడాలని,
అందరికీ నేనే చూపాలనే ఉత్సాహం.
తర్వాత పడే బెత్తం దెబ్బలు సైతం 
లక్ష్యం చేయనని  మొండితనం.

ఇష్టం పెరిగింది వయసుతో...
అదే ఉత్సాహం పిల్లలలో...
వారిలో నన్ను నేను చూసుకుంటూ...
అదే ఉత్సాహం...అంతే ఆనందం..

రెక్కలొచ్చిన  పిల్లలు గూడు వదిలి
అదృశ్యమయ్యారు 
ఆ విహంగాల హోరులో...

రాలేరు  వెనుదిరిగి
డాలర్ల మోజు తీరకుండా...
కాలేరు దూరం 
పబ్బుల కల్చరు నుంచి..
బైట పడలేరు 
కేసినోల వలనుంచి....


సంక్రాంతి  లేదు ,ఉగాది లేదు...
దసరా, దీపావళి తెలియనే లేదు...
పలకరింపుకి సమయం లేదు...
మెయిలు తప్ప మాట లేదు...

ఇపుడు కూడా 
ఆ విహంగాల చప్పుడు అంతే ఇష్టం...
ఇప్పుడు కాక పోయినా ,
ఎప్పటికైనా... 
వారిని తిరిగి తెచ్చేది ఆ చప్పుళ్ళేననే ఆశతో...14/08/2012

స్వర్ణ భారత్.....నిత్యం పరవళ్ళు తొక్కే నదీ,నదాలతో
నిరంతరం సాగే  ప్రవాహాలతో 
ఉరికే  జలపాతాలతో 
నిండి ఉంది మనదేశం 
అయినా  త్రాగేందుకు గుక్కెడు నీరు కొనుక్కొనే
దౌర్భాగ్యమే మన భాగ్యం...

ప్రత్తి పంటకి  లేదు కొదవ...
వస్త్రోత్పత్తికి లేదు లోటు....
అయినా బీదరాలికి 
చిరుగు చీరేలే శరణ్యం...

సస్యశ్యామలం  మన దేశం...
ఆహార ధాన్యాలు నిండిన  భాండాగారం..
అయినా..
ఆకలి చావులు రోజూ తప్పని వైనం..
కుపోషణతో చిన్నారులు నిత్యం  కంటపడే  దృశ్యం.

యత్ర నారీ అస్తు పూజ్యంతే  రమంతే తత్ర దేవతా!

అన్న శ్లోకం పుట్టింది ఈ భూమి పైనే....


నేడు అభినవ దుశ్శాసన,కీచకుల వారసులు 

అడుగడుగునా కనిపించేదీ ఇక్కడే....

గర్భంలోనే ఆడకూనలని విచ్చిన్నం చేసేదీ ఈ గడ్డ మీదే.


నాడు శాస్త్రీయ సంగీత నృత్యాలు పుట్టినది ఈ భూమిలోనే...

నేడు అర్థనగ్న నృత్యాల  డిస్కోథెక్ లు పెరుగుతున్నదీ ఇక్కడే... నాడు వైవాహిక వ్యవస్థ ఊపిరి పోసుకున్నదిక్కడే...

నేడు సహజీవనం (living together) అనే  

కుసంస్కృతి నెమ్మదిగా కాళ్లూనుతోందీ ఇక్కడే...


నాడు న్యాయానికీ,ధర్మానికీ పట్టుకొమ్మ మనదేశం...

నేడు అక్రమార్క  నేతలు మన సొత్తు..

ఆ నాయకుల  చేతిలో  మన విత్త వ్యవస్థ అవుతోంది చిత్తు.
'భారత్ వెలిగిపోతోంది' అని ఒక పార్టీ అన్నా...

'మేరాభారత్ మహాన్' అని ఇంకో పార్టీ అన్నా...

వాస్తవాల్ని చూద్దాం...

న్యాయం కోసం పోరాడుదాం..

అవినీతిని అంతం చేద్దాం 

చేయి, చేయి కలుపుదాం....

బంగారు భారతాన్ని  నిర్మిద్దాం...
బాపు కలలు కన్న భారత దేశాన్ని


నేడు కాకున్నా రేపైనా 

నిర్మించగలమని ఆశతో జీవిద్దాం...
  

  (బ్లాగ్ మిత్రులందరికీ...స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు...)

11/08/2012

దూరమౌదామనే... దగ్గరయ్యావని......                              

మసక చీకటిలో 
మెరిసే విద్యుల్లతలా  కనిపిస్తావు 
దరి చేరే లోగా 
మెరుపు వేగంతో మాయమౌతావు  

మంచుతెరల వెనుక...
స్నిగ్ధ కుసుమంలా కనిపిస్తుంటావు
అనావరణం చేసేలోగా 
శీతలబాష్పంలా కరిగిపోతుంటావు 

దగ్గరకొచ్చినట్లే .వచ్చి
చేతికి చిక్కినట్లే చిక్కి....
ఎక్కడెక్కడికో వెళ్లి పోతుంటావు...

ప్రేమ రాహిత్యంతో 
ఎంత కాలమీ ఎదురు చూపులు?
నను ఏడిపించడానికే 
చేస్తున్నావనుకున్నాను.
సరదాకి ఆడే  
దోబూచులాటలనుకున్నాను 

ఇపుడిపుడే తెలుస్తోంది....
నువ్వు నాకు దూరమౌదామనే...
దగ్గరయ్యావని......                     

09/08/2012

శృంగారార్చన???

                                 
                                         (నేను చేసిన ఈ వీడియో తిలకించండి.)
                                            
ఆసనం ఎందుకు?
    క్రీడాపర్వతం ఉండగా...
అర్ఘ్య పాద్యాలెందుకు?
    ఎదురుగా యమున ఉందిగా...

ధ్యానం వేరే యెందుకు?..
   ఎపుడూ నీ ధ్యానమేగా...
పుష్పం కావలెనా?
    నీ హృదయ కుసుమం ఉందిగా...

పత్రం ఎందుకు?
    శతపత్ర దళ నేత్రాలుండగా...
స్నానమెందుకు?
   నీ వలపుల జల్లు ఉందిగా...

అక్షతలెందుకు?
   క్షతం కాని నీ ప్రేమ ఉండగా...
చామరమెందుకు?
   నీ నీలి కురుల వింజామర ఉందిగా...

మధుర  గీతాలు వద్దు.. 
   నీ మాటల సంగీతాలే చాలు...
అగరు పొగలు వద్దు..
   విరహపు సెగలే చాలు... 

శ్రీ చందనాలు వద్దు...
   నీ మేని పరిమళమే  చాలు 
 పంచామృతాలు వద్దు...
   నీ  పెదవుల మధువులు చాలు...

నైవేద్యం వద్దు...
   నీ సాన్నిధ్యం చాలు...
ఘంటారావాలు వద్దు...
   నీ కాలి అందెల సవ్వడులే చాలు...

మంగళ తూర్యారావాలు వద్దు...
   నీ రతనాల మొలనూలు తాళమే మేలు..
నీరాజనం వద్దు... 
  నా రాధ హా'రతులు' చాలు......

స్వస్తి వాచకం వద్దు...
  క్రియల పునరావృతమే నీ మాధవునికి ముద్దు...

( శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా...అష్టమి నాటి జన్ముడు,
అష్ట భామల నాథుడు...అష్టైశ్వర్య ప్రదాత....అయిన 
ఆ దేవదేవునికి నేను అర్పించుకొనే అష్ట కవితా సుమార్పణంలో 
సహకరించి  ప్రోత్సహించిన బ్లాగ్ మిత్రులకి కృతఙ్ఞతలు సమర్పిస్తూ..
అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తూ...
ఈ కవితాసుమాంజలిని శృంగారమూర్తులైన రాధాకృష్ణులకు
నీరాజనంగా సమర్పించుకుంటున్న ' శ్రీ ' )

06/08/2012

రాధా మోహనం

నా ఎదుట నీవున్నట్లు
నా ఎదలో నీవు కదిలినట్లు
నీతో నేను నడిచినట్లు
నీ నీడలో నేను  కలిసినట్లు

నీ పిలుపు మంజీరనాదమై మ్రోగినట్లు....
నీ మురళీరవం నా చెవికి సోకినట్లు
నా ఒడిని నీవు చేరినట్లు..
నా కలలో నీవు కరిగినట్లు...

నా శ్వాస వేగమైనట్లు...
నా పరువం నాకే భారమైనట్లు....

పారిజాతాలు గడ్డిపూలైనట్లు...
గరిక పానుపు ముళ్ళ పానుపైనట్లు...
బృందావనం కంటకవనమైనట్లు...
చంద్రుడే మండినట్లు..చీకటే నవ్వినట్లు....

అష్ట భార్యలు నిన్ను చుట్టుముట్టినట్లు...
గోపికలంతా నీ చెంత ఉన్నట్లు...
నన్నసలు నీవు తలవనట్లు...

నీకోసం పరితపించె  నా హృదయం...
నీకోసం వేచి చూసె నా నయనం...
నీకు తెలియదు కు'మారుడు' పంచప్రాణాలు తీస్తున్న వైనం...


ఊహలలోనే......
నా కంఠముక్తావళి నీ గుండెలపై జారె...
నీ నుదుట కస్తూరి నా ఎదపై కరిగె...
నీ శిఖపింఛము నా మెడను నిమిరె...
నీవు నా సిగ్గులు దోచె.. నా  విరహం తీర్చె


హత్తుకొనె...నా మనసును నీ మనసు...
లీనమయ్యె నీరాధ..తన మాధవునిలో...02/08/2012

భామ! సత్యభామ!
రుక్మిణికి ఇచ్చినది 
శచీంద్రుని నందనోద్యాన పారిజాతం 
నీకేపుడో ఇచ్చేసినది 
సత్యేంద్రుని మనోవన పారిజాతం.

నను వరించి వచ్చిన 
వనితామణులు ఆ ఏడుగురు.
దివ్యమణితో లభించిన 
షోడశకలానిధివి నీవు.

నీ శౌర్యం... 
అణచింది నరకుని క్రౌర్యం 
రౌద్ర రసంలోనూ తొణికింది
నీ అపురూప సౌందర్యం....

నీతో ప్రణయం 
తుషార బిందు మాలికామయం
నీతో కలహం 
మృగ మరీచికా సమూహం... 

నీ వలపు వీక్షణలు 
మదనుడెక్కుబెట్టిన శృంగార అస్త్రాలు..
నీ కోపపు చూపులు
గరళం పూసిన కరకు శరాలు...

మీరను నీ యానతి...
దాటను నీవు గీసిన గీత...
కోపాగ్నికి ఎర్రబడిన నీకు...
వెన్నముద్దలు తిని, 
నవనీతభరితమైన 
నా అధరపు మధువే లేపనం...

నీ మెత్తని పాదంతో మొదలు పెట్టనీ...
మెల్లగా హద్దులన్నీ దాటనీ...
నీ అలుకలు తీరేదాక...
నా బిగికౌగిలిలో ఒదిగే దాక...