30/12/2012

"నిర్భయ"కామాంధుల చేతిలో 
బలి అయిన  నిర్భయ కోసం 
భారతావని 
కంట తడి పెట్టింది.
కొత్త సంవత్సరపు 
సంబరాలను చేసుకోమనే 
శపధాలు వినిపించాయి.
ఫేస్ బుక్ టైం లైన్లలో
వాగ్దానాలు కనిపించాయి.
పట్టణాల్లో కొన్ని చౌరస్తాల్లో 
కొవ్వొత్తులు వెలిగించారు 
'నిర్భయ' ఆత్మశాంతికి 
నివాళులర్పించారు.

పురుషులు 
సాయంకాలం 
తమకిష్టమైన క్లబ్బుల్లో 
నచ్చిన వైను చుక్కలతో గొంతు 
తడుపుకున్నారు.
కిళ్ళీ బడ్డీల దగ్గర 
లేటెస్ట్ ఐటెం సాంగుల గురించి 
చర్చిస్తూ వెకిలి నవ్వులు నవ్వుకున్నారు.
అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో 
డేటింగులకి వెళ్ళారు.
స్త్రీలు తమకిష్టమైన 
సీరియళ్ళు చూసుకున్నారు.
కుర్రకారు ఎప్పటిలాగే 
అసభ్యపు జోకులతో ఈ సాయంత్రం కూడా 
ఆమ్మాయిలను వేధించారు.

ఎక్కడో ఎ మూలో మరో నిర్భయ 
ఏ మదాంధుల కామానికో 
బలియై పోతూ ఉంటుంది.
ఎక్కడో మరో కుసుమం 
నేలరాలి పోతూ ఉంటుంది.
ఎక్కడో మరో అబల
కన్నీటితో సాయం కోసం 
అరణ్య రోదన చేస్తూ ఉంటుంది.

కొత్త సంవత్సరపు సంబరాలకి 
ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరో రెండు రోజుల్లో 
లెక్కలేని గాలన్ల 
మద్యం ఏరులై పారేందుకు 
సిద్ధమౌతోంది.
బార్లు,రెస్టారెంటులు 
ముందస్తు బుకింగు  
చేసుకొంటున్నాయి.
వ్యాపార చానెళ్ళు 
తమ ప్రోగ్రామ్స్ 
పబ్లిసిటీ చేసుకుంటూ ఉన్నారు.

ఇదేనా మనమిచ్చే నివాళి?
ఒక్క సారి ఒక్క చుక్క కన్నీరేనా వదిలేది?
ఆ మదాంధులకి శిక్ష పడుతుందో లేదో తెలీదు.
వాళ్ళను తప్పించేందుకు 
ఎన్ని జేబులు బరువెక్కుతున్నాయో తెలియదు.

ఈ "నిర్భయ" (2012)నామ సంవత్సరం 
ఆఖరి రోజంటే...
ఆ మృగాలకు  సరైన శిక్ష పడిన రోజే.
మహిళల రక్షణకి సరైన 
చట్టం చేసిన రోజే...
ఆ చట్టాన్ని సరిగా అమలు చేసిన రోజే...
దేశంలోని  ప్రతి మహిళా "నిర్భయంగా"
బైటకి వెళ్ళగలిగిన రోజే...

"నిర్భయ"కి దుఖాశ్రువుల తో నివాళులర్పిస్తూ ...@శ్రీ