నీ తలపులలో నారూపాన్నే చూస్తూ ఆరూపం చూసే చూపులకు సిగ్గుపడిన చెక్కిలి గులాబి రేకులను నీ చేతిలోనే పండాలని తహతహలాడే గోరింటలో కలిపి అలదుకున్న అరచేతులు మంకెనలని పరిహసిస్తున్నాయి...కెంపులని ధిక్కరిస్తున్నాయి.
కట్టుకున్న పట్టుపావడా పట్టు లాంటి నీ మేనుపై కొత్తశోభను సంతరించుకొంది. విరిబోణి అందాలను దాచలేని తెల్ల ఓణి అవస్థ పడుతోంది. నీ సౌందర్యనిధులకి కావలి ఉన్నట్లుగా కనబడుతోంది.
పూలబాణాల విలుకాని చెరకువింటి నారిలా మల్లెమాలలు తురుముకొని బంగారు జడగంటలు మోగిస్తూ యవ్వనాన్ని అదిలిస్తూ నీ ఒంపులను అనుకరిస్తూ మెలికలు తిరుగుతోంది నేను మెచ్చిన వాలుజడ నీలికురుల నాగమాలిక
నాప్రేమ రంగరించిన పారాణి పూతలకి కెందామరలుగ మారాయో పెట్టుకున్న గోరింటకు నీ కాలి మువ్వల రాత్రి ఊసులతో జతకలిపి మరింత ఎరుపెక్కాయో కట్టిన పరికిణీ బంగారుజరీ తగిలి కందాయో తెలియని నీ పాదాల సౌందర్యానికి తూరుపు దిక్కు సిందూరం సలాములంటోంది.
మర్రిమానుకి కట్టిన పూల ఊయలదే భాగ్యం ఏడుమల్లెలెత్తు సౌకుమార్యానికి ఆసనమయ్యిందనే గర్వం. తామరతూళ్ళకి పాఠాలు చెప్పే చేతులకి ఆసరా ఇచ్చానన్న అతిశయంతో డోలనాలు చేస్తోంది.
వెన్నెలమ్మ నోము పట్టడం మొదలెట్టకుండానే నీ మోము చూచి ఉపవాసం చాలించింది నక్షత్రాలు నీ నవ్వులు చూసి తమ పని లేదని వేకువలో దాగేందుకు పరుగెత్తి పోయాయి. నీ కిలకిలలతొ శుకపికాలు మేల్కొన్నాయి.
తదియనాటి చందమామ కోసం నీవు చూస్తుంటావు చంద్రదర్శనం చేసే జాబిల్లిని అబ్బురంగా నేను చూస్తుంటాను. @శ్రీ