03/06/2012

"నా ఏకాంతం......అత్యంత స్పష్టంగా"


నిను  చూడాలని ఉన్నప్పుడు 
కనులు మూసి.....నీ రూపాన్ని తలచుకుంటూ..
నీతో గడిపిన వెన్నెల రాత్రులు గుర్తు చేసుకుంటూ...
నీతో ఉన్నప్పటి మధుర క్షణాలను
మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటూ.... 
అలా స్వప్నాల  లోనికి మెల్లగా జారుకుంటాను.... 

నీ ప్రణయ పరిమళాన్ని చూస్తాను...
నీ స్నేహసౌరభాన్నీ  చూస్తాను....
ఇంకా ఎన్నో.......కంటికి కనిపించని భావాలు... 
అనుభూతుల ద్వారా మాత్రమే తెలుసుకోనేవి..
ఒకదాని వెనుక మరొకటి...
చలనచిత్రం లోని దృశ్యాల్లా కదులుతూ ఉంటాయి మెల్లగా...

నీ రూపం మాత్రం అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది...
మంచు  తెరల చాటు ముగ్ధ కుసుమంలా...
మేఘ మాలికల చాటు చంద్రబింబంలా...

కనులు తెరిస్తే స్వప్నం చెదిరి పోతుందేమోనని 
భయపడుతూనే....
నిన్ను చూడాలనే తపనతో
కనులు తెరిచి చూస్తాను.....

నా ఎదురుగా నను వెక్కిరిస్తూ కనిపిస్తుంది  
"నా ఏకాంతం......అత్యంత  స్పష్టంగా" .....