03/11/2012

ప్రేమంటే నీకు తెలుసా?
ప్రేమంటే నీకు తెలుసా? 
అంటూ అలా ఒక్కసారిగా 
అడిగేస్తే ఎలా?

ప్రత్యూషపు కాంతి 
నిన్ను చూసి
ఇంకా తెలవారకుండా 
వచ్చానేమిటా???
అంటూ సందేహించే సమయంలో...
రాత్రంతా ధనుర్మాసం చలిలో 
మంచులో తడుస్తూ...
చుక్కల ముగ్గులేసేందుకు 
నువ్వెప్పుడొస్తావో...అనుకుంటూ 
నీకోసం  ఎదురు చూసే 
కళ్ళలోకి చూస్తే తెలిసేది 
నీవంటే నాకు ఎంత ఆరాధనో?

పొలం గట్లపై 
వయ్యారంగా నీవు నడుస్తూ 
మన్మథుని చేతి కొరడా లాంటి 
నీ వాల్జడ ఝుళిపిస్తే 
ఒక్క సారైనా 
నా ముఖంమీద 
తగలకపోతుందా?
అనుకుంటూ ఆశగా 
నీ వెనుక 
వేసే సడిలేని నా అడుగులు 
గమనిస్తే తెలిసేది 
నీవంటే నాకు  ఎంత ఇష్టమో?

నేను సైకిలు కొనుక్కున్నా,
దాన్ని నీకు పదడుగుల 
దూరంలో 
మెల్లగా నడిపిస్తూ
మనమధ్య దూరాన్ని మనో నేత్రం తో 
అంచనా వేస్తూ...
నీ సిగలో పువ్వో..
నీ నవ్వుల సిరిమల్లియో 
జారిపడితే 
ఎపుడు దోసిలి పడదామా?
అనుకొనే 
నా ఆరాటం చూస్తే తెలిసేది 
నీపై నాకు ఎంత ఇష్టమో!

క్లాసులో 
నీ అరచేతిలో పడిన 
బెత్తపు దెబ్బ
నా కంటికి ఛళ్ళున 
తగిలి తుళ్ళి పడిన 
నీటిచుక్కని చూస్తే తెలిసేది 
నీవంటే నాకెంత ప్రేమో!...

శరద్పూర్ణిమ నాటి 
జలతారు వెన్నెలలో...
చలువరాతి తీరాన్ని చూస్తూ 
నర్మదా ప్రవాహంలో 
నౌకా విహారం చేస్తూ...
మెలమెల్లగా నేను  చుక్కాని వేస్తూ....
నా ప్రేమ మీద నీకు సందేహమా?
అంటూ నిన్నడిగే ప్రశ్నకి 
బదులివ్వక 
మౌనమే  సమాధానమంటూ...
'చిన్నగా నవ్వే 
నీ మనసులో నామీద దాచుకున్న
అనంతమైన  ప్రేమ'ను 
అడిగితే తెలిసేది నీవంటే నాకెంత ప్రేమో?

ఎన్ని జన్మల బంధమో!
అని నీవంటే 
ఇదే 'తొలిజన్మ' అయితే 
ఎంత బాగుంటుంది ?
అనుకునే నా స్వార్థాన్ని 
అడిగితే తెలుస్తుంది నీవంటే 
నాకు ఎంత ప్రాణమో!

ఇన్నేళ్ళయినా 
తరగని ప్రేమ నాదంటే 
నాదని ఇప్పటికీ 
మనం  ప్రేమగా పోట్లాడుకొనే 
ఆ మధురమైన 
దృశ్యాన్ని చూస్తే....
తెలుస్తుంది 
.....
నీవంటే నాకు,
నేనంటే నీకు 
ఎంత ప్రేమో! అని .................                             -@శ్రీ