19/07/2012

వెన్నచుక్కనే అద్దాలి నీకు....


కన్నయ్యకి గాలి సోకిందో ఏమో!
ఇరుగు పొరుగు వారి దృష్టి పడిందో?
లేక నా దిష్టే తగిలిందో?

బంతి విసిరితే చేతితో పట్టడం మాని
వింత శబ్దాలు చేస్తూ
మూతితో కింద పడకుండ
ఆడుతుంటావు... 

సంధ్యవేళ అయితే చాలు...
సింహంలా గర్జిస్తూ...
చేతులు పంజాల్లా విప్పుతుంటావు...

విప్రబాలకులు కనిపిస్తే చాలు...
మూడు  వేళ్ళు  చూపిస్తూ
పెద్ద పెద్ద అంగలేస్తుంటావు

రాజుల కథలు చెప్తుంటే...
ఏదీ నా పరశువు అంటూ...
వెదుకుతుంటావు  ఇల్లంతా...

రామా లాలీ! అంటూ జోల పాడుతుంటే...
హా లక్ష్మణా! హా సీతా! అంటూ
విల్లెక్కడ అని అడుగుతుంటావు...

రోజూ బలరామునికి పెట్టే 
నల్లని చుక్కే దిష్టి తగలకుండా 
పెడుతున్నాను కదా!
రేపటినుంచి అందరూ చూసేలా 
వెన్నచుక్కనే అద్దాలి నీకు....