27/07/2012

ఏమిటి నీ గొప్ప కృష్ణా???


















పూతనను చంపుట గొప్పకాదు కృష్ణా!
నాలోని  కామ రక్కసిని చంపి చూపవయ్యా!

బండిని  కూల్చుట ఏమి గొప్ప గోవిందా!
నా బాధ్యతల బండిని మోసి చూపవయ్యా!

సుడిగాలిని చుట్టేసానని గర్వం ఎందుకు గదాధరా!
మోహపు దారినుంచి నాదారి మళ్ళించి  చూపవయ్యా!

లేగదూడను చంపి పొగడ్తలందుకోవడం  కాదు ముకుందా!
నాలోని క్రోధగుణాన్ని అణగార్చి  చూపవయ్యా!

కొండచిలువను చీల్చడం ఏమి ప్రతాపం పురుషోత్తమా!
నాలోని లోభగుణాన్ని చీల్చి చూపవయ్యా!

ఖరాన్ని చంపడం ఏమంత పెద్ద పని పంకజనాభా!
నాలోని మదాన్ని దునుమాడి చూపవయ్యా!

బకాన్ని సంహరించడం బాలుర పని భక్తరక్షకా!
నాలోన్ని మాత్సర్యాన్ని తెగనరికి చూపవయ్యా!

కాళీయునిపై నాట్యం చేయుట బ్రహ్మవిద్య కాదు బ్రహ్మాండ నాయకా!
నాలోని  పాపాలఫణిని పాతాళానికి తొక్కి చూపవయ్యా!

మద్దిచెట్లను కూల్చడానికి నీకు రోలు సాయపడింది మురారీ!
నాలో పెరిగిన అహంకారాన్ని ఎలా కూలుస్తావో చెప్పవయ్యా!

కుబ్జకున్న వక్రాలు తీసావేమోగాని కౌస్తుభధరా!
నా వక్రబుద్ధిని సరి చేసి చూపవేమయ్యా!

ఎద్దుని చంపి ఎదురులేదని గర్వించకు  గరుడధ్వజా!
నాకెదురు లేదనే  గర్వాన్ని  అణచి చూపవయ్యా!

అశ్వాన్ని చంపి వీరత్వాన్ని చూపకు వనమాలీ!
ఇలా నిన్ను ప్రశ్నించే నా అల్పత్వాన్ని క్షమించి చూపవయ్యా!