19/12/2016

|| చెప్పవలెనా - తెలుగు గజల్ ||
కలలు గుచ్చిన సూదులన్నీ తీయలేనని చెప్పవలెనా
కనుల పొంగిన రుధిరధారను ఆపలేనని చెప్పవలెనా

దారితప్పిన  వసంతానికి చేరువయ్యే రోజులెపుడో
చివురులేసిన వియోగాలను తుంచలేనని చెప్పవలెనా

కలిసి గడిపిన క్షణములన్నీ నన్ను విడిచినవెందుకోమరి 
ఎదురుచూపుల యుగాలన్నీ మోయలేనని చెప్పవలెనా

దిక్కు తెలియని ఒడ్డునెరుగని చోటులోనే వదలినావు  
సుడులుతిరిగే  శోకనదమును ఈదలేనని చెప్పవలెనా

ప్రాణమంటే తీపిలేదు మరణమంటే భయములేదు 
నిన్నుచూడక నిమిషమైనా బతకలేనని చెప్పవలెనా

మనసునిండా వెన్నెలిచ్చిన చందమామవు నీవుకాదా 
నీవు లేనిచొ  నిశలసేనను గెలవలేనని చెప్పవలెనా

నీవు చేసిన బాసలన్నీ నీటిరాతలు  "ఓ నెలరాజ"
చేయిపట్టిన చేతినెపుడూ వదలలేనని చెప్పవలెనా   #శ్రీ .