03/12/2016

|| చూసావా ఎపుడైనా - తెలుగు గజల్ ||కాలమెలా పొడిచిందో చూసావా ఎపుడైనా 
రుధిరమెలా చిందిందో కన్నావా ఎపుడైనా

నా కన్నుల నీరు చూసి గేలిచేస్తు ఉంటావు 
శోకమెంత  కురిసిందో అడిగావా ఎపుడైనా

ఆరాధన నీదేనని గర్వించుట నీకు తెలుసు 
మనసుతోటి నీరాజనమిచ్చావా ఎపుడైనా

నను కమ్మిన వేళలోన ముఖం చాటుచేస్తావు 
చూపులతో చీకట్లను తరిమావా ఎపుడైనా

పోరాడిన ప్రతిసారీ నన్ను గెలిచిపోతున్నది 
వేదనతో యుద్ధాలను చేసావా ఎపుడైనా

గుండెకైన గాయాలను మౌనంతో రేపుతావు 
మాటలతో నవనీతం పూసావా ఎపుడైనా

ఇద్దరిదీ ఒకేబాట అంటూనే "నెలరాజా"  
అడుగులోన అడుగువేసి నడిచావా ఎపుడైనా   
                                                                          #శ్రీ