18/02/2013

స్వార్ధం



వేకువ చీకటిని చీల్చే క్షణంలో
మంచుతెరలను తొలగిస్తూ 
నీ నుదుటిని తాకే తొలికిరణం 
నేనే కావాలనుకొనే స్వార్ధం నాది.

నిదుర లేచిన నీ కనులు 
మొదట చూసే దృశ్యం 
నా ముఖమవ్వాలనుకొనే స్వార్ధం నాది.

నీ తడికురులు నా పెదవులపై 
చేసే లాస్యంతో 
మేలుకోవాలనే స్వార్ధం.నాది.

కన్ను తెరిచి మబ్బుకమ్మిన 
మచ్చలేని చందమామను 
ఉదయాన్నేచూడాలనే 
స్వార్ధం నాది.

చక్కర కలిపిన తేనీటికి
తేనెల మాధుర్యం తోడుగా 
నిత్యం నాకందించాలనే స్వార్ధం నాది.

ఈ కుందనపు బొమ్మనొదిలి 
ఏ కొమ్మతో ఉన్నావో ?
అనే అపనమ్మకపు మాటల్లో
తొణికిసలాడే ప్రేమను 
నేనే అవ్వాలనే స్వార్ధం నాది.

ప్రతి రాత్రి నీ చెవి నా గుండెసవ్వడి వింటూ 
నీతల నా ఎదనే తలగడగ చేసుకోవాలనే 
అందమైన స్వార్ధం నాది.

నీ ప్రతి ఆనందానికీ కారణం నేనే కావాలనీ 
ఎ చిన్ని బాధకూ కారణం నే కారాదనీ 
కోరుకునే స్వార్ధం నాది.

నా ప్రేమలోని నిస్వార్ధాన్ని నువ్వెప్పుడూ గుర్తిస్తూ 
నీ ప్రేమనంతా  నేనే పొందాలనే 
నిస్వార్ధమైన స్వార్ధం నాది.

(నా బ్లాగ్ లోని కవితలను ఆదరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు...అభివాదాలు.మీ వలెనే నేను ఎదిగింది.అందుకే నన్ను ప్రోత్సహించిన మిత్రులకి అందరికీ నా వ్రాతలు అంకితం.)...@శ్రీ