05/12/2016

|| ఓ సశేషం ||


కెరటాలలో హాలాహలాన్ని నింపుకొన్న కాలసాగరం కరాళనృత్యం చేసుకుంటూ ... కబళించేందుకు మీదికొస్తున్నట్లనిపించే కలలన్నీ వాస్తవాలుగా మారి కళ్ళముందు కనిపిస్తున్నాయి మనం కలిసి నడిచినప్పుడు పాదాలకింద చందనపుముద్దలా తగిలిన తీరంలోని ఇసుకతడి... హేమంతంలో కూడా చండ్రనిప్పుల్ని కక్కుతోంది పరిమళాన్ని ఆవాహనం చేసుకున్న మన కబుర్లపూలన్నీ ఎప్పుడు వాడిపోయాయో... ఎండిన రేకులన్నీ సాగరగర్భంలో ఎప్పుడు కలిసిపోయాయో వియోగాన్ని కొన్ని యుగాలపాటు నిస్సహాయంగా మోస్తున్న మనసుకు తెలియలేదంటే ఆశ్చర్యమేముంది శుక్లపక్ష రాత్రులలో వెన్నెలపూలు తురుముకొని లాస్యమాడే అలలకన్నెలు... కృష్ణపక్షపు తిమిరాన్ని నింపుకొని కోరలు చాచి ఒడ్డుని కాటేసేందుకు పడగలు విసురుతున్నట్లే ఉంది మూసుకున్న నీ మదిగోడలపై నా తలపులేసిన చిత్రాలన్నీనీ కంటబడితే మరలివస్తావనుకుంటున్నా. గుప్పెడు జ్ఞాపకాల గవ్వలకోసం జల్లెడపట్టిన సైకతరేణువులు నీ పాదాలపై నా చిరునామా వ్రాస్తాయనే నమ్మకం మాత్రమే మిగిలింది అదే నమ్మకం ... అనుక్షణం నా ఒంటరితనాన్ని వెక్కిరిస్తూ ఉంటుంది ... #శ్రీ