06/09/2012

తనువే...తాంబూలం



తమలపాకు... నీ అరచేతి కోమలంతో  పోటీ పడింది...
మౌక్తికం... నీ ముక్కెరకి నేనే సరిజోడు అంది...
కస్తూరి... నీ నుదుట తిలకమై వెలిగింది...

యాలకుల  సుగంధం...
నీ శ్వాసలో ఒదిగింది...
జవ్వాది... 
నీ యవ్వనంలో అమరింది...
పోకచెక్క... 
నీ నాభిలో చక్కగా ఇమిడింది...
కర్పూరం...
నీ అందానికి నీరాజనమంది...
తాంబూలపు పంట...
నీ పెదవిపై మెరిసింది...

బొటనవేలి  చిలుక - బాహులతలతో అల్లుకుంది...
చూపుడువేలి చిలుక - చనువు తీసుకొమ్మంది...
మధ్యవేలి చిలుక - మధ్య గాలిని చొరనీయనంది...
ఉంగరపువేలి చిలుక - నాతో ఉండిపొమ్మంది...
చిటికెనవేలి చిలుక - సిగ్గులొలికిస్తూ...
    'ఇకచాలు' అనే మాటే లేదంది...
(ఈ రోజు ఎవరి బ్లాగ్ లోనో  ఈ చిత్రం చూసి అల్లిన భావమాలిక....@శ్రీ)