25/12/2013

|| నవరత్నాల మాలిక ||
నీ వలపుచినుకు నామదిలో కురిసి మారేది
'మౌక్తికం'గానే.

నా కెమ్మోవి మధురసుధాతరంగాలు చేరేవి
నీ 'పగడపు' దీవినే...

అన్యులకి మాత్రం అభేద్యమైన 'వజ్రమే'!
నీకు మాత్రం సులభసాధ్యమైన నా మనసు.

మెరిసే 'కెంపు'లే
తాంబూలపు తమ్మి తాకిన చక్కర మోవి సొంపులు.

రాళ్ళలో వెదుకుతారు 'రత్నం'కోసం
నా అన్వేషణ...వన్నెల కన్నెలలోని కొంగొత్త చిన్నెలున్న నీకోసమే

నా ప్రేమ సతతహరితమే
నీకర్పించినది నా మానస'మరకతమే'.

నా రూపాన్ని వేయి ఇంద్రచాపాలు చేసేది
నీ కనుపాపల ఇంద్ర'నీలమే'.

నీ మేనికాంతితో పోటీ పడుతూ...
ఎప్పుడూ ఓడిపోయేది _కనక'పుష్యరాగమే'

'గోమేధిక' దర్పణంలోనే కనిపించింది
భవిత నీతోనేనని.... నీవెప్పుడూ నాలోనేనని... ...@శ్రీ 

22/12/2013

|| రత్నసాగరుడు...యాచకుడే ||
తెలితరగల నురుగులకి 
నీ చిరునవ్వుల అందాన్నిస్తే...
తీరాన్ని తాకే అలలకదలికలకు 
నీ నుదిటిని తాకే ముంగురుల సౌందర్యాన్నిచ్చావు.

ఒడ్డున దొరికే ఆల్చిప్పలకి
నీ సోగకళ్ళ సొగసులనిస్తే...
రవికాంతులపేర్లతో మెరిసే జలాలకి
చూపుల మిలమిలలనిచ్చావు.

అరుదైన దేవశంఖాలకు
నీ కంఠపు ఆకారాన్నిస్తే...
కదిలే మీనాలకు
నీ కనుపాపల చంచాలత్వాన్నిచ్చావు.

సాగరగర్భాన దొరికే మౌక్తికాలకు
నీ మాటల మెరుపులనిస్తే...
పగడాల దీవులకు
నీ పెదవుల అరుణాన్నిచ్చావు.

నీటిమొక్కలనల్లుకునే హరితలతలకు
నీ మేని ఒంపులనిస్తే...
ఎగసిపడే కెరటాలకు
మిడిసిపడే నీ యవ్వనాన్నిచ్చావు.

అనంతమైన సైకతరేణువులకి
నీ ఒంటినలుగుల నక్షత్రాలనిస్తే
నిశ్చలమైన తీరానికి
నీ ముఖంలోని ప్రశాంతతనిచ్చావు.

నిజానికి అన్ని దానాలకి...
నీ ముందు దోసిలొగ్గే “యాచకుడే”
సర్వ సంపదలను తనలో దాచుకున్న ఆ “రత్నసాగరుడు”. ...@శ్రీ

20/12/2013

|| అవినీతి ||ఏయ్ ఓ కవీ !
అవినీతి ఎక్కడుందో? అని వెదుకులాట మొదలెట్టకు
నీ ఇంట్లోనే మొదలౌతుంది 
నీ చుట్టుపక్కల పెరుగుతుంది
నీతోనే ఉంటోంది .


మీ అబ్బాయికి తక్కువమార్కులోస్తే బోర్డు తలుపు తట్టేడపుడు
మీ అమ్మాయి మెడిసిన్ సీట్ కోసం ఆనందంగా డొనేషన్ కట్టేడపుడు
టాక్సులు ఎగ్గొట్టి దొంగలెక్కలు చూపిస్తూ
నల్లకోటల సామ్రాజ్యానికి పునాదులు వేసుకుంటున్నపుడు
నువ్వేసిన రోడ్డు చిన్నవర్షానికే కొట్టుకుపోయినపుడు
కన్నున్నా కనబడదు.రైల్లో బెర్తు కొనేందుకు డబ్బులు లేనపుడు
నువ్వు చేసిన నేరానికి కట్టాల్సిన కోట్లు నీదగ్గర లేనపుడు
లంచగొండిని నీ దగ్గరున్న సొమ్ముతో కొనలేనపుడు
కంటిముందు వికటాట్టహాసం చేస్తూ భయపెడుతుంది.
కునుకు రానీయకుండా చేస్తుంది.అవినీతి నిర్మూలనపై ఉపన్యాసాలిస్తావు
కథలు వ్రాసేస్తావ్ కవితలు అల్లేస్తావ్
అవినీతి వృక్షం శాఖల వ్యాప్తి చూపించేస్తావ్
కూకటి వేళ్ళతో పీకేయమని సలహాలు ఇచ్చేస్తావ్ ...గొంతెత్తి అరిచేస్తావ్.కలం పక్కన పెట్టేయి
కవి ముసుగు తీసెయ్యి
మంచిమనిషిలో పరకాయ ప్రవేశం చేసెయ్యి
చేతికి మట్టి అంటుతుందని ఆలోచించకు.
ఒక్క వేరునైనా నీ చేత్తో పీకి చూపించెయ్... ...@శ్రీ 

04/12/2013

||హిమాలయం ||
మనసు దోచే మానస సరోవరం
మంచు కొండల్లో దాగున్న అద్భుత జలసౌందర్యం

పోతపోసిన వెండి కొండల బారులు 
మంచుపూల సెహరాతో దోబూచులాడే ఉత్తుంగ శృంగాలు

భువిలో వెలిసిన సతతహరిత నందనాలు
దేవదారు వనాలతో శోభిల్లే రజతసానువులు 

శిశిరంలో  తుషారసుమాల అభిషేక దృశ్యాలు
హిమవన్నగాల సౌందర్యాన్ని పెంచే ముత్యాల హారాలు.

శిఖరాలను పలకరించే మేఘమాలలు 
రవికాంతులని అడ్డుకొనే ముత్యాల గొడుగులు 

ప్రకృతి నిర్మించిన రజతమయమైన శిఖరాలు
అంబరాన్ని చుంబించే వెలుగుపూతల పర్వతపంక్తులు

వేవేల హిమానీనదాల ప్రవాహాల గలగలలు
ఉమామహేశుల లాస్య తాండవాలకి సహజమృదంగాల తాళాలు

ప్రవరాఖ్యుని పసరుపూతలు కరిగిన చోటు
హిమవత్పుత్రిక ఘోరతపమాచారించిన చోటు

గౌరీశంకరులు పరిణయమాడిన కళ్యాణ వేదిక
హిమాలయాన్ని మించిన పుణ్యస్థలం మరోచోట లేదిక.    ...@శ్రీ 04/12/2013

03/12/2013

వేట


చెంగుచెంగున దూకే లేడి కూనలు.
పొంచి చూస్తున్న శార్దూలాల వాడిచూపులు.
కొమ్మలపై చిరుతల మాటు.
దుప్పులకి తలపెడుతూ  చేటు.
విషసర్పాల బుసబుసలు.
అడవి నెమళ్ళ క్రీంకారాలు.
ఘీంకరించే మత్తేభాల గుంపు ఒక వైపు.
అదను కోసం చూసే కొదమ సింహాలు మరొక వైపు.
రథ చక్రాల ధూళి కప్పేస్తోంది వనాన్ని 
గుర్రాల గిట్టల చప్పుడు ప్రతిధనిస్తోంది అడవంతా 

మొదలైంది దుష్యంతుని  మృగయా వినోదం
వాడి బాణాల ప్రయోగం...
పరుగెత్తే  మృగాలే ఆతని లక్ష్యం 
ప్రతి బాణం లక్ష్యం భేదించేదే.
ప్రతి శరం గురి తప్పనిదే..

వనమంతా కోలాహలం.
మృగాలన్నీ కకావికలం.
దారి తప్పింది  నరేంద్రుని రథం.
చేరింది కణ్వుని ఆశ్రమం.

భూపతి కళ్ళకి   అద్భుత సౌందర్యాల సందర్శనం 
అసంకల్పితంగానే చేసాయి చూపులు వందనం.
తొలిచూపులోనే ఇరువురి మనసులో  ప్రేమాంకురం.
జరగబోయే గాంధర్వ వివాహానికి అదే వేసింది బీజం.

16/11/2013

|| కళ్యాణ తిలకం ||బాసికం కొత్త భాష్యాలెన్నో చెప్తోంది
బాస లేని సంజ్ఞలేవో చేస్తోంది.

నుదుటి తిలకం వరుని సిగ్గుతో తిలకిస్తోంది.
కళ్యాణ ఘడియలకై వేచి చూస్తోంది.

సిగ్గుతో వాలిన కన్నులు
మనసులోని ఆనందాలను దాచే వెలుగుదొన్నెలు.

ముక్కునున్న ముక్కుపుడక శోభ.
నక్షత్రాన్ని సైతం దిక్కరిస్తాననే ధీమా 

నల్లని కురులలో చంద్రవంక

నీలాకాశంలో వెలిగే నెలవంక

సిగలో మల్లెలమాలలు
పరిణయంలో పరిమళాల గుబాళింపులు

తలవంచుకున్న ముగ్ధమోహన రూపం
వరుని మనసులో నిలిచిపోయే వెన్నెల చాపం 

జగదేకసుందరితో కళ్యాణం
వరునికి జగతిని గుప్పెట పట్టినంత సంబరం... ...@శ్రీ

13/11/2013

|| మనదనుకున్న మన మనసే (మనిషే) ||


1.ప్రేమలో పడితే

గాలిలో రెక్కలు లేకుండా తేలడమే.
మనసుని తేనెలో ముంచి తీయడమే
సంద్రంలో ఈత రాకున్నా ముందుకెడుతున్నట్లనిపించడమే

2.ప్రేమ దూరమైతే

కత్తుల వంతెనపై పాదాలు మోపినట్లుంటుంది
నిప్పుల ఉప్పెన తరుముకొస్తున్నట్లనిపిస్తుంది
రెప్పలు మూతపడక నిద్ర దూరమౌన్నట్లుంటుంది

3.దూరమైన ప్రేమను తలుస్తుంటే

దగ్గరైనా దూరమైనా ప్రేమే దైవమని నమ్మాలంటుంది
వియోగం త్వరలో తీరే ఆశ కనబడుతూ ఉంటుంది.
ప్రతి విషయం ధనాత్మకంగానే అనిపిస్తుంది.
ఎడారిలో ఒయాసిస్సుల ఉత్సవమనిపిస్తుంది
నిశీధిలో సిరివెన్నెల నాట్యం కనబడుతుంది
శిశిరంలో వసంతాల వెల్లువనిపిస్తుంది
అన్వేషిస్తున్నది త్వరలోనే దొరికిపోతుందనిపిస్తుంది

4 ప్రేమ బాధిస్తుందా?

ప్రేమకి ఆనందం పంచడమే తెలుసు
ప్రేమకి ప్రేమను అందించడమే తెలుసు
వరుసలో మనవంతు వచ్చేదాకా వేచి ఉండలేకపోవడం...
బాధకి కారణం ప్రేమే అని నిందించడం
బాధించేది మన మనసే ..మనదనుకున్న మన మనిషే... @శ్రీ 

02/11/2013

|| భామలలో భామ ...సత్యభామ ||
పదునాలుగు లోకాలలో లేని సౌందర్యనారి. 
రాజసం ఉట్టిపడే రాకుమారి
పూలకి సౌకుమార్యం నేర్పే సుకుమారి.
మాధవునికి అత్యంత ప్రియమైన దేవేరి.


భక్తిలో రుక్మిణికి తీసిపోదు
ప్రేమలో రాధకి పోటీదారు.
క్రిష్ణుని చేతిలో శృతి కావాలనుకొనే రతనాల వీణ
కన్నయ్యని కొంగున కట్టుకొని వెంటతిప్పుకున్న నెరజాణ
అలుకకే అలుకలు నేర్పిస్తుంది.
అనంగరంగంలో అ రతీదేవిని తలపిస్తుంది.

అస్త్రశస్త్ర విలువిద్యా కౌశలం ఆమెకి అదనపు బలం
అందుకే...పదారువేల ఎనమండుగురిలో సత్య స్థానం ప్రత్యేకం.

యుద్ధానికి సై అన్న సత్యభామ జగానికి చండిక
నరకుని దృష్టిలో కాళిక
కన్నయ్యకి మాత్రం కర్పూరకళిక.

నరకునిపై నిప్పులు కక్కిన కన్నులు
కన్నయ్య వైపు మధ్య మధ్య ప్రేమగా చూసే వెన్నెలదొన్నలు
విల్లెత్తిన రౌద్రరూపం
నరకునికి కాలుని పాశం.
మాధవునికి మాత్రం ధనువు పట్టిన శృంగార చాపం.

సాత్రాజితి శౌర్యం ముందు
నరకుని క్రౌర్యం తల దించుకుంది
కృష్ణునితో కలిసి లోకకంటకుని సంహారంలో
సత్యభామ తన పాత్ర విజయవంతంగా పోషించింది ...@శ్రీ

21/10/2013

|| చంద్రదర్శనం చేసే జాబిల్లి ||నీ తలపులలో నారూపాన్నే చూస్తూ
ఆరూపం చూసే చూపులకు
సిగ్గుపడిన చెక్కిలి గులాబి రేకులను 

నీ చేతిలోనే పండాలని
తహతహలాడే గోరింటలో కలిపి
అలదుకున్న అరచేతులు
మంకెనలని పరిహసిస్తున్నాయి...కెంపులని ధిక్కరిస్తున్నాయి.

కట్టుకున్న పట్టుపావడా
పట్టు లాంటి నీ మేనుపై
కొత్తశోభను సంతరించుకొంది.
విరిబోణి అందాలను దాచలేని
తెల్ల ఓణి అవస్థ పడుతోంది.
నీ సౌందర్యనిధులకి కావలి ఉన్నట్లుగా కనబడుతోంది.

పూలబాణాల విలుకాని
చెరకువింటి నారిలా
మల్లెమాలలు తురుముకొని
బంగారు జడగంటలు మోగిస్తూ
యవ్వనాన్ని అదిలిస్తూ
నీ ఒంపులను అనుకరిస్తూ
మెలికలు తిరుగుతోంది
నేను మెచ్చిన వాలుజడ
నీలికురుల నాగమాలిక

నాప్రేమ రంగరించిన పారాణి పూతలకి
కెందామరలుగ మారాయో
పెట్టుకున్న గోరింటకు
నీ కాలి మువ్వల రాత్రి ఊసులతో జతకలిపి
మరింత ఎరుపెక్కాయో
కట్టిన పరికిణీ బంగారుజరీ తగిలి కందాయో
తెలియని నీ పాదాల సౌందర్యానికి
తూరుపు దిక్కు సిందూరం సలాములంటోంది.

మర్రిమానుకి కట్టిన పూల ఊయలదే భాగ్యం
ఏడుమల్లెలెత్తు సౌకుమార్యానికి
ఆసనమయ్యిందనే గర్వం.
తామరతూళ్ళకి పాఠాలు చెప్పే చేతులకి
ఆసరా ఇచ్చానన్న అతిశయంతో డోలనాలు చేస్తోంది.

వెన్నెలమ్మ నోము పట్టడం మొదలెట్టకుండానే
నీ మోము చూచి ఉపవాసం చాలించింది
నక్షత్రాలు నీ నవ్వులు చూసి తమ పని లేదని
వేకువలో దాగేందుకు పరుగెత్తి పోయాయి.
నీ కిలకిలలతొ శుకపికాలు మేల్కొన్నాయి.

తదియనాటి చందమామ కోసం నీవు చూస్తుంటావు
చంద్రదర్శనం చేసే జాబిల్లిని అబ్బురంగా నేను చూస్తుంటాను.    
@శ్రీ 

(ప్రముఖ చిత్రకారులు వాసు Vasu Chennupalli గారికి కృతజ్ఞతలతో...)

19/10/2013

|| కృ(క్రి)ష్ణ వేణి ||
సదాశివుని జటాజూటం జడలు విప్పి ఆడినట్లు 
ఉమాదేవి నీలి కురులు పిల్లగాలికి ఎగిరినట్లు 
మహాబలేశ్వరునికి జలకన్నియ పుట్టినట్లు

వయసొచ్చిన పడుచు అల్లరి చేస్తూ పరుగులు తీస్తునట్లు
ముంగురులను సర్దుకుంటూ వయ్యారంతో సాగుతున్నట్లు
వడివడి నడకలతో బిరబిర పరుగులతో కదిలిపోతుననట్లు
కనబడుతోంది మా కృష్ణవేణి...తెలుగు నదులకే రారాణి.

ఆనకట్టల హద్దుల మన్నించి
పిల్లకాలువల ప్రవహించి
పంట చేలను తడిపి
పట్టెడన్నం పెట్టే కృష్ణమ్మ చేతులు
అన్నపూర్ణ హస్తాలకి ప్రతిరూపాలు.

మల్లికార్జునుని పాదాలు కడుగుతూ
భ్రమరాంబిక పారాణి తాకుతూ
కనకదుర్గమ్మకు ప్రణమిల్లుతూ
నల్లమల అడవులకు అందాన్నిస్తూ
హంసలదీవి దగ్గరకు రాయంచ నడకలతో చేరుకుంటుంది
తనను ప్రేమగా గుండెల్లో దాచుకొనే సాగరుని పరిష్వంగం లోనికి... ...@శ్రీ

08/10/2013

|| మా గోదారి (1) ||

గోదావరి మీద కవితలు, ఏక వాక్య కవితలు ,మినీ కవితలు ఎన్నో ఎన్నెన్నో వచ్చాయి ఇప్పటికి.
అయినా గోదావరి లోని ప్రతి నీటి బొట్టుకి కవనం వ్రాయించగల శక్తి ఉంది. నాదైన కోణంలో కొన్ని కవితలు ఆ
జీవనదిపై వ్రాయాలని సంకల్పిస్తూ ... తల్లి గోదారికి ప్రణమిల్లుతూ .../\...@శ్రీ 
త్రయంబకేశ్వరుని జటాజూటంలోని గంగకు పోటీ వస్తూ
పార్వతీదేవి పాదాల పారాణి కడిగిన నీరులా
తొలిసంధ్య చల్లిన సిగ్గుపూలకళ్లాపికి ఎరుపెక్కినట్లుగా
అరుణుడి చురుకు చూపులకి వళ్ళంతా కందిపోయినట్లుగా
ప్రత్యూషంలోని సప్తాశ్వాల గిట్టలధూళి రాలి రంగిల్లినట్లుగా
ఎర్రబడిన తొలిపొద్దు అందాన్ని చూపే అద్దంలా
సూరీడు పంపిన కాంతులపేర్లు వేసుకొని
ఎంతో అందంగా కనిపిస్తోంది మా గోదారి.

కదిలే చేపలతో మిలమిలలాడుతూ
మత్స్యకారుల వలల చిక్కక తప్పించుకొని తోవచేసుకుంటూ
తెల్లని తెరచాపల అందాలను తిలకిస్తూ
నావికుల గీతాలకు మైమరుస్తూ
ఆ హైలెస్సలకు కదం తొక్కుతూ
వారి తాపాన్ని చల్లార్చేందుకు చల్లని తుంపర్లను చల్లుతూ
వడివడిగా కదిలిపోతుంది మా గోదారి.

సాయంసంధ్యను ప్రతిఫలిస్తూ
ఒడ్డునున్న జంటల గుసగుసలను ఓ చెవితో ఆలకిస్తూ
తీరాన్నున్న రెల్లుకొసల చక్కిలిగింతలకు మెలికలు తిరుగుతూ
అస్తాద్రి గుండెల్లో ఒదిగిపోయే సూరీడుకి వీడ్కోలు చెప్తూ
తొంగిచూసే మామను స్వాగతిస్తూ
సాగిపోతుంది మా గోదారి.

కొబ్బరాకుల వీవనలకు సేదదీరుతూ
నిశాకాంతులన్నిటినీ తానే తాగేయాలనే తపనతో
చంద్రుడినీ తారలను పట్టేసి తనలో దాచేస్తూ
నౌకావిహారాలు చేసే పడుచుజంటల చిలిపిచేష్టలకి చిన్నగా నవ్వుకుంటూ
తాను రేయంతా సాగరునితో చేసే అల్లరిని తలుచుకుంటూ
బిడియంగా కదిలిపోతుంది మా గోదారి. ...@శ్రీ 08/10/13.

04/10/2013

|| వాలు జడ ||


చేమంతుల అందానికి
పచ్చని పసిడి కాంతులిచ్చిన
నీ వాలుజడ

సన్నజాజుల పరిమళాన్ని
ప్రతి పాయలోను నింపుకున్న
నీ వాలుజడ.

గులాబుల గుబాళింపులను
గుచ్చెత్తి నను పిచ్చెత్తించే
నీ వాలుజడ

మొగలి పూల వాసనతో
రేయికి సెగలు రేపే
నీ వాలుజడ

మదనుని కొరడాలా
నీ యవ్వనాన్ని నియంత్రించే
నీ వాలుజడ

జడగంటలను చేతపట్టి
మదిలో వలపుల జేగంటలు మోగించే
నీ వాలుజడ.

మల్లెల మాలలను చుట్టుకుని
విల్లెత్తిన శృంగారంలా
నీ వాలుజడ.

సైకత వేదికలని తాకుతూ
యామినీ వాహినిలా సాగే
నీ వాలుజడ.

నీ నడుము కదలికలవద్ద
వయ్యారం నేర్చుకుంటూ
నీ వాలుజడ.

అలుకలో చెళ్ళుమని
నాబుగ్గల తాకిన పట్టుకుచ్చుల
నీ వాలుజడ

ప్రణయంలో నా మెడను చుట్టి
చెంతకు లాగిన
నీ వాలు జడ.

వసంతుని ధనువుకి
కట్టిన పూలనారిలా
నీ వాలుజడ.

రాత్రులలో కామునితో
కయ్యానికి కాలుదువ్వే
నీ వాలుజడ.

సరసాలలో మిన్నాగులా కదులుతూ
క్షీరనీరాలింగనాల మధ్య నలుగుతూ
సిగ్గుతో మెలికలు తిరిగే
నీ వాలుజడ. ...@శ్రీ 

27/09/2013

|| వృద్ధాప్యం ||


కళ్ళ చివర మొదలై 
బుగ్గలమీదికి పాకుతూ 
మెడమీద విశ్రమిస్తూ మెలమెల్లగా 
ముందుకి కదులుతూ
మన ప్రమేయం లేకుండానే
ఒళ్లంతా ఆక్రమిస్తాయి ముడుతలు.

నుదిటిపై స్పష్టమౌతుంటాయి 
అనుభవాలు గీసిన వక్రరేఖలు 
శైవుల త్రిపుండ్రాలని తలపిస్తూ.
వెండితీగలుగా మారిపోతూ ఉంటాయి 
సంపెంగనూనెల మెరిసిన నల్లని కేశాలు.

బ్రతికే రోజులు తగ్గుతున్నా 
తనకేం పట్టనట్టు 
దినదినప్రవర్ధమానమౌతూ ఉంటుంది 
కళ్ళజోడు నెంబరు.
తగ్గిన ఎముక బరువును కూడా మోయలేక
వంగిపోతూ ఉంటుంది  నడుము.

కళ్ళల్లో కరిగిన స్వప్నాల్లా 
కండలు...వేలాడే చర్మంలో
కలిసిపోతూ ఉంటాయి.
కాలం చెల్లిందంటూ చివుళ్ళ నుంచి 
రాలిపడుతూ ఉంటుంది ఒకో పన్ను.
యవ్వనపు చిందులు చూసి 
మనసు గెంతులేసినా...
శరీరం మాత్రం అలిసిపోతూ ఉంటుంది.

వద్దనుకున్నా...వృద్ధాప్యం 
ధృతరాష్ట్రుని ఉక్కుకౌగిలిలా
ఊపిరి ఆడనివ్వకుండా నలిపేస్తూ    
శరీరాన్ని తన వశంచేసుకుంటుంది 
నెమ్మదిగా అణువణువునూ
నిర్దాక్షిణ్యంగా కబళించేస్తుంది.
బ్రతికుండగనే నరకమేమిటో చూపిస్తుంది.
మృత్యువుకి దగ్గరగా తీసుకుపోతుంది...            @శ్రీ 27/09/2013

19/09/2013

|| నిశ్శబ్ద నివేదన ||నీవు వ్రాసేవి లిప్తకి వేయి ప్రేమలేఖలు అంటావు.
నా నిరీక్షణాక్షణాలను క్షణానికి వెయ్యి చొప్పున లెక్కించినా
నీకు కొన్నియుగాలు పడుతుంది లెక్కింపు పూర్తి చేసేందుకు.
ఆక్షణాలలో సగం దాచాలన్నా 
వందల గేలక్సీలు కావాలి.
ఆక్షణాలను కుప్పలుగా పోస్తే
సప్త సముద్రాల తీరాలు చిన్నవిగానే కనిపిస్తాయి...చిన్నబుచ్చుకుంటాయి.


(నీ)కలలనిచ్చే రేయి కోసమే
ఎదురుచూస్తుంటాయి మూతబడని (నా)కన్నులు.
ఎంత చూసినా కల'కావలేనా' ప్రతి రేయి?
నిజమయ్యే స్వప్నాల కోసమే
కలలు కంటున్నాయి 'ఆశలమేనా'ని మోసే నా ఊహలు.
నీవుండే కల కోసం
ఎన్ని నిద్రలేని రాత్రుల మూల్యం చెల్లించాలన్నా సిద్ధమే.
ఎన్ని కాళరాత్రులిచ్చానో నా స్వప్నాలకి
నిన్ను రప్పించేందుకు రుసుముగా.
తీరని ఆరాటమే
తీపికలల తీరం చేరాలని కలతల సుడిలో చిక్కిన కన్నులది.
ప్రతి రేయికీ అలసటే
నా కళ్ళకి...నీ కళలు చూపే కలల లోకాల దారులు చూపుతూ.
నీఅందాలను చూసే కలలు 'కనేందుకు'
నా రెప్పలు పడే నొప్పులు నీకెలా తెలుస్తాయి.

కలలోనైన కానరాని నీకోసం మనసు పడే వేదన నీకెలా చెప్పేది?
గుండె సవ్వడులతోనే మనమధ్యనున్న
నిశ్శబ్దాన్నిభేదించే ప్రయత్నంలో తలమునకలౌతున్నా.
ఆశబ్దం ఎదలోనున్న నీకు నిద్రాభంగమౌతుందని భయమోపక్క వేధిస్తోంది.
అందుకే ....నిశ్శబ్దంగానే నీ ఆరాధన...సవ్వడి లేకుండానే నామది నీకు నివేదన... ...@శ్రీ 

12/09/2013

|| సైకత రేణువులు ||


ఎన్ని రోహిణీకార్తెలలో 
చండ్రనిప్పుల్లా కాలిపోయాయో 
ఎన్ని తొలకరి జల్లులలో
తడిసి మురిసిపోయాయో 
ఎన్ని శిశిరాలలో 
గజగజ వణికిపోయాయో
ఎన్ని పున్నమితరగలలో
అప్రమేయంగా కలిసిపోయాయో 
ఎన్ని అమాసల చీకటి కెరటాలకు 
తోడుగా ఉన్నాయో 

ఎన్ని అందమైన పాదాలకు
చక్కిలిగిలిగింతలు పెట్టాయో 
ఎన్ని మువ్వల సవ్వడులకు
తాళమేస్తూస్తూ తలలూచాయో
ఎన్ని వేళ్ళు వ్రాసుకున్న ప్రేమాక్షరాలలో
మునిగి పరవశించాయో

ఎన్ని సాయంత్రాలు... 
ప్రేయసీ ప్రియుల నిరీక్షణాక్షణాలను లెక్కించాయో
ఎన్ని జతల సప్తపదులను ప్రత్యక్షంగా తిలకించాయో
ఎన్ని అనురాగ సంగమాలకు పులకించాయో
ఎన్ని అందాల కింద నలిగి సిగ్గిల్లాయో

ఎన్ని ఆకృత్యాలకు రోదించాయో
ఎన్ని చీకటి క్రీడలకి వేదికలయ్యాయో
ఎన్ని అశ్రుబిందువులతో తలంటుకున్నాయో 
ఎన్ని రుధిరకణాలలో తడిసి ముద్దయ్యాయో 

ఎన్ని సంఘటనలు చూసినా,
ఎన్ని క్రియలకి మూగసాక్షులైనా...
స్వచ్చంగా తమ తళుకులతో నవ్వుతూ 
ప్రతి ఉషస్సునీ స్వాగతిస్తూనే ఉంటాయి.
ప్రతి రేయినీ సాదరంగా సాగనంపుతూనే ఉంటాయి. ...@శ్రీ 

07/09/2013

|| చిన్నబోయింది మబ్బులపానుపు ||చిన్నబోయింది మబ్బులపానుపు
చుక్కలతో రేరేడు పక్క ఎక్కలేదని 

చిన్నబోయింది మబ్బులపానుపు
వెన్నెల దుప్పట్లు పరచలేదని 

చిన్నబోయింది మబ్బులపానుపు
వెన్నెలకాంతలో(కాంతిలో) శశి మాయమయ్యాడని

చిన్నబోయింది మబ్బులపానుపు
చుక్కలతో శశి సరసాలుచూసి వెన్నెలమ్మ అలిగిందని.

చిన్నబోయింది మబ్బులపానుపు
వెన్నెలకాంతతో శశికాంతుని  సరసాలు లేవని.

చిన్నబోయింది మబ్బులపానుపు
తారాశాశాంకుల సరసాలకు వేదిక కాలేనందుకు

చిన్నబోయింది మబ్బులపానుపు
వెన్నెలదొరతో వ(వె)న్నెల దొరసాని నిశాయుద్ధం లేక

చిన్నబోయింది మబ్బులపానుపు
వెన్నెలమ్మ వన్నెల చిన్నెలు తనకు తళుకులద్దలేదని.

చిన్నబోయింది మబ్బుల పానుపు 
పరిచిన ఆకాశ సుమాలు...కౌముదీ సోముల క్రింద నలగలేదని.       ...@శ్రీ  

04/09/2013

" ఏకవాక్య కవితా విశారద "


సింహాచలం లోని శ్రీ సూర్య కళ్యాణమండపంలో
రోజా మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అకాడమీ వారిచే
 సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రముఖ సాహితీ వేత్తల సమక్షంలో నాకు

"ఏకవాక్య కవితా విశారద"


అనే బిరుదునిచ్చి సత్కరించిన విషయం మిత్రులందరితో పంచుకుంటున్నాను. 
నేను వ్రాసిన ఏక వాక్య కవితల కవితా సంపుటి "శ్రీ వాక్యం" ను అదే వేదికపై ఆవిష్కరించడం జరిగినది. 
.అందరికీ హృదయపూర్వక కృతజ్ఞాంజలి.../\...లతో ...శ్రీ29/08/2013

మన తెలుగు


|| మన తెలుగు ||

నన్నయ నేర్పిన నవనీతాక్షారాల భాష తెలుగు
భారతాన్ని భావాత్మకంగా అందించింది తెలుగు

శ్రీనాధుని సీసపద్యాలతో సింగారించింది తెలుగు
శృంగార నైషధంలో రసరమ్యభావాలను అందించింది తెలుగు

పోతన పద్యాలలో పరిమళించింది తెలుగు
భాగవతంలోని కృష్ణలీలకి మురిసింది తెలుగు

కృష్ణదేవరాయని భువనవిజయంలో భాసించింది తెలుగు
ఆముక్తమాల్యదలో మౌక్తికమై మెరిసింది తెలుగు

అల్లసాని అల్లిక జిగిబిగికి వెండితీవెలందించింది తెలుగు
హిమగిరుల అందాలకు రంగులలదినది తెలుగు.

తిమ్మన పలుకులలో పారిజాతాలు కుమ్మరించింది తెలుగు
సత్యభామ అలుకలో కొత్త అందాలు చూపింది తెలుగు

రామకృష్ణుని వికటకవిత్వంలో హాస్యమైనది తెలుగు
పాండురంగని భక్తికి పరశించింది తెలుగు

ధూర్జటి చాటువులలో చరితార్ధమైనది తెలుగు
కన్నప్ప మూఢభక్తికి ముగ్ధమైనది తెలుగు

విశ్వనాథుని వేయిపడగల మణిమయమైనది తెలుగు
కిన్నెరసానిలో వడివడిగా పరుగులు తీసింది తెలుగు.
కల్పవృక్షములో కమనీయమైనది తెలుగు

కృష్ణశాస్త్రి భావగీతమైనది తెలుగు
నారాయణుని విశ్వంభరమైనది తెలుగు

అజంతము మన తెలుగు.
అనంతము మన తెలుగు
అక్షయము మనతెలుగు.
విశ్వ భాషలలో...అద్భుతమైనది మనతెలుగు
అన్ని భాషలలో అమరమైనది మన తెలుగు ...@శ్రీ 29/08/13

అందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాభినందనలు...

17/08/2013

|| లేవు ||

బైట సూర్యోదయంతో బాటు
ఇంట్లో చంద్రోదయాలు లేవు 

తొలకరిజల్లులా కురుల చివరల
నీటి తుంపర్ల అభిషేకాలు లేవు
కనురెప్పలపై తీయని స్పర్శలు లేవు
కాఫీకప్పుపై గాజుల (ద్రవ)తరంగిణులు లేవు

పూజగది నుండి అగరుపొగలు లేవు
హారతికర్పూరపు సుగంధాలు లేవు
వంటగదిలో కమ్మటి వాసనలు లేవు
తాలింపుల ఘుమఘుమలు లేవు

ఆఫీసుకెళ్ళేముందు తాయిలాలు లేవు
ఇంటికొస్తే ఎదురుచూపులు లేవు
మువ్వల సవ్వడులు లేవు
అందెలరవళులు లేవు.
జాజుల జావళీలు లేవు
మల్లెమాలల పరిమళాలు లేవు.

ఆషాఢమాసం వెళ్ళినా
నీవొచ్చే దాఖలాలు లేవు.
శ్రావణమొచ్చినా
నావిరహం తీరే దారులు లేవు. ...శ్రీ 

14/08/2013

తొలకరి విరిఝరి.

చినుకు శరాలెలా గుప్పిస్తున్నాడో ఆ ఇంద్రుడు
మేఘాల విల్లుతో.
చినుకుబాణాలు ఎలా వదులుతున్నాడో
మెరుపు నారి సారిస్తూ.
చినుకుల శరసంధానం చేసే ఇంద్రుని ధనుష్టంకారం
ఉరుమై తరుముతుంటే,
నీటియజ్ఞం మొదలెట్టింది ధరణి వరుణుని జలయంత్రాల సాయంతో.

మేఘం ...చినుకుపూలతో పలకరించి పోతూ ఉంటుంది
వేడెక్కిన గిరులకి ఆ'విరులిస్తూ'.
చినుకులనెలా చిమ్ముతోందో వానమేఘం
వసుంధర అందాలను బహిర్గతం చేస్తూ.
చినుకులు నేల చేరేందుకు
దారి చూపే కాంతిమార్గమనిపిస్తోంది ఆ విద్యుల్లత.

ఆకాశం ఆరేసిన ఏడువారాల కోకలనెలా తడిపేస్తోందో
ఆ తుంటరి మేఘం.
మేఘుని నీటితుపాకి కాల్పుల అభ్యాసం
తొలకరిలోనే.
మేఘుని జల(అ)నియంత్రణలు
పుడమి కట్టిన పచ్చనిచీరను తడుపుతూ.

తొలకరి అలవోకగా అల్లేస్తూ ఉంటుంది
నీటితివాచీలను...చినుకు దారాలతో.
చిందేస్తూ చినుకుల చిన్నది
మేఘ తాళాలకి ధీటుగా.

ఎక్కడ నేర్చిందో ఆ కొండ
చినుకుచుక్కలని క్షీరధారలుగా మార్చే విద్య.
చినుకు పలకరిస్తే చాలు
సిగ్గుతో పరుగందుకుంటుంది సెలయేరు.
వానకారులో ధరణి కోసం తెల్లకోకలంపుతూనే
ఉంటాడు ఆ పర్వతుడు. ....                                @శ్రీ

07/08/2013

అలుకకీ అలుకే
నీ అలుకకి కూడా అలుకట
నిన్ను త్వరగా ప్రసన్నం చేసుకోలేదని.
నీఅలుక నాకు అపురూపమే 
అలుకలో నీ అందం కెందామరకి ప్రతిరూపమే. 

అక్షరాలన్నీ పోటీ పడుతున్నాయి
నీవైన నాకైతలనలంకరించాలని
భావచందనాన్ని పూసుకొని
నవ పరిమళాలను వెదజల్లుతున్నాయి
నీ అందాలనుకప్పే భావాంబరానికి
తళుకులద్దాలని తొందరపడుతున్నాయి
ప్రతీ భావనర్తనానికీ
మురిపించే మువ్వలౌతున్నాయి
కళ్యాణ తలబ్రాలు కావాలని
పసిడి రంగు పూసుకుంటున్నాయి

భావాలన్నీ కొత్తకోకలు కట్టుకుంటున్నాయి
నీ మెప్పుపొందాలని.
కాముని శరాలని తోడు తెచ్చుకుంటున్నాయి
కలహమింకచాలించమని
అలుక తీరిన తదుపరి క్షణాలు తలచుకొని
సిగ్గిల్లుతున్నాయి
గమనంలో వయ్యారాలు చూపుతూ
సెలయేటి నడకలను తలపిస్తున్నాయి
నీ సౌందర్యాతిశయాలకు
అక్షర హస్తాలతో మోకరిల్లుతున్నాయి...@శ్రీ .

04/08/2013

|| e- స్నేహం ||


నిన్ను మునుపెప్పుడూ చూడలేదు 
ఎప్పుడూ మాట్లాడలేదు 
స్నేహమంటూ ఒకనాడు చేయి చాపావు 
చేయి కలుపుతూ సరేనన్నాను
నువ్వు థాంక్స్ అన్నావు
నేను వెల్కమ్ చెప్పాను

ఆత్మీయంగా రోజూ పలకరింపులు
శుభోదయాలు శుభరాత్రులు
పండుగలప్పుడు శుభాకాంక్షలు
పబ్బాలప్పుడు గ్రీటింగు కార్డులు

బాల్య స్నేహితులు గుర్తుకి రావడం లేదు
కాలేజ్ దోస్తీలు మరచిపోయాను
స్నేహంలోని ఆత్మీయతలలో కొట్టుకు పోతున్నా
అందులోని ఆప్యాయతలలో తేలిపోతున్నా
'e'- స్నేహాల వెల్లువలో మునిగిపోతున్నా

ఒక్కొక్కరినీ ప్రత్యక్షంగా కలుస్తుంటే
అనిపిస్తోంది ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లే
వినిపిస్తోంది ప్రతి మదినుంచీ స్నేహగీతం.
దినదినం వర్ధిల్లుతోంది మీతో ఈ అంతర్జాల స్నేహం... ...@శ్రీ 03/08/2013

(నేస్తాలూ కాదంటారా? ఈ అనుభవం చాలా మందికి అవుతోందని అనుకుంటున్నాను.
నాతో చక్కని ఆరోగ్యకరమైన స్నేహాన్ని కొనసాగిస్తున్న నా అంతర్జాల స్నేహితులందరికీ
ప్రేమతో ఈ కవితా కానుక ...@శ్రీ )....

31/07/2013

శాకుంతలం-3


నాలుగు వైపులా హోమాగ్నులు 
వేదమంత్రాల ప్రతిధ్వనులు 
ఆజ్యాల సుగంధాలు 
హవిస్సులు అందుకొనే దేవతలు.

మరుమల్లెల సుగంధాలు ఒక ప్రక్క 
విరజాజుల పరిమళాలు వేరొక ప్రక్క 
సంపెంగల సౌరభాల ఆహ్లాదం 
పున్నాగల పలకరింపుల ఆహ్వానం 

అటునిటు పరుగులెత్తే శశకాలు 
చెంగు చెంగున గెంతులేసే హరిణాలు
మయూరాల క్రీంకారాలు 
శుకపికాల కలరవాలు
ఇవే కణ్వుని ఆశ్రమంలోని దృశ్యాలు 

అతిశయించిన సౌందర్యంతో 
ముని కన్నెల మధ్య శకుంతల. 
పారిజాతమాలికలు  సిగలో చేరితే 
మల్లెలదండలు కరమాలలైనాయి.
గరికపూలు గళసీమను కౌగిలించాయి. 
తెల్లచేమంతులు చెవికి భూషణమైనాయి

వనజీవులతో వార్తాలాపాలు
సఖులతో సరదాల ఆటలు
మాధవీలతలతో స్నేహాలు
మొక్కలతో ముచ్చట్లు 
మునులకు సుశ్రూషలు
ఇవే మేనకా విశ్వామిత్రుల తనయ దినచర్యలు 

  

06/07/2013

అమరం
ఏనాడైనా ఒక్క సెల్యూట్ కొట్టావా?
దేశానికై ప్రాణమర్పించిన యోధునికి. 

ఏనాడైనా ఒక్క గులాబీని ఉంచావా?
వీరమరణం పొందిన సైనికుడి సమాధిపై. 

ఏనాడైనా భుజం పట్టావా?
సమర యోధుని పార్ధివ శరీరానికి 

ఏనాడైనా ఆప్యాయంగా కౌగిలించుకున్నావా?
దేశం కోసం పోరాడిన యోధుడు నేలకొరిగిన చోటుని.

ఏనాడైనా మోకరిల్లావా?
అమరవీరుల స్మృతిచిహ్నం ముందు.

ఏనాడైనా ప్రేమగా స్పృశించావా?
యుద్దవీరుని కృత్రిమపాదాన్ని

ఏనాడైనా మందు పూసావా?
క్షతగాత్రుడైన దేశ సైనికుని శరీరానికి.

ఏనాడైనా వీరతిలకం దిద్దావా?
యుద్ధానికెళ్ళే వీరుని నుదిటిపై.

ఏనాడైనా శిరస్సున అద్దుకున్నావా?
విజయపతాకంతో తిరిగొచ్చిన సైనికుని పాదధూళిని.

ఏనాడైనా ప్రత్యక్షంగా చూసావా?
అమరసైనికునికిచ్చే గౌరవ వందనం.

ఏనాడైనా ఒక్కరూక విరాళమిచ్చావా?
కంటికి రెప్పలా కాపాడే సైనికుల సంక్షేమనిధికి.

ఏనాడైనా కన్ను చెమ్మగిల్లిందా?
శత్రు తుపాకుల తూటాలకి
ఛిద్రమైన యోధుల శరీరాలను చూసి.

ఏనాడైనా సంకల్పించావా?
నీ ఇంట్లో ఒక్కరినైనా దేశరక్షణకై పంపాలని.

ఏనాడైనా అనుకున్నావా?
శత్రు శతఘ్నికి ఎదురునిలవాలని.
దేశరక్షణకై ప్రాణమర్పించాలని.               @శ్రీ 


19/06/2013

నేనెవరో చెప్పాలా ?

శ్రీ || నేనెవరో చెప్పాలా ||

నీ తలపు వెనుక
వలపును నేనై
పలకరించిపోతున్నా.
మదితంత్రులను మీటి పోతున్నా.

నా ఊహకి రెక్కలొచ్చి
ప్రణయసందేశాన్ని మోసుకుంటూ
శ్వేత కపోతమై
నీ భుజంపై వాలుతున్నా.

నా కెంపు పెదవిపై విరిసిన దరహాసమై
నీమదిని కోసే చంద్రహాసమై
సప్తవర్ణాలను నింపుకున్న
ధవళ కిరణమై
సమీరంలోని నిశ్శబ్ద ప్రేమలేఖనై
రాగాలపల్లకిలో నిను పలకరించే
మౌనగానమై మదిని తాకుతున్నా.

నీకై వ్రాసే కవనాన్నై
అక్షర నివేదన చేసే గీతాన్నై
నీ చక్షువులను తాకుతున్నా
నీ శ్రవణాలలోనికి చేరుకుంటున్నా

ఇంకా అడుగుతున్నావా
నేనెవరని?
ఇంకా ప్రశ్నిస్తున్నావా
నీదైన నా అస్తిత్వాన్ని.........శ్రీ


16/06/2013

నాన్న॥ నాన్న॥ 

ఓ వులేన్ ప్యాంటు 
ఓ టెర్లిన్ షర్టు 
కోరమీసం 
చలువకళ్ళద్దాలతో నాన్న.

అమ్మకి పూలు
తాతకి మందులు
నాకు బిస్కెట్లు
చెల్లికి చాక్లెట్లతో నాన్న.

అమ్మ రోగానికి
నా చదువుకి
చెల్లి పెళ్ళికి
అప్పులతో నాన్న.

ఓ వాలుకుర్చీ
ఓ కళ్ళజోడు
ఓ న్యూస్ పేపరు
పక్కనో టీ కప్పుతో నాన్న

దుమ్ముపట్టిన ఫ్రేములో
వాడిన పూలదండతో
మా నిర్లక్ష్యానికి సాక్ష్యంగా
నవ్వుతూ అమ్మ పక్కన నాన్న. ... @ శ్రీ ...

(తెలుగు వన్ లో ప్రచురించబడిన కవిత )

http://www.teluguone.com/sahityam/single.php?content_id=260

18/05/2013

విరహోత్పాతం


నాటా మాట ఉగాది సంచిక-2013 లో ప్రచురించబడిన నా కవిత శ్రీ || విరహోత్పాతం ||

తొలిసారి విన్న నీ పలకరింపు
తీయగా నా చెవిలో
నాదనర్తనం చేస్తూనే ఉంది

తొలిసారి పంపిన నీ ప్రేమ సందేశం
చదివిన కళ్ళు
సిగ్గు పడిన విషయం
తలిచే నా మది...
నిత్యం మంకెనపూలు పూస్తూనే ఉంది.

తొలిసారి నిన్ను చూసిన క్షణం
నా కళ్ళలో మెరిసిన మెరుపు
నా చీకటి మదిని
కాంతివంతం చేస్తూనే ఉంది.

తొలిసారి నీ చేతిని తాకిన క్షణం.
మంచుపూలు సుకుమారంగా
ఎదపై జారిన ఆ అనుభూతి...
గ్రీష్మాన్ని సైతం హేమంతంగా మారుస్తూనే ఉంది.

'నిన్ను' మాత్రమే ప్రేమిస్తున్నాననే
అందమైన నిజాన్ని విన్న
విప్పారిన కళ్ళు ఆశ్యర్యంగా చూసిన
చూపుల తాకిడి నా ఎదలో సృష్టించిన
తరగల నురుగుల్ని నా మనసు
ముఖానికి రుద్దుకుంటూనే ఉంది.

నా ప్రేమ ఊసుల్ని బిడియంగా విన్న
నీ చెవి లోలకుల కదలిక
గుండె గడియారంలో
వలపు డోలనాలు చేస్తూ,
మనసుని ప్రతి క్షణం ఉల్లాసపరుస్తూనే ఉంది.

నీ చేతి గాజుల్ని సవరించిన
చూపుడువేలుతో
దేనిని తాకినా ఆ సవ్వడినే తలపిస్తూ
వళ్ళంతా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.

నీతో కలిసి నడిచిన ప్రతి అడుగు
నీవు లేకుండా కాలు కదపనని
మొరాయిస్తూనే ఉంది.

నీ పెదవెంగిలి చేసిన శీతల పానీయపు గొట్టం
నీదైన జ్ఞాపకాల అలమరలో
ఇంకా భద్రంగానే ఉంది.

నీతో గడిపిన ప్రతి మధుర క్షణం
నీవు లేని చేదు జ్ఞాపకాన్ని సైతం
తీయని తేనియలా మార్చేస్తూనే ఉంది.

మనసుకి ఎంత నచ్చజెప్పుకున్నా,
ఆకలితో ఉన్న అజగరం...
చిక్కిన లేడిని నిదానంగా మింగుతున్నట్లు
నీ వియోగం నన్నుకబళిస్తూనే ఉంది,
విరహ తిమిరం... వలపు వెలుగుని తాగేస్తున్నట్లు
అంతులేని విషాదం
నా ఆనందాన్ని అహరహం అదిమేస్తూనే ఉంది. @శ్రీ.