19/05/2012

నీ దివ్య నేత్రాలు
శ్రీ || నీ దివ్య నేత్రాలు ||

ప్రభూ!
నీ దివ్యచక్షువులను దర్శించాక,
ఇక యే చంచలనేత్రాలను
చూడ మనసగుటలేదు...

సుందరనయనాలెన్నో  చూసానింతవరకు,
వాటిలోనే మూర్ఖంగా వెతుక్కున్నాను 
అందాన్ని యింతకాలం...

నీ  నేత్రాలలో
విశ్వజనీనమైన  వాత్సల్యం
అవ్యాజమైన ప్రేమ
మలయపు చల్లదనం
నేడు మనో నేత్రానికి గొచరమౌతున్నయి 

ఒకకంటితో   
సూర్యుని  ధవళ కాంతులను  శాసిస్తూ,
వేరొక  కంటితో
ఈ జగతికి 
వేయి పున్నముల వెలుగునిస్తున్నావు.

నీ నయనాలు
జలపుష్పాలను తలపిస్తూ 
నీరజ దళాలంత
నిశ్చలంగా  ఉన్నాయి.
చలాచలానికి సాక్షిగా...


ఆ  చూపులచల్లదనం  
నాపై ఎపుడూ ప్రసరించనీ ...
ఆ  నేత్రద్వయం
చూపే  వెలుగులో  నీ సన్నిధి చేరనీ...   @శ్రీ