09/08/2012

శృంగారార్చన???

                                 
                                         (నేను చేసిన ఈ వీడియో తిలకించండి.)
                                            
ఆసనం ఎందుకు?
    క్రీడాపర్వతం ఉండగా...
అర్ఘ్య పాద్యాలెందుకు?
    ఎదురుగా యమున ఉందిగా...

ధ్యానం వేరే యెందుకు?..
   ఎపుడూ నీ ధ్యానమేగా...
పుష్పం కావలెనా?
    నీ హృదయ కుసుమం ఉందిగా...

పత్రం ఎందుకు?
    శతపత్ర దళ నేత్రాలుండగా...
స్నానమెందుకు?
   నీ వలపుల జల్లు ఉందిగా...

అక్షతలెందుకు?
   క్షతం కాని నీ ప్రేమ ఉండగా...
చామరమెందుకు?
   నీ నీలి కురుల వింజామర ఉందిగా...

మధుర  గీతాలు వద్దు.. 
   నీ మాటల సంగీతాలే చాలు...
అగరు పొగలు వద్దు..
   విరహపు సెగలే చాలు... 

శ్రీ చందనాలు వద్దు...
   నీ మేని పరిమళమే  చాలు 
 పంచామృతాలు వద్దు...
   నీ  పెదవుల మధువులు చాలు...

నైవేద్యం వద్దు...
   నీ సాన్నిధ్యం చాలు...
ఘంటారావాలు వద్దు...
   నీ కాలి అందెల సవ్వడులే చాలు...

మంగళ తూర్యారావాలు వద్దు...
   నీ రతనాల మొలనూలు తాళమే మేలు..
నీరాజనం వద్దు... 
  నా రాధ హా'రతులు' చాలు......

స్వస్తి వాచకం వద్దు...
  క్రియల పునరావృతమే నీ మాధవునికి ముద్దు...

( శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా...అష్టమి నాటి జన్ముడు,
అష్ట భామల నాథుడు...అష్టైశ్వర్య ప్రదాత....అయిన 
ఆ దేవదేవునికి నేను అర్పించుకొనే అష్ట కవితా సుమార్పణంలో 
సహకరించి  ప్రోత్సహించిన బ్లాగ్ మిత్రులకి కృతఙ్ఞతలు సమర్పిస్తూ..
అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తూ...
ఈ కవితాసుమాంజలిని శృంగారమూర్తులైన రాధాకృష్ణులకు
నీరాజనంగా సమర్పించుకుంటున్న ' శ్రీ ' )