11/09/2014

|| కనులుతెరచి చూసాను - తెలుగు గజల్ || (200 వ పోస్ట్ )


             ( నా 200 వ పోస్ట్ ... ఆదరిస్తున్న అందరికీ వందనాలతో  )నీకోసమె ప్రతినిమిషం వేచిచూసి అలిసాను 
కలకోసమె ప్రతిరేయీ కలవరించి అలిసాను 

పగలురేయి నీధ్యానమె చేసుకుంటు గడిపాను 
కళ్ళలోన నీరూపమె నిలుపుకుంటు మురిసాను 

నాప్రాణమె నీవంటూ బాసలెన్నొ చేసాను
నీప్రేమల వర్షంలో మరలమరల తడిసాను 

చెరోచోట మనముంటు కలవలేక పోతున్నా    
ఊహలలో నిన్ను చూసి పూవులాగ విరిసాను

ప్రేమలన్ని గుడ్డివని అంటారుగ #నెలరాజా
ప్రేమలోన పడినాకే కనులు తెరచి చూసాను .......@శ్రీ 

|| తెలుగు గజల్ ...నువ్వు నవ్వావని ||

నిశియంతా వెలుగైతే తెలిసింది నువ్వు నవ్వావని 
వనమంతా విరులైతే  తెలిసింది నువ్వు నవ్వావని 

తనువంతా తడియైతే తెలిసింది నువ్వు తాకావని 
కలతంతా  సుఖమైతే తెలిసింది నువ్వు నవ్వావని

మనసంతా చెమరిస్తే తెలిసింది నువ్వు చూసావని 
ఎదలోనే  రవమైతే  తెలిసింది నువ్వు నవ్వావని 

ధరయంతా దివియైతే తెలిసింది నువ్వు ఉన్నావని
వరమేదో వశమైతే తెలిసింది నువ్వు నవ్వావని 

#నెలరాజా కనిపిస్తే  తెలిసింది నువ్వు నవ్వావని
మధురంగా సడియైతే తెలిసింది నువ్వు నవ్వావని   ... @శ్రీ 

|| నువ్వు నేను ||

నా తలపులలో నిలుస్తావు 
నీ జ్ఞాపకాలతో బాధిస్తావు
నిన్ను నేను తలపుగా భావిస్తున్నా,
జ్ఞాపకంగా మిగిల్చావు నన్ను జ్ఞాపకాల జ్వాలల్లో కాలిపోతున్నా
చందనపు చల్లదనం మదిని తాకుతోంది హాయిగా
వలపుశరాలతో నీవు చేసేవి తీయని గాయాలు
మదిని ప్రేమగా పలకరించేవి నీవైనజ్ఞాపకాలు.
మదిలోయల్లో నీకోసమే అన్వేషిస్తున్నా
నీ జ్ఞాపకాలనే సోపానాలుగా చేసుకుంటూ
నిన్ను అందుకోవాలనే ప్రయత్నంలో విఫలమైనా
సాలెపురుగునే ఆదర్శంగా తీసుకుంటూ...
మునుముందుకి సాగిపోతున్నా.

నీ అడుగులో అడుగు కలపాలనే తపనలతోఅడుగులో అడుగు కలిపితే గమ్యం సుగమమే
ఎదసంద్రంలో అలవైతే ధమనుల్లో తేనెల పరుగులే ...
ఎదసవ్వడి నువ్వనే నిశ్శబ్దమై మిగిలున్నా
నా గమ్యం నువ్వనే ఏడడుగులు వేస్తున్నా.
సవ్వడి నేనైతే నీమువ్వల రవళితో జత కలుపు
గమ్యం దూరమైనా నీ సహకారంతోనే నా ముందడుగు