14/08/2012

స్వర్ణ భారత్.....నిత్యం పరవళ్ళు తొక్కే నదీ,నదాలతో
నిరంతరం సాగే  ప్రవాహాలతో 
ఉరికే  జలపాతాలతో 
నిండి ఉంది మనదేశం 
అయినా  త్రాగేందుకు గుక్కెడు నీరు కొనుక్కొనే
దౌర్భాగ్యమే మన భాగ్యం...

ప్రత్తి పంటకి  లేదు కొదవ...
వస్త్రోత్పత్తికి లేదు లోటు....
అయినా బీదరాలికి 
చిరుగు చీరేలే శరణ్యం...

సస్యశ్యామలం  మన దేశం...
ఆహార ధాన్యాలు నిండిన  భాండాగారం..
అయినా..
ఆకలి చావులు రోజూ తప్పని వైనం..
కుపోషణతో చిన్నారులు నిత్యం  కంటపడే  దృశ్యం.

యత్ర నారీ అస్తు పూజ్యంతే  రమంతే తత్ర దేవతా!

అన్న శ్లోకం పుట్టింది ఈ భూమి పైనే....


నేడు అభినవ దుశ్శాసన,కీచకుల వారసులు 

అడుగడుగునా కనిపించేదీ ఇక్కడే....

గర్భంలోనే ఆడకూనలని విచ్చిన్నం చేసేదీ ఈ గడ్డ మీదే.


నాడు శాస్త్రీయ సంగీత నృత్యాలు పుట్టినది ఈ భూమిలోనే...

నేడు అర్థనగ్న నృత్యాల  డిస్కోథెక్ లు పెరుగుతున్నదీ ఇక్కడే... నాడు వైవాహిక వ్యవస్థ ఊపిరి పోసుకున్నదిక్కడే...

నేడు సహజీవనం (living together) అనే  

కుసంస్కృతి నెమ్మదిగా కాళ్లూనుతోందీ ఇక్కడే...


నాడు న్యాయానికీ,ధర్మానికీ పట్టుకొమ్మ మనదేశం...

నేడు అక్రమార్క  నేతలు మన సొత్తు..

ఆ నాయకుల  చేతిలో  మన విత్త వ్యవస్థ అవుతోంది చిత్తు.
'భారత్ వెలిగిపోతోంది' అని ఒక పార్టీ అన్నా...

'మేరాభారత్ మహాన్' అని ఇంకో పార్టీ అన్నా...

వాస్తవాల్ని చూద్దాం...

న్యాయం కోసం పోరాడుదాం..

అవినీతిని అంతం చేద్దాం 

చేయి, చేయి కలుపుదాం....

బంగారు భారతాన్ని  నిర్మిద్దాం...
బాపు కలలు కన్న భారత దేశాన్ని


నేడు కాకున్నా రేపైనా 

నిర్మించగలమని ఆశతో జీవిద్దాం...
  

  (బ్లాగ్ మిత్రులందరికీ...స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు...)

16 comments:

 1. వావ్.. ప్రజెంటేషన్ సూపర్ శ్రీ గారు!
  మూడు రంగులు వచ్చేలా, భలే వుంది..
  పాట బాగా మ్యాచ్ అయ్యింది..

  చాలా బాగుంది... చాలా చాలా బాగా రాసారు :)

  మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

  ReplyDelete
  Replies
  1. బోలెడు ధన్యవాదాలు హర్షా!:-)
   మీకు కవిత, పాట , ప్రస్తుతీకరణ నచ్చినందుకు...
   మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు...
   @శ్రీ

   Delete
 2. శ్రీ గారూ కవిత అద్భుతంగా ఉంది, అడుగడుగునా మనం ఏమి కోల్పోయామో చక్కగా చెప్పారు.
  మీరన్నట్లే స్వర్ణ భారత్ కోసం కలలు కందాం కలసికట్టుగా సాదిన్చుకుందాం.
  సామాజిక పరమైన కవితలు కూడా చక్కగా రాయగలరని నిరూపించుకున్నారు.
  మీరు కవితని , భావాన్ని చక్కగా ఆవిష్కరించారు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు ఫాతిమా గారూ!
   మీకు కవితాభావం నచ్చినందుకు...
   స్నేహపూర్వకమైన ప్రశంసకి...
   మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు...
   @శ్రీ

   Delete
 3. స్వాతంత్ర్యం ఏమి ఇచ్చిందో కాని ఇవ్వనిదంతా చాలా బాగా వర్ణించారు.దీనికి చాలా కారణాలున్నాయి.

  ReplyDelete
  Replies
  1. స్వాతంత్ర్యం ముందు,
   స్వాతంత్ర్యం తర్వాత అనే మాట
   నేనెక్కడా వ్రాయలేదు రవి శేఖర్ గారూ!
   మనకున్న వనరులు, సంస్కృతి వీటి పరిస్థితి చెప్పానంతే..
   మీ స్పందనకి ధన్యవాదాలు...
   మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు...
   @శ్రీ

   Delete
 4. గతమంతా ఘనమేమీ కాదు -
  సాటి మనుషుల్ని మనుషులుగా చూడలేని -
  అభిజాత్యపు టహంకారపు మురికి కూడా గతమే .

  వర్తమాన మంతా వల్లకాడూ కాదు -
  అణగారిన వారంతా అంతో ఇంతో -
  స్వతంత్ర సమీరాలు పీలుస్తున్నారు నేడు .
  ----- సుజన-సృజన

  ReplyDelete
  Replies
  1. రాజా రావు గారూ! మీ స్పందనకి ధన్యవాదాలు...
   గతంలో , వర్తమానంలో సంస్కృతి ఎలా అయిందో...
   వనరులు ఎలా దుర్వినియోగమౌతున్నాయో..
   అవినీతి వలన మన పరిస్థితి ఎలా ఉందో...
   స్త్రీకి రక్షణ ఎలా లేదో...
   ఇవి మాత్రమే దృష్టిలోకి తీసుకొని వ్రాసానండి...

   రాచరికపు వ్యవస్థలో అణగారిన వర్గాలు...
   స్వాతంత్ర్యం ముందు వారి స్థితి
   వారు ఇపుడున్న పరిస్థితి...వీటిని ఎక్కడా అసలు స్పృశించలేదు.
   గమనించగలరు...

   మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు...
   @శ్రీ

   Delete
 5. Patriotic Poetry.
  Happy Independence Day.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు మీ స్పందనకి ప్రేరణ గారూ!
   మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు...
   @శ్రీ

   Delete
 6. "బాపు కలలు కన్న భారత దేశాన్ని
  నేడు కాకున్నా రేపైనా
  నిర్మించగలమని ఆశతో జీవిద్దాం..."

  "శ్రీ" గారూ.. ప్రస్తుతం సపరిస్థితులు ఎలా ఉన్నా..
  వాటిని సరిచేయగలమన్న నమ్మకంతో,ఆశతో ముందడుగు వేయాలని
  మంచి సందేశాన్ని అందించిన మీ కవిత చాలా బాగుందండీ..

  మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!

  ReplyDelete
  Replies
  1. అవును రాజి గారూ!
   ఆశావాదంతో ముందుకు సాగాలన్నదే నా భావం..
   కవితా భావాన్ని మీరు చక్కగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు...
   మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు...
   @శ్రీ

   Delete
 7. కవిత నాటి విప్లవ వీరుల ఉద్యమ స్పూర్తిని గుర్తు చేసింది
  స్వాతంత్ర్యా భినందనలతో
  కృష్ణ

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు కృష్ణా!
   మీకు కవితాభావం నచ్చినందుకు...
   మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు...
   @శ్రీ

   Delete
 8. చక్కటి పోస్ట్. చాలా బాగా వ్రాశారండి.

  ReplyDelete
 9. మీ ప్రశంసకి ధన్యవాదాలండి...
  @శ్రీ

  ReplyDelete