13/06/2012

తొలకరి జల్లునల్లని మబ్బులు నెమ్మది నెమ్మదిగా ఆకాశాన్ని కమ్మేశాయి..
వెలుతురును  మింగేసే చీకటిలా....

కృష్ణ మేఘాలను వెంటబెట్టుకొని బయలుదేరిన శచీంద్రుని 
ఐరావతం ఘీంకారాలు,
ముందు నడిచే భేరీ ,మృదంగ ధ్వనులతో.....

ఈ ఋతువంతా మిమ్మల్ని వదలమంటూ
కరిమబ్బులని  వెంట బడుతూ,
చుట్టుకుంటున్న  విద్యుల్లతల మెరుపులతో....
  
సాయం సంధ్యలో దేవ సేనాని   మయూరం
పురి విప్పినట్లుగా...
సప్త వర్ణాల ఇంద్ర చాపం కనువిందు చేస్తుంటే...

ఈ క్షణం కోసం ఐదు ఋతువుల కాలం 
వేచి ఉన్న ధరిత్రి పులకరించేలా ,
ప్రకృతి పరవశించేలా...
వేసవి వేడి గాడ్పుల తాపానికి 
పూర్ణ విరామం యిస్తూ...
నింగి నుంచి నేలకు నీటి వంతెన వేస్తున్నట్లు 
కురిసింది
తొలకరి జల్లు.

( నిన్న సాయంత్రం కురిసిన తొలిజల్లుని చూస్తూ అల్లిన కవిత.. @శ్రీ )

16 comments:

 1. మంచి వాతావరణం లో కవిత్వం పుట్టుకొస్తుందంటారు. చల్లని చిరు గాలిలో, సన్నని చిరుజల్లులోంచి పుట్టుకొచ్చిన మీ కవిత చాలా బాగుంది 'శ్రీ' గారు.

  ReplyDelete
  Replies
  1. తొలకరి జల్లు కురిసిన వెంటనే వచ్చిన
   మీకు నేను,నా బ్లాగ్ చెప్పే స్వాగతం అందుకోండి నాగేంద్ర గారూ!
   మంచి పద్యం కావాలంటే ...పున్నమి రేయి...
   తూగుటుయ్యాల...ప్రియురాలు తెచ్చే కర్పూరపు తాంబూలం ...
   ఉండాలని చెప్పే పెద్దనగారి పద్యం (ఆయనదే అని గుర్తు)ఏదో గుర్తుకొస్తోంది ..మీ వ్యాఖ్య చూస్తే..
   ధన్యవాదాలు మీకు...
   @శ్రీ

   Delete
 2. కవిత చాలా బాగుంది అండి శ్రీ గారు..
  ఈ తొలకరి జల్లు మమ్ములను ఎప్పుడు కరునిస్తుందో...

  ReplyDelete
  Replies
  1. మీ భాగ్యనగరానికి తొలకరి వచ్చేసింది కదండీ!
   మిమ్మల్ని కరుణించే వలపుల జల్లుని... తొలకరి జల్లు అనడం లేదు కదా?
   :-))
   నా కవిత మీకు నచ్చినందుకు మీకు ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 3. శ్రీ గారు కవిత చాలా బాగుంది...
  మాకు జల్లు కురవలేదు... కానీ మీ కవితా జల్లుతో నన్ను తడిపేసారు... ధ్యాంక్యూ..
  :)

  ReplyDelete
  Replies
  1. మొత్తమ్మీద జల్లులో తడిసానంటారు...:-)
   మీ ప్రశంసకి ధన్యవాదాలు సాయి గారూ!...
   @శ్రీ

   Delete
 4. శ్రీగారూ, సింపుల్ గా మొదలైన కవిత పెద్ద ,పెద్ద ఉపమానాలతో ముగిసింది, ఎక్కువ అక్షరముత్యాలను కూర్చి కవితలో ఎక్కువ లాభం (సోయగం ) చేకూరింది అనికుంటా, కవిత బాగుంది,

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు ఫాతిమా గారూ!
   మీకు నా కవితోపమానాలు నచ్చినందుకు...
   @శ్రీ

   Delete
 5. >>సాయం సంధ్యలో దేవ సేనాని మయూరం
  పురి విప్పినట్లుగా...
  సప్తవర్ణాల ఇంద్ర చాపం కనువిందు చేస్తుంటే...>>

  బావుందండీ...

  ReplyDelete
  Replies
  1. జ్యోతి గారూ!
   మీ ప్రశంసకి ,
   ఆ 'ఉపమ' మీకు నచ్చినందుకు
   ధన్యవాదాలు...
   @శ్రీ

   Delete
 6. chakkani kavitha, tholakari jallula.

  ReplyDelete
  Replies
  1. కవితను మెచ్చినందుకు ధన్యవాదాలు భాస్కర్ గారూ!
   @శ్రీ

   Delete
 7. నాకు ఈ ఉపమానాలు అవి పెద్దగా తెలియవు. కాని కవిత మాత్రం హాయిగా ఉంది శ్రీ గారు.

  ReplyDelete
  Replies
  1. ఉపమానాలంటే comparisons...
   అంతేనండీ!
   నాకెందుకో వర్ణనలంటే ఇష్టం...
   నా కవితలలో అవే ఎక్కువ కనిపిస్తాయి...
   మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు....
   @శ్రీ

   Delete
 8. చాలా బాగా వర్ణించారు ........
  జల్లు మాకింకా కురవలేదు కానీ మీ కవిత లో వచ్చినట్టు
  మాకూ వస్తే మీ కవిత చదివినంత హాపీ ......శ్రీ గారూ! :) :)

  ReplyDelete
 9. మీ ప్రశంసకి ధన్యవాదాలు సీత గారూ!
  సీత గారు 'శీత కన్ను'
  వేసారేమిటా? అనుకుంటుంటే...
  పలకరించేసారు...
  మీరుకూడా తొలకరికి తొందరగా పులకరిస్తారులెండి...:-)
  @శ్రీ

  ReplyDelete