23/11/2012

దుఃఖం


దుఃఖం... నిన్ను  దాచాలంటే 
అందరికీ సాధ్యం కాదని తెలుసు...
పెల్లుబికే ఉప్పెనను రెండుకళ్ళలో
దాచటం అంటే మాటలా?

బిందువులో సింధువును 
చూపడం సులువే గానీ 
గుప్పెడంత గుండెలోని శోకాన్ని 
ఆల్చిప్పలాంటి ఆ కళ్ళలో దాచటం ఎంత కష్టం?

ఆనందబాష్పాలు చిందిస్తే 
బుగ్గల మీద జారిన 
కన్నీటి  చుక్కలు సైతం 
వెండి తళుకులతో మెరుస్తూ 
ఆనందాన్ని ప్రతిఫలిస్తాయి...
కాంతిని విఫలం (వక్రీభవించి) చేసి 
సప్తవర్ణాలను వెదజల్లుతాయి.

వేదనతో, ఆవేదనతో 
ఆ కళ్ళు వర్షించే 
ఆమ్లధారల  ధాటికి
లేత గులాబి బుగ్గలపై  
ఎప్పటికీ మిగిలిపోయే 
చారికలుగా  నిలిచిపోతాయి...

ముఖాన్ని...
కృత్రిమముఖంలో 
దాచేసుకున్నా 
ఆ ముఖం పైన కూడా 
నీ అవశేషాలు 
స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి...

మనస్సంద్రంలో 
నిలువెత్తు కెరటాలతో ఎగసిపడే 
దుఖాన్ని వర్షించాలంటే 
వేయి కళ్ళు కావాల్సిందే...
వేలనదులై పారాల్సిందే...

నిన్ను నా చిరునవ్వులో 
దాచే ప్రయత్నం చేస్తూనే ఉన్నా,
ఆ చిరునవ్వునే కన్నీరు కార్పించే శక్తి 
నీకు ఎవరిచ్చారో?


                                                           18 comments:

 1. తేలిక పదాలతో భారమైన భావాన్ని పలికించారు..
  చాలా బాగుంది..శ్రీ గారు..

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు ధాత్రి గారూ!
   మీరు కవితని మెచ్చినందుకు
   నా బ్లాగ్ కు స్వాగతం....@శ్రీ

   Delete
 2. "నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి..ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసుకో"
  నిజంగా వేదనైనా, ఆనందమైనా దుఖాన్ని దాచలేము కదండీ..
  చాలా బాగుంది శ్రీ గారు...

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు రాజి గారూ!
   మీరన్నది నిజమే...
   మీకు నా భావం నచ్చినందుకు...@శ్రీ

   Delete
 3. దుఃఖాన్ని దాస్తే అది ఇంకా భారం
  అయినా ఆగమంటే ఆగేనా కన్నీళ్ళు!!!
  చాలా బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. పద్మగారూ!...
   కన్నీటిని ఆపితే...
   గుండెలో ఉప్పెనను తట్టుకోవడం కష్టం....
   ధన్యవాదాలు మీ ప్రశంసకు...@శ్రీ

   Delete
 4. బాగుంది శ్రీ గారూ. ముగింపు లైన్లు బ్రహ్మాండం...

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!...
   మీకు నచ్చినందుకు....
   దుఖం హద్దులు దాటితే చిరునవ్వును కూడా కన్నీరు కార్పిస్తుంది కదా!...
   మీ ప్రోత్సాహం నాకెప్పుడూ కొత్తవి వ్రాసేందుకు తోడ్పడుతుంది...@శ్రీ

   Delete
 5. Replies
  1. yes yohanth u are right...
   some feels will be painful...
   but in certain circumstances we can't avoid them....
   thank you very much for ur compliment...@sri

   Delete
 6. చాలా బాగుంది..శ్రీగారు

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు అనికేత్...మీకు కవిత నచ్చినందుకు... మీ ప్రశంసకు ....@శ్రీ

   Delete
 7. నిన్ను నా చిరునవ్వులో
  దాచే ప్రయత్నం చేస్తూనే ఉన్నా,
  ఆ చిరునవ్వునే కన్నీరు కార్పించే శక్తి
  నీకు ఎవరిచ్చారో..........
  same question nenu naa priyuraalini adugutune untaanu...
  very nice sree gaaru

  ReplyDelete
  Replies
  1. పండు గారూ! ధన్యవాదాలు మీ ప్రశంసకు...
   అది ప్రశ్న కాదు...నిజమైన దుఖానికి అంత శక్తి ఉంది....@శ్రీ

   Delete
 8. శ్రీ గారూ, బాదని కన్నులలొ దాచలేమని కవితలొ చక్కగా తెలిపారు. అద్భుతమైన శైలి

  ReplyDelete
  Replies
  1. మేరాజ్ గారూ!...మీకు బ్లాగ్ ఓపెన్ అయిందన్నమాట....ధన్యవాదాలు మీ ప్రశంసకు....@శ్రీ

   Delete
 9. అద్భుతం....!!!
  నిజమే కదా ఆనందాన్ని..ధుఖాన్ని..కట్టిపడేయలేము అణచుకొన్నా
  ఆగేదికాదు సునామిలా పెల్లుబికి వచ్చేవే..ఈ రెండు.
  చాలా బాగా రాసారండీ..థాంక్స్ శ్రీ గారు :

  ReplyDelete
 10. ధన్యవాదాలు ప్రియ గారూ!...
  అవునండీ...రెంటినీ ఆలేము ఆపాలనుకున్నా...
  మీ అభినందనలకు మరోసారి ధన్యవాదాలు....@శ్రీ

  ReplyDelete