04/10/2013

|| వాలు జడ ||






చేమంతుల అందానికి
పచ్చని పసిడి కాంతులిచ్చిన
నీ వాలుజడ

సన్నజాజుల పరిమళాన్ని
ప్రతి పాయలోను నింపుకున్న
నీ వాలుజడ.

గులాబుల గుబాళింపులను
గుచ్చెత్తి నను పిచ్చెత్తించే
నీ వాలుజడ

మొగలి పూల వాసనతో
రేయికి సెగలు రేపే
నీ వాలుజడ

మదనుని కొరడాలా
నీ యవ్వనాన్ని నియంత్రించే
నీ వాలుజడ

జడగంటలను చేతపట్టి
మదిలో వలపుల జేగంటలు మోగించే
నీ వాలుజడ.

మల్లెల మాలలను చుట్టుకుని
విల్లెత్తిన శృంగారంలా
నీ వాలుజడ.

సైకత వేదికలని తాకుతూ
యామినీ వాహినిలా సాగే
నీ వాలుజడ.

నీ నడుము కదలికలవద్ద
వయ్యారం నేర్చుకుంటూ
నీ వాలుజడ.

అలుకలో చెళ్ళుమని
నాబుగ్గల తాకిన పట్టుకుచ్చుల
నీ వాలుజడ

ప్రణయంలో నా మెడను చుట్టి
చెంతకు లాగిన
నీ వాలు జడ.

వసంతుని ధనువుకి
కట్టిన పూలనారిలా
నీ వాలుజడ.

రాత్రులలో కామునితో
కయ్యానికి కాలుదువ్వే
నీ వాలుజడ.

సరసాలలో మిన్నాగులా కదులుతూ
క్షీరనీరాలింగనాల మధ్య నలుగుతూ
సిగ్గుతో మెలికలు తిరిగే
నీ వాలుజడ. ...@శ్రీ 

18 comments:

  1. Excellent srinivas gaaru

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు ...మీ ప్రశంసకి ...@శ్రీ

      Delete
  2. సరసాలలో మిన్నాగులా కదులుతూ
    క్షీరనీరాలింగనాల మధ్య నలుగుతూ
    సిగ్గుతో మెలికలు తిరిగే
    నీ వాలుజడ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు స్వర్ణా ...మీ ప్రశంసకి ...@శ్రీ

      Delete
  3. రాత్రులలో కామునితో
    కయ్యానికి కాలుదువ్వే
    నీ వాలుజడ.

    సరసాలలో మిన్నాగులా కదులుతూ
    క్షీరనీరాలింగనాల మధ్య నలుగుతూ
    సిగ్గుతో మెలికలు తిరిగే
    నీ వాలుజడ. ...@శ్రీ ..చాలా బాగుంది మీ "వాలుజడ వర్ణన" అద్భుతః శ్రీ గారు.:)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీవల్లి గారు ....మీ అద్భుతమైన ప్రశంసకి ...:-)... @శ్రీ

      Delete
  4. ఇంతందమైన వాలుజడ....ఈరోజుల్లో కవితలకే పరిమితమైందేమోనండి :-)

    ReplyDelete
    Replies
    1. నిజం పద్మార్పిత గారూ. ఈ రోజుల్లో వాలుజడ కనుమరుగవుతోంది.

      Delete
    2. పద్మ గారు .....అదేమీ కాదండీ ...ఇప్పటికీ కనబడుతూ ఉంటుంది ప్రత్యేకమైన వేడుకలలో
      ఆధునికత ...సంరక్షణ కుదరదు అంటూ పోట్టిజుట్టు చేసుకొనే మహిళల మీద ఎందుకో
      సానుభూతి నాకు ....ఈ కామెంట్ ని చూసి నా బ్లాగ్ మిత్రులైన ఆడువారు వేరేగా అనుకోరని
      భావిస్తూ ...:-)...మీ ప్రశంసకి ధన్యవాదాలు చేపుఉకుంటూ ...@శ్రీ

      Delete
  5. చాలా బాగుందండి కవిత.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మూర్తి గారు ...మీ ప్రశంసకి ...@శ్రీ

      Delete
  6. కవితలోని ప్రతి స్టాంజా పూల పరిమళాలు వెదజల్లుతూ చాలాబాగుంది శ్రీగారూ..శ్రీస్వర్ణ

    ReplyDelete
    Replies
    1. థాంక్ యు స్వర్ణా ..మీ ప్రశంసకి ....@శ్రీ ...:-)

      Delete
  7. ఒకప్పుడు డైనోసార్ లు అనబడే జంతువులు ఎంతో పెద్దగా ఉండేవట అన్నది ఇప్పటీ తరానికి ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో, కొన్నిరోజులు పోతే పొడవైన వాలుజడ కలిగిన జవరాండ్రు ఉండేవారన్నా అంతే ఆశ్చ్యర్యం కలుగించక మానదు. ఏదైతేనేమి మీ వాలుజడ సొబగులు అద్భుతం

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమే మురళి గారు ....ఇలా అంటే ఆధునిక పోకడలతో పాటు సాగిపోతున్న వారికి కాస్త బాధ కలిగిస్తుందేమో కానీ ...స్త్రీకి అందాన్నిచ్చే అలంకృతాలన్నీ కొన్నాళ్ళకి మ్యూజియాలకి పరిమితం అయిపోతాయంటే ఆశ్చర్యం లేదేమో....

      మీవంటి తెలుగుపండితుల ప్రశంస నాకు పట్టాభిషేకం వంటిదే .../\...@శ్రీ

      Delete
  8. వాలు జడ : చేమంతుల అందాన్ని, సన్నజాజుల పరిమలాన్ని, గులాబి సువాసన తో మదనుని కవ్విస్తుంది నీ వాలుజడ. అమోఘం, అద్భుతం....

    ReplyDelete
  9. చాలా బాగుందండి కవిత.

    ReplyDelete
  10. వాలుజడ కవిత అద్భుతంగా వుంది సర్

    ReplyDelete