18/09/2014

శిశు వేదన







గర్భంలో పడినప్పటినుంచీ పరీక్షలే.
తెలుస్తూనే ఉంది...
నేనెవరో తెలుసుకోవాలనే నాన్న ప్రయత్నం 
కనబడుతోంది...
డాక్టరమ్మకి నాన్నమ్మ ఇస్తున్న లంచం.

చలి పుట్టిస్తోంది... 
అమ్మ పొట్ట మీద పూసిన చల్లని జెల్
భయం పుట్టిస్తోంది...
నిశ్శబ్దంగా పరీక్షాయంత్రం చేసే చప్పుడు.
తల, మెదడు, కాళ్ళు, చేతులు అన్నీ బాగున్నా, 
అసలు పరీక్షలోనే విఫలమయ్యానని స్పష్టమైంది.

అన్నీ కనబడుతున్నాయి స్పష్టంగా...
రక్షించుకోవాలనే అమ్మ ప్రయత్నం 
వధించాలనే నానమ్మ పన్నాగం
వాళ్ళమ్మ మాట జవదాటక 
అమ్మతనాన్ని చంపే నాన్న నిశ్చయం 
గుట్టుచప్పుడు కాకుండా
నన్ను మట్టుబెట్టేందుకు ఊపిరిపోసుకుంటున్న యుద్ధతంత్రం

ఓ దుర్ముహూర్తంలో 
వైద్యుని నాటుమందు అయింది...అమ్మకి విందు
ఉన్న కాస్త చోటులోనే
తప్పించుకోవాలని పరుగులు తీసాను
అలిసిపోయి...మృత్యువుకి దొరికిపోయాను

పైనుంచి చూస్తూనే ఉన్నా...
మరో ప్రాణికి ప్రాణం పోయాలనే
ప్రయత్నంలో మునిగిన  అమ్మానాన్నలను.
చూడాలి ఈసారైనా...
తమ్ముడు పుడతాడో?...
మరో చెల్లి ప్రాణం పోతుందో?                                          @శ్రీ

2 comments:

  1. లెస్సగా చెప్పారు .

    ఇదే మన మానవ నవ జీవనం . ఎవర్ పుడితే ఏమిటి అనే ఆలోచనే లేకున్నది . ఆయువు వున్నంతకాలమే ఈ పరిశీలనలు అని మాత్రం తెలుసుకున్న ఈ మానవులు , ఆడవాళ్ళు లేకుంటే సృష్టే జరగదు అన్నది ఎందుకు మరచిపోతారో ?
    ఏ బంధం , సంబంధం పెట్టుకోని మిగిలిన ప్రాణులు హాయిగా జీవించగలుగుతున్నాయి ఈ లింగభేదం గురించి ఆలోచనే లేకుండా , సృష్టిని ఆపే ప్రయత్నాలేవీ చేయకుండా .

    మానవులు మిగిలిన అన్ని ప్రాణులకంటే అమిత విఙ్నానులని పేద్ద పేరు .

    మఱి ఆ విఙ్నానం నూతనంగా రాబోతున్న ప్రాణులను చంపటానికే వినియోగిస్తున్నారు శాశ్వతం కాని తాము నిరర్ధకమైన స్వార్ధపరత్వం చేత .

    ReplyDelete
  2. చాలా ఆర్ద్రంగా, హృద్యంగా, కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ కవితా చిత్రం.. వికృత పోకడలు పోతున్న మానవ సమాజంలో లింగవిభేదాలు ఎంతగా పెచ్చుమీరిపొతున్నాయో, కుటుంబ సంబంధాలు ఎంత కరడుగట్టిన రాతియుగపు లక్షణాలతో జీవిస్తున్నాయో చూస్తుంటే గుండె చేరువైపోతుంది... అలోచింపజేసిన ఇంత మంచి కవిత రాసినందుకు ధన్యవాదాలు..

    ReplyDelete