15/09/2016

|| చూపలేవు - తెలుగు గజల్ ||
తూఫానుని ఎదిరించే కెరటాలను చూపలేవు 
ఉప్పెనతో పోరాడని తీరాలను చూపలేవు

నరుకుతున్న మానవులకు ఏ శిక్షా వేయవూ 
ఉపకారం  చేయనట్టి  వృక్షాలను చూపలేవు 

శాంతికాముకులమంటూ నేతలు చెబుతుంటారు 
సైన్యాలను పెంచుకొని దేశాలను చూపలేవు 

మలినమైన ఏ హృదయం మునకలతో శుద్ధికాదు  
పుణ్యనదులు కడుగుతున్న పాపాలను చూపలేవు 

ఆ దేవుని మించినట్టి  చిత్రకారుడున్నాడా 
పుడమికాంత పూసుకోని వర్ణాలను చూపలేవు 

ఆరోహణమున్నచోట అవరోహణముంటుందీ 
ఒకే స్థాయిలో సాగే రాగాలను చూపలేవు

కురవాల్సిన చోటునొదిలి ఎక్కడనో కురుస్తాయి 
రైతుల కళ్ళను తుడిచే మేఘాలను చూపలేవు  

తూరుపుకడుపును చీల్చుకు బైటికి వస్తుంటాయి
నెత్తుటి స్నానం చేయని కిరణాలను చూపలేవు  

చీకటిలో అణువణువూ పున్నమిలో తడుస్తుంది 
నెల'రాజేయని' శీతలధూపాలను చూపలేవు #శ్రీ. No comments:

Post a Comment