18/11/2016

|| వెలుగుతూనె ఉండాలి - తెలుగు గజల్ ||మనసులోన వలపుదివ్వె వెలుగుతూనె ఉండాలి (ఉండాలీ) 
ముసురుతున్న వియోగాన్ని తరుముతూనె ఉండాలి

కప్పుకున్న నివురంతా ఎగిరిఎగిరిపోవాలి
కల్లలన్ని  నిజాలలో కాలుతూనె ఉండాలి

చీకట్లకు చూపులలో నిలువనీడనీయవద్దు
కన్నులలో పున్నములను నింపుతూనె ఉండాలి

కదులుతున్నపాదాలకు పూలస్పర్శ తగలాలి  
బాటలోని ముళ్లన్నీ తొలగుతూనె ఉండాలి

రాయిలోన రప్పలోన అన్వేషణ ఆపాలి 
మనిషిలోన మాధవుడిని వెదుకుతూనె ఉండాలి

మెడకుచుట్టినపుడు మనసు 'పట్టు' తప్పిపోతుంది 
'సత్య'లాగ జడను...చెలియ విసురుతూనె ఉండాలి

పాషాణపు మనసనుకొని వదిలేయకు "నెలరాజా" 
ప్రేమించే హృదయంతో చెక్కుతూనె ఉండాలి   

No comments:

Post a Comment