25/03/2012

నా ప్రేమ



ఈ లోకంలో ఇంతమంది ఉండగా
నాతోనే ఎందుకు జత కట్టాలనుకున్నావ్?
నన్నే ఎందుకు తోడుండమన్నావ్?
నాతోనే ఎందుకు జీవితం పంచుకోవలనుకున్నావ్?
నా ప్రేమకోసం ఎందుకు ఆరాటపడుతున్నావ్?
అంటూ ఎప్పుడూ ప్రశ్నిస్తావ్   నన్ను,


పరిమళం పూలతోనే ఎందుకు జత కడుతోంది?
వెన్నెల చంద్రునికే ఎందుకు తోడుంది?
వెలుతురు దీపాన్ని ఎందుకు వీడదు?
నది సముద్రం వైపే ఎందుకు పరుగులు తీస్తుంది?
వీటన్నిటికీ సమాధానం ఉందా?


నీ ప్రేమ కోసం చూసే నా ప్రేమని అడుగు..
నీ ప్రతి ప్రశ్నకి సమాధానం  దొరుకుతుంది.
నీలో ఉన్న నన్ను ప్రశ్నించు,
నాలో ఉన్న నిన్ను ప్రశ్నించు....
నిన్ను కోరే నా మనసు  చెప్పే జవాబు తప్పక దొరుకుతుంది.....






23/03/2012

విరహ తిమిరం



నీకోసం వేయి కన్నులతో....
వేచి చూస్తున్నాను ప్రియా!
లోకానికి చల్లదనాన్నిచ్చే నెలరాజు
మంటలు రేపుతున్నాడు నాలో....

పున్నమి వెన్నెల,  తిమిరాన్ని మింగుతూ
లోకాన్ని ప్రకాశవంతం చేస్తుంటే......
విరహ తిమిరం నన్ను మింగుదామని 
అనుక్షణం కోరలు చాచి నా వెంట పడుతోంది..


నీవు లేకుంటే ఈ విరహతిమిరానికి కూడా నేనంటే అలుసే...

చంద్రుని వెన్నెలంటే భయం లేదట,
వెన్నెల లాంటి నీ చూపంటే భయం అంటోంది,
వెన్నెల కురిపించే నీ మాటలంటే భయం అంటోంది,
వెన్నెల విరిసినట్లుండే నీ నవ్వంటే భయం అంటోంది,
వేయి వెన్నెలల వెన్నల బొమ్మలాంటి నువ్వంటేనే భయం అంటోంది.

నా జీవన  శరత్చంద్రికవై పరుగు పరుగున రావాలి....
నీ రాకతో నన్ను ముసిరిన చీకట్లు పారిపోవాలి...
ఈ విరహ తిమిరం నన్నొదిలి పోవాలి,
నా చెంతకు మళ్ళీ రావాలంటే భయపడాలి....
నా చెంతకు మళ్ళీ రావాలంటే భయపడాలి.
                                                                    @శ్రీ











22/03/2012

'నందన' ఉగాది


సిరిమల్లెల ఘుమఘుమలు
నలుదిశల వ్యాపిస్తునాయి.
వసంత కోకిల కుహు,కుహులతో
ప్రకృతి పరవశిస్తోంది.


ప్రతి చెట్టు... పెళ్ళికి ముస్తాబైన 
నవ వధువులా కనిపిస్తోంది.
ప్రకృతి అంతా సౌందర్యమయంగా
ఆనంద భరితంగా కనిపిస్తోంది...


పిల్ల తెమ్మెర లోని చల్లదనంలా...
కోకిల పాటల లోని మాధుర్యంలా...
పూల మకరందపు మత్తులా...
కుసుమ పరాగాల పరిమళంలా...
'నందన' వనం లోని పారిజాతాల వర్షంలా...


"నందన" నామ సంవత్సరం వచ్చేసింది ..
అందరికి ఆనందాన్ని పంచేందుకు.....
అందిరికి నూతనోత్సాహాన్ని ఇచ్చేందుకు...
అందుకే ఈ ఉగాది...నందన ఉగాది,
'ఆనంద' ఉగాది. 



















21/03/2012

గుర్తుకొస్తున్నాయి



చిన్నప్పటి  ఆటపాటలు, గిల్లికజ్జాలు...
దసరా పండుగల పప్పు బెల్లాలు...
జెండా పండుగులప్పటి  తరగతి సున్నాలు, 
కట్టిన రంగు కాగితాల ఝాలర్లు....



పరీక్షల్లో పక్కోడి పేపర్లో  కొట్టిన కాపీలు...
అప్పుడప్పుడు పెట్టిన  స్లిప్పులు,
పట్టుబడినప్పుడు తిన్న పేకబెత్తం దెబ్బలు....
మార్కులు వెయ్యని టీచర్లని తిట్టుకున్న తిట్లు...

ఖాళీ దొరికితే చేసిన అల్లర్లు...
టీచర్లకు పెట్టిన మారు పేర్లు...
లీవు కోసం తెచ్చుకున్న దొంగాజ్వరాలు
ప్రొగ్రెస్ రిపోర్టుల్లో పెట్టిన నకిలీ సంతకాలు...

వేసవిలో ఎక్కిన స్కూలు ప్రాంగణపు మామిళ్ళు...
వెన్నెల రాత్రుల్లో ఆడుకున్న కబాడీ ఆటలు...
ఆటల పోటీలకు తిరిగిన ఊళ్లు,
సాధించిన కప్పులు....

లీజరు టైములో  పాటలకి వేసిన స్టెప్పులు...
ఇంటర్వెల్లో కొనుక్కున్న పుల్ల ఐసులు....
అమ్మాయిల కంపాస్ బాక్సుల్లో నుంచి కాజేసిన బఠానీలు...
చవితి పండుగప్పుడు కొట్టుకున్న పల్లేరుకాయలు....

అబ్బాయిల నూనూగు  మీసాలు...
అమ్మాయిల రంగురంగుల వోణీల రెపరెపలు...
నోట్సుల్లో పెట్టి అందించుకున్న ప్రేమలేఖలు...

ఇంకా చెప్పలేని అల్లర్లు...
చెప్పుకోలేని అల్లర్లు....

అన్నీ ఒకదాని వెనుక ఇంకోటి ఇప్పుడు కూడా 
కంటికి కనిపిస్తున్నాయి....
ఎప్పటికీ మర్చిపోకుండా 
మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి...
మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి....



20/03/2012

'చెలి'కి మేలుకొలుపు



నిత్యం నీ ప్రేమ పలకరింపులతో
నా నుదిటిపై నీ వెచ్చని పెదవుల స్పర్శతో
నన్ను మేలుకొలుపుతావు నువ్వు.
నేడు నీకంటే ముందుగా నిద్ర లేచి,
నిన్ను నిద్ర లేపాలనుకున్నాను.

నిద్రిస్తున్న నిన్ను చూసేదాకా నాకు తెలియదుసుమా!
అలసి సొలసి నిద్రించిన అందం ఇంత అందంగా ఉంటుందని..
చెదిరిన కుంకుమ నుదిటికి కొత్త అందాన్ని తెస్తే...
పాపిట సిందూరం ముంగురులకి వింత సోయగాన్ని ఇచ్చింది.
సిగలో వాడిన మల్లెలు కొత్త కథలేవో చెప్తున్నాయి.

పగలంతా వంపు సొంపుల వయ్యారి నదిలా ప్రవహించి,
రాత్రి వేల ఉరుకుల పరుగుల జలపాతంగా మారి...
చివరికి సముద్రంలో కలిసిన నదిలా ఎంత ప్రశాంతంగా ఉన్నావ్?

'నిద్రిస్తున్న అందమైన ప్రియురాలి ఎర్రని పెదవులను ముద్దు పెట్టుకున్నాను..
ఎంత అందమైన దొంగతనం అది' అంటాడు గాలిబ్....
ఆ దొంగతనం రుచి నేడే తెలిసింది...
ఆ పెదవి మాధుర్యం ఇపుడే తెలిసింది...

ఆ దొంగతనమే నీ మేలుకొలుపుకి నాంది...
ఆ దొంగతనమే నీ మేని మేలుకొలుపుకి నాంది...





19/03/2012

మనసు పిలుపు

మనసు పిలుపు 

నిన్ను ప్రేమతో రమ్మని  పిలుస్తున్నాను  ప్రియా!
దిక్కులు పిక్కటిల్లేలా...
భువనం దద్దరిల్లేలా...
ప్రళయ కాల మేఘ గర్జనలా
నా పిలుపు దశ దిశలా వ్యాపిస్తోంది....
ప్రకృతిలోని ప్రతి కణం నా పిలుపు వింటోంది...
కొండలని తాకి లోయల్లో ప్రతిధ్వనిస్తోంది...
నదీనదాలలో కలిసి ప్రవహిస్తోంది...

కానీ చిత్రం చూడు....
నా చుట్టుపక్కల ఎవరూ స్పందించడం లేదు...
అంతా నన్ను మౌనంగా ఎందుకున్నావని  అంటున్నారు. 

నాకు తెలుసు
నా పిలుపు నిన్ను చేరిందని,
నీ మనసుని తాకి తిరిగి నా చెంతకు చేరిన..
నా పిలుపు చెప్పదుగా అబద్ధం.

మనసు పిలుపు మనసుని చేరుతుంది, 
మనసు పిలుపు మనసు మాత్రమే వినగలుగుతుంది.... 
బదులివ్వగలుగుతుంది.
మనసు పిలుపు మనసున్న మనసు మాత్రమే వినగలుగుతుంది...
బదులివ్వగలుగుతుంది.


























18/03/2012

శత శతకాల సచిన్


(100x100)

పిన్నవయసు లోనే బ్యాట్  పట్టావ్..
భీకరమైన బౌలర్లకు దీటుగా జవాబిచ్చావ్ ..
ఎన్నో బంతులను బౌండరీలకు తరలించావ్..
భారీ సిక్సర్లుగా మలిచావ్.

ప్రతీ బౌలర్ కీ  నీ బ్యాటింగ్ అంటే దుస్స్వప్నం,
ప్రత్యర్ధి జట్టుకి నువ్వంటే సింహస్వప్నం.
నువ్వు భారత జట్టుకి కొండంత అండ,
ప్రత్యర్ధి జట్లకి బెంగల కొండ.


ప్రతి జట్టు పైనా శతకం,
ప్రతి దేశంలోనూ ఎగరేసావు విజయ పతాకం.
టెస్టుల్లో, వన్డేల్లో అదే జోరు,
20 - 20 ఫార్మాట్ లోనూ అదే తీరు...

రికార్డులు నీ పాదాల్ని చుంబిస్తాయి,
అవార్డులు నిన్నే వరిస్తాయి.
సుదీర్ఘ క్రికెట్ ప్రయాణం నీకే సాధ్యం,
అసాధ్యమైన లక్ష్యసాధనలు నీకే సాధ్యం.

ప్రపంచ క్రికెట్లో నువ్వొక బలమైన శక్తి,
అందుకే నువ్వంటే ప్రజలకి అంత భక్తి.
ఏ క్రికెటరైనా కలలో మాత్రమె ఊహించగలడు శతకాల శతం...
అది నువ్వు నిజం చేసావన్నది నిజంగా  నిజం...

ఇది ఒక అరుదైన ఫీట్...
అందుకో నీ అభిమానుల సాల్యూట్.
అందుకే....
అందుకో నీ అభిమానుల సాల్యూట్.