31/01/2013

ఓ ప్రేమలేఖ..

                                               శ్రీ ||ఓ ప్రేమలేఖ...||

ఏయ్ కన్నా!
          నీ తలపుల పరిమళాలతో నిండిన నా హృదయానికి నీకు  లేఖ ఎలా రాయాలో , యేమని వ్రాయాలో తెలియక తికమక పడుతున్న నా మనోభావాలకు అందాల రూపం ఇచ్చింది నీవే.నాలో మెదిలే భావాలకు అక్షర రూపం ఇవ్వలేక అవస్థపడుతున్న నా కలంలో వలపుసిరా నింపి  నాకు అందించింది నువ్వే కదరా...
       నీ కన్నుల్లో మెదిలే కల నేనై ఉండాలనిపిస్తుంది... నీ యెద కనుమల్ని తాకే   వలపుల సంద్రపు అల నేనై అవ్వాలనిపిస్తోంది...కోటి జన్మలకైనా నీకై వేచి ఉండే అభిసారికనై , నీ మది వాకిట రంగ వల్లినై ఉండిపోవాలని , నీ హృదయ ద్వారానికి  బంగరు తోరణమై మెరిసిపోవాలని, చెరగని చెలిమికి నే సాక్షాన్నై మిగిలి పోవాలని ఆశ పడుతున్నా
           కలవై నువ్వు నన్ను కలవర పెడుతుంటే, కలత నిదురతో నా కనురెప్పలు వాలిపోతుంటే , నీ రాక కోసం కళ్ళలో కోటి ఆశలతో ఎదురుచూస్తోంది నీ బంగారు. ..నీ పేరులో ఏమైమరపు ఉందొ ఏమో...నాలో నేనే కన్నా ..అంటూ పిలుచుకున్నా  వళ్ళంతా ఎదో తుళ్ళింత...మదిలో ఎదో అలజడి... నీపేరు నెమ్మదిగా పలికేది పెదవులైతే మనసెందుకో మరి చిన్నగా సిగ్గుపడుతుంది?నా పేరు నీ నోటినుంచి  వినగానే గుండెల్లో పన్నీటి జల్లులు కురిసినట్లు..... హిమఖండం  కరిగి గల గల మనే సరిగమల శబ్దాలతో జారినట్లు... వళ్ళంతా ఒకటే పులకింతలు, మది కోవెల గంటలను సుతారముగా మ్రోగిస్తున్నట్లు ఏదో తెలియని తీయని గిలిగింత... ఇది ప్రేమేనంటావా?
   కంతుడు.. వసంతుడు... జయంతుడు నీ అందం ముందు వెలవెల బోతారని అందాల తారాదీపం నీవని ...ఇంతటి అందగాడు నావాడవుతున్నాడని  మదిలో ఎంత మురిసిపోతున్నానో నీకేం తెలుసు? పండువెన్నెల్లో , పచ్చదనాల పూతోటల్లో ఆడే అందాల వెన్నెల కన్యకనై... నీ కావ్య నాయిక నేనై ...తిలక్ అక్షరంలా కౌముది కన్యకనై నీ వొడిలో సేదదీరాలని అలసిన నానుదుట ఓ తీపిసంతకం నీ పెదవి కానుకగా ఇవ్వాలని యెంత ఆశ పడుతున్నానో తెలుసా?  మనసంతా నీ దగ్గర జారవిడిచి ప్రాణం మాత్రం ఉన్న బొమ్మను నేనై ఎదురు చూస్తున్నా. నా మనోహరా తొందరగా వచ్చేయవూ?
                మా పెరటి పూబాలలు ఆశతో ఎదురు చూస్తున్నాయి, తమ రేఖా కుసుమాల తివాచీపై నడచి వచ్చే నీ పాదాలను తనివి తీరా ముద్దాడాలని ,
నా ప్రియ నేస్తాలు ..చిలుక,కోకిల,మైనా, ఆత్రం గా వేచి ఉన్నాయి నీకు సుస్వర స్వాగతాలు పలకాలని , నీ కమ్మని , తీయని స్వరంతో జత కలిపి పాడాలని .
          నీ చిత్రం నా పక్కన చూసి  నెల రాజెందుకో ఈర్ష్య పడి చూస్తున్నాడు చూడు... ఈ మచ్చ లేని వన్నెల చిన్నెల  వెన్నెల రాజు నీకెలా సఖుడయ్యాడో అని ? నిన్ను  పక్కన చూసి పూలతోపులను  అల్లరి చేసే పిల్లగాలుల సైతం నన్ను కూడా తాకి కలవర పెడుతుంటే , ఉలికి పడి వెతుకుతుంది , నా మనసు నా నీడగా మారిన నీ  కోసం . పాలరాతిని సైతం ప్రతిబింబించే నీ ఛాయను స్పృశించాలని , నీ నవ్వుల తెల్లదనాలను తమ సొంతం చేసుకోవాలని సిరిమల్లెలు  ఎంత ఆరాట పడుతున్నాయో తెలుసా?
            నా ప్రతి తలపులో నువ్వు ..నా ప్రతి ఊహలో నువ్వు ...నీలి మబ్బులోన నీ నీడను చూసి నెమలిని నేనై నర్తిస్తున్నా ...నా  నల్లని కురులను నా ముని వేళ్ళతో చేయించే నాట్యం కోసం ఎదురు చూస్తునా...ఏయ్ కన్నా!నాకు సిగ్గేస్తోంది తెలుసా? ఇలా నేను వ్రాసినవన్నీ నువ్వు చదువుతూ అక్షరాలను గుచ్చే చూపులు భావయానం చేసి నన్ను తాకేస్తాయో ఏమిటో?...అక్కడికీ ..అల్లరిచేసే మనసుకి నీ మాటలు చెప్పి బుజ్జగించి నిద్రబుచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను.నీ మాటలు విని మరింత చెలరేగి వాటితో పాటు నన్ను కూడా జాగారం చేయించేస్తాయి.నీకోసమే నామనసుకు వయసోచ్చిందని నీకెలా చెప్పేది?...చిన్నప్పుడే శృంగార నైషదం  చదివేసానన్నావు...మరి నావిరహాన్ని  గుర్తించడంలో   ఎందుకో  ఆలస్యం చేస్తున్నావు...నీ మనసు నా మనసుతో ఏడడుగులు వేసేసినట్లే అనిపిస్తోంది...చేతికి పెట్టిన గోరింట పంట చూస్తానంటూ ఆ ఎర్రదన్నాన్ని నీ పెదవుల కెంపులతో కోసేసి...వళ్ళంతా...ఆ ఎర్రదనం పాకిన అనుభూతిని ఎలా మరచిపోగలను చెప్పు...చేతి రేఖలు చూస్తానంటూ నీ చేతిలోకి చొరవగా నా చేతిని తీసుకున్నపుడే అనుకున్నాను నీతో పాణి గ్రహణం అయిపోయిందని...
            ఒక్క క్షణం కన్ను మూసుకుంటే...అమ్మో... ఏ కొమ్మతోనైనా ముచ్చట్లాడడం లేదు కదా!..అని ఫోన్ చేస్తే కాల్ వెయిటింగ్ వస్తుంటుంది...నే కోపంలో ముక్కున ఉన్న ముక్కెర ఎగరేసే లోపే...కాల్ చేసేసి కొమ్మలేందుకు?..అనుక్షణం ప్రేమవృక్షం నీడన నీ ఊహల ఊడలలోనేగా నన్ను నీవు ఊయలలూపేది  అంటూ నా కోపాన్ని క్షణాల్లో పోగొట్టేస్తావు...ఏయ్ కన్నా!...ఐ మిస్ యు రా...నీ తీయని మాటలకు,చిలిపి సందేశాలకు పుట్టిన వంట్లోని ఆవిరులకు వెన్నెల కూడా వైద్యం చేయలేక చేతులెత్తేసింది...శ్రీ చందనం వ్రాసుకున్నా క్షణాల్లో పొడి పొడిగా రాలిపోతోంది...ఇప్పుడు నీ మాటలకి...వ్రాతలకే  ఇలా సిగ్గు పడిపోతుంటే,,,అమ్మో! రేపు నేను నీదాన్నయ్యాక నీ అల్లరి ఎలా తట్టుకుంటానో ఏమిటో?...
               నీవు నన్ను చూసి నచ్చుకొని...మెచ్చుకొని వెళ్ళిన ప్రతిక్షణం నుంచే నా మనసు నీ రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.
I LMN U (LOVE YOU...MISS YOU...AND NEED YOU...)...నామనసుని నామాట వినకుండా చేసిన నిన్ను...నీలో ఉన్న నా మనసు ఊరికే వదలదులే...నన్ను త్వరగా నా నుంచి తీసుకు  పోవూ!
నీ రాక కోసం నిలువెల్ల కనులై .....
                                                                                  నీ బంగారు...                                                      


6 comments:

 1. ఒక అమ్మాయి ...అబ్బాయికి వ్రాసినట్లు వ్రాసిన లేఖ ఇది ...ఇదివరలో ఎదో బ్లాగ్ లో ఇందు గారు వ్రాసినట్లు....చిన్న ప్రయత్నం చేసాను....@శ్రీ

  ReplyDelete
 2. సూపర్ చాల బాగుంది nice ఫీల్ ప్రతి పదం ఏంతో అందంగా ఉంది , ముత్యాలు ప్రతి అక్షరం great

  ReplyDelete
 3. శ్రీ గారు.. మీ ఈ ప్రయోగాత్మక ప్రేమ లేఖ .. పై పై న చదివే వారికి పరమబోర్.

  పదం పదం అర్ధంచేసుకుని.. మళ్ళీ వెనక్కి వెళ్లి మరోమారు చదివే వారికి ఆసాంతం అద్భుతం. మీకున్న బాషా పరిజ్ఞాన అంతా ఈ లేఖలో కనబతుంది. సూపర్బ్.

  మీ శైలికి అభినందనలు.

  ReplyDelete
 4. వచ్చే సంవత్సరం కూడా ఇదే మాడల్ పేపరాండి లేక మారుస్తారా......ఇప్పటినుండే ప్రిపేర్ అవుదామని:-)

  ReplyDelete
 5. నచ్చి మెచ్చిన అందరికీ ధన్యవాదాలు...లక్ష్మి ...
  వనజగారూ!...మీ ప్రత్యేకమైన ప్రశంసకు ధన్యవాదాలు....:-)
  థాంక్ యు ప్రిన్సు....
  భావనా!...వచ్చేసారి మరో కొత్త ప్రయోగం చేద్దాం....:-)
  @శ్రీ

  ReplyDelete