19/01/2013

మిథునం అద్భుతః

                                                                  

  
                     "అద్భుతః" సినిమా గురించి చెప్తానంటూ ఇలా అంటున్నానని ఆశ్చర్యపోతున్నారా?...సినిమా చూసాక మీ నోటినుంచి కూడా అదే మాట వస్తుంది 
                        సుమారు ఓ దశాబ్దం క్రిందట 'రచనమాస పత్రికలో శ్రీరమణ గారి కథ చదివాక అనుకున్నాను.
ఈ కథను అదృశ్యంగా మా అమ్మమ్మ,తాతయ్య గార్లను చూసి వ్రాసారేమో అని. ఈ కథని చక్కని నాటకంగా రెండు పాత్రలతో ప్రదర్శిస్తే అద్భుతంగా ఉంటుందని అనిపించింది...క్రిందటేడాది తెలిసింది భరణి గారు ఈ కథని చలన చిత్రంగా  తీస్తున్నారు అని...పాటలు రిలీజ్ అయ్యాక ఎంత జనాదరణ పొందాయో మీకు వేరే చెప్పక్కర్లేదు...
కాఫీ ప్రియులకు కాఫీ దండకం...భోజన ప్రియులకు ఆవకాయ మన అందరిదీ..ఇంకా ఆటకదరా శివా అంటూ జీవిత సత్యాన్ని చెప్పే పాట...అన్నీ నచ్చేసాయి నాకు...(చిత్రీకరణ కూడా)
                         

                        30+...40+ వారికి ఇందులో ఆకాశవాణి కార్యక్రమాలతో అప్పాదాసు పనులను లింక్ చేయడం బాగా అర్ధమౌతుంది బహుశా...చిత్రంలో సన్నివేశానికి తగినట్లుగా ఆ కార్యక్రమాల సిగ్నేచర్ ట్యూన్ (వాటిని A I R లో అలాగే అంటారు లెండి.)వినిపిస్తుంటుంది...
                        వృద్ధాప్యం మరో బాల్యం అంటూ అప్పదాసు పాత్రలో అతని అల్లరి...చపలత్వం అమాయకత్వం చూపిస్తూనే...భోజన ప్రియత్వంలో ఏ దినుసు ఎలా వాడాలో చెప్పడం ద్వారా ...అతని జిహ్వ చాపల్యాన్ని మనకి రుచిగా చెప్పారు భరణి. మీనాక్షికి సహాయం చేయటంలో ఆతని పరిపక్వత కనిపిస్తుంది...పిల్లల మీద ఉన్న ప్రేమని భార్యకి తెలియకుండా దాచుకోవడంలో గాంభీర్యం కనిపిస్తుంది...దర్శకుడు అన్ని రంగుల్లో అన్ని కోణాల్లో ఆ పాత్రని మలచడంలో సఫలమయ్యారు.
                         నువ్వు లేనప్పుడు నీ చీర కప్పుకొని పడుకుంటాను...నేను ఎ చీర కప్పుకుంటే...నువ్వు ఆ చీర కట్టుకొని ఎదురుగా కనిపిస్తావు "అంటాడు అప్పదాసు.కనిపించని శృంగారం ఎంత ఉందొ...విరహం ఎన్ని పాళ్ళుందో చెప్పగలమా అసలు?..."ఎన్ని తిట్లైనా భరిస్తావు... పొగడ్త ఒక్కటి కూడా భరించవు కదా!."..అంటాడు...ఇలాంటివి మాటలు వ్రాయడం చాలా కష్టం.
                           భార్య ఏ చీర ఆరోజు ఉదయం కట్టుకుందోమధ్యాహ్నం కూర ఏమి చేసిందోఆమె రెగ్యులర్ గా చేతికి వేసుకునే గాజులు ఎన్నో...ఇలాంటివి గుర్తుండని(గుర్తించని) భర్తలు సిగ్గుపడేలా...తన భార్య కాపురానికోచ్చిన నాటి నుంచి అప్పటి దాకా ఏ సందర్భంలో ఎ చీర కట్టిందో తడుముకోకుండా అదే ఫీల్ తొ చెప్తాడు అప్పదాసు.
                           ప్రతి ఫ్రేం లోనూ ఆమె అతన్ని ఎక్కువ ప్రేమిస్తోందేమోననే భావాన్ని పుట్టిస్తూ...అతనే ఎక్కువ ప్రేమిస్తున్నాడంటూ అతని చేతల్లో చూపించేసాడు. ఇలా చూపడం కత్తి మీద సాము వంటిదే...
                           అప్పదాసుకి తెలు కుట్టినపుడు మంత్రం వేస్తానంటూ...తర్వాత నాకే మంత్రము రాదు దేముడిని నీ బాధని నాకు ఇచ్చేయమని ప్రార్ధించాను అంటుంది బుచ్చి లక్ష్మి. ఒక్క సారి "Night of the Scorpionగుర్తొ చ్చేస్తుంది అందరికీ...
                            ముగించే ముందు మా అమ్మమ్మ తాతయ్య గార్ల గురించి చెప్పకపోతే ఈ సమీక్ష అసంపూర్ణం 
అవుతుంది. తాత గారి వయసు 10 అమ్మమ్మ వయసు సంవత్సరాల వయసు ఉన్నపుడు వారికి పెళ్లైంది.
మేనత్త మేనమామ పిల్లలు వాళ్ళు.ఒకేచోట పెరిగారు చిన్నప్పటి నుంచి.ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమకేరింగ్.
ఎప్పుడూ అంటుండేది అమ్మమ్మ."నేను ముందుగా పోతే మీకు వండి పెట్టేవాళ్ళు...చూసే వాళ్ళు ఉండరు."..అచ్చు బుచ్చిలక్ష్మిలా. ఆయన 77 ఏళ్ళ  వయసులో కాలం చేసారుసరిగ్గా వ రోజున పసుపుకుంకుమలు తీయకుండానే అమ్మమ్మ వెళ్లి పోయింది ఆయనకు స్వర్గంలో కూడా తోడు  ఉందామని. సంవత్సారాల వయసు తేడాతో అంకెతో ఉన్న బంధం బహుశా జన్మలదేమో అనుకున్నాను నేను...
                               

                                అస్తమానం ద్రాక్షారం సంబంధం అంటూ అప్పదాసుని హేళన చేసే బుచ్చి...ఆ సంబంధం  అసలు లేదని చెప్పేసరికి అందరికీ ఆనందంగా గెంతుతూ చెప్తాడు అప్పాదాసు.ఆ సంతోషంతోనో... జబ్బు పడిన భార్య ముందు చనిపోతున్దేమోననే బెంగ తోనో అప్పాదాసు కన్ను మూయడంతో చిత్రం పూర్తవుతుంది.
                                 
                              కథకి అనుగుణంగా  చేసిన మార్పులు కథ అందాన్ని ఎక్కడా తగ్గించలేదు.బుచ్చి లక్ష్మి పాత్రలో జాతీయ నటి 'లక్ష్మిపరకాయ ప్రవేశం చేసింది.అప్పదాసు పాత్రలో బాలసుబ్రహ్మణ్యం నటన కూడా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ గంటల కాలాన్ని వెచ్చించి తప్పక చూడదగ్గ సినిమా ఈ "మిథునం".
                              
                               త్రిపాత్రాభినయం చేసిన (కథ...మాటలు...దర్శకత్వం) భరణి గారు అభినందనీయులు...
కళాదర్శకుడు సంగీత దర్శకులు పూర్తిగా న్యాయం చేసారు. చిత్రం ఎలా ఉంది అని మళ్ళీ చెప్పాలంటారా?...
"అద్భుతః "
       

చివరగా చిన్నమాట : 'అప్పదాసు 'పాత్ర భరణి గారు చేసి ఉంటె ఇంకా బాగుండేది.నటుడిగా ఆయన్ను పలు చిత్రాల్లో చూసాక నా మనసులో పుట్టిన భావం ఇది..............
                                                                                                            @శ్రీ 





15 comments:

  1. మీ విశ్లేషణ చదివితే సినిమా చూసినంత బాగుంది. ఒ మంచి విషయాన్ని అంతే మంచిగా చెప్పే మీ భాషా సరళి గొప్పది శ్రీ గారూ,

    ReplyDelete
  2. మీరు చెప్పింది నిజం శ్రీ గారు.
    నిజంగా మిధునం 'అద్భుతః'
    మీ విశ్లేషణా....."అద్భుతః"

    ReplyDelete
  3. నాకూ అప్పదాసుగా భరణి చేస్తే బాగుండేది అనిపించింది . ఆ మాట ఆయనతో అంటే నవ్వి వూరుకున్నారు .

    ReplyDelete
  4. Very well written Sri gaaru. I liked the movie too. Nice post.

    ReplyDelete
  5. I appreciate the style and beauty of your Telugu language.

    ReplyDelete
  6. చాలా బాగా రాశావు,ఇంకొకసారి సినిమా చూసిన అనుభూతి కలిగింది, మంచి విలువల ఉన్న సినిమా, అభినందనలు ఇంత అందంగా సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా సినిమా కోసం రాయటం అభినందనీయం, సినిమా చూస్తున్నంత సేపు అనిపిపించింది నాకు , భార్యకు భర్త, భర్తకు భార్య ప్రెమ అభిమానం,అప్యాయత, ఒకరికోసం ఒకరు తాపత్రయ పడే విధానం అద్బుతం, ఆ వయస్సులొ ఒకరికోసం ఒకరు అన్నట్టుగా తోదు నీడగా ఉంటారు పెద్దవయస్సులో భార్య భర్తల మద్య ప్రేమ ఎంతో పెరుగుతుంది అంటారు, నిజం కూడా అదే, ఆ వయస్సులో వాళ్ల్ళ్హ్కకి అంత ఓపిక ఉండటం కూడా భగవంతుడు ఇచ్చిన వరం, భ్హార్యకు జ్వరం వస్తే భర్త పడే ఆవేదన వర్ణనాతీతం, మెత్తం మీద సినిమా అంతా వాస్తవ జీవితానికి ప్రతిబింబం అని చెఫ్ఫవచ్చు,

    ReplyDelete
  7. చక్కని కథ ని మంచి ఆర్టిస్ట్ లు కూడి మరింత చక్కగా తెరకెక్కించటం అంటే మాటలు కాదు. పుస్తకం లో ఉన్న ఫీల్ ని తెరపై తెచ్చి చూపటం చాలా కష్టం. మీ విశ్లేషణ చక్కగా ఉంది. మీ అమ్మమ్మ తాతయ్యలని తెరపై చూశారనమాట అయితే. ఎందరో అమ్మమ్మ తాతయ్యల్ని సజీవం గా మనముందుకి తెచ్చిన శ్రీ రమణ గారు, ఈ సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు.
    ఇంకా చూసే భాగ్యం కలగకున్నా మీ సమీక్ష కొంత అప్పుడే చూపెట్టేసింది.
    మీకూ అభినందనలు శ్రీ గారూ!

    ReplyDelete
  8. ధన్యవాదాలు మేరాజ్, భారతి , మాలాకుమార్,భూమ రెడ్డి, లక్ష్మి శర్మ, చిన్ని ఆశ, వెన్నెల గార్లకు...
    ఈ పోస్ట్ ఆ సినిమాను వీలైనంత మంది చూడాలనే ఉద్దేశ్యంతోనే మొదటి సారి ఓ సినిమాకి సమీక్ష వ్రాసే సాహసం చేసాను...
    మాలా కుమార్ గారూ! భరణి గారే మొదట చేయాలనుకున్నారట.అలాగని ఎవరో అన్నారు తర్వాత మార్చుకున్నరేమో ఆయన అభిప్రాయం...
    శ్రీ రమణ, భరణి గార్లకు నమస్సులతో....@శ్రీ

    ReplyDelete
  9. ఏదైనా కథ చదివాకా ఆ కథతో వచ్చిన సినిమా చూస్తె అసంతృప్తిగా అనిపిస్తుంది. నాకు అమితంగా నచ్చిన కథ మిధునం. అందువల్ల ఆ సినిమా చూస్తే ఆ భావం పోతుందేమో అనిపించేది. కాని మీ సమీక్ష చదివాక ఆ సినిమా చూడాలనిపిస్తోంది.

    ReplyDelete
  10. నిజమే శ్రీ గారూ...
    "ప్రతి ఒక్కరూ 2 గంటల కాలాన్ని వెచ్చించి తప్పక చూడదగ్గ సినిమా ఈ "మిథునం".
    మీ సమీక్ష బాగుంది.. నాకు కూడా సినిమా చాలా నచ్చింది..

    ReplyDelete

  11. మీరూ అనేసారు అద్భుతః అని!కాదా మరి భరణి గారి మార్కాయే ! శ్రీకారం శ్రీరమణ గారిదాయే మరి!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  12. నేనింకా చూడలేదండి.....అందరూ అనుకుంటుండగా కొంత, మీ పోస్ట్ ద్వారా మరికొంత చిత్రాన్ని చూసాను.

    ReplyDelete
  13. అద్బుత: సినిమా చూసినడానికంటే మీరు వ్రాసిన విధానం ఇంకా అద్బుత

    ReplyDelete
  14. అప్పదాసుగా భరణిగారు చేస్తే బాగుండేది నాక్కూడా అనిపించింది శ్రీ గారు... మొత్తంమీదా మీ రివ్యూ చాలా బాగుంది.. సినిమాని మళ్లీ ఇంకోసారి చూడాలనిపించేలా ఉంది...

    ReplyDelete