08/10/2013

|| మా గోదారి (1) ||

గోదావరి మీద కవితలు, ఏక వాక్య కవితలు ,మినీ కవితలు ఎన్నో ఎన్నెన్నో వచ్చాయి ఇప్పటికి.
అయినా గోదావరి లోని ప్రతి నీటి బొట్టుకి కవనం వ్రాయించగల శక్తి ఉంది. నాదైన కోణంలో కొన్ని కవితలు ఆ
జీవనదిపై వ్రాయాలని సంకల్పిస్తూ ... తల్లి గోదారికి ప్రణమిల్లుతూ .../\...@శ్రీ 








త్రయంబకేశ్వరుని జటాజూటంలోని గంగకు పోటీ వస్తూ
పార్వతీదేవి పాదాల పారాణి కడిగిన నీరులా
తొలిసంధ్య చల్లిన సిగ్గుపూలకళ్లాపికి ఎరుపెక్కినట్లుగా
అరుణుడి చురుకు చూపులకి వళ్ళంతా కందిపోయినట్లుగా
ప్రత్యూషంలోని సప్తాశ్వాల గిట్టలధూళి రాలి రంగిల్లినట్లుగా
ఎర్రబడిన తొలిపొద్దు అందాన్ని చూపే అద్దంలా
సూరీడు పంపిన కాంతులపేర్లు వేసుకొని
ఎంతో అందంగా కనిపిస్తోంది మా గోదారి.

కదిలే చేపలతో మిలమిలలాడుతూ
మత్స్యకారుల వలల చిక్కక తప్పించుకొని తోవచేసుకుంటూ
తెల్లని తెరచాపల అందాలను తిలకిస్తూ
నావికుల గీతాలకు మైమరుస్తూ
ఆ హైలెస్సలకు కదం తొక్కుతూ
వారి తాపాన్ని చల్లార్చేందుకు చల్లని తుంపర్లను చల్లుతూ
వడివడిగా కదిలిపోతుంది మా గోదారి.

సాయంసంధ్యను ప్రతిఫలిస్తూ
ఒడ్డునున్న జంటల గుసగుసలను ఓ చెవితో ఆలకిస్తూ
తీరాన్నున్న రెల్లుకొసల చక్కిలిగింతలకు మెలికలు తిరుగుతూ
అస్తాద్రి గుండెల్లో ఒదిగిపోయే సూరీడుకి వీడ్కోలు చెప్తూ
తొంగిచూసే మామను స్వాగతిస్తూ
సాగిపోతుంది మా గోదారి.

కొబ్బరాకుల వీవనలకు సేదదీరుతూ
నిశాకాంతులన్నిటినీ తానే తాగేయాలనే తపనతో
చంద్రుడినీ తారలను పట్టేసి తనలో దాచేస్తూ
నౌకావిహారాలు చేసే పడుచుజంటల చిలిపిచేష్టలకి చిన్నగా నవ్వుకుంటూ
తాను రేయంతా సాగరునితో చేసే అల్లరిని తలుచుకుంటూ
బిడియంగా కదిలిపోతుంది మా గోదారి. ...@శ్రీ 08/10/13.

10 comments:

  1. కొబ్బరాకుల వీవనలకు సేదదీరుతూ
    నిశాకాంతులన్నిటినీ తానే తాగేయాలనే తపనతో
    చంద్రుడినీ తారలను పట్టేసి తనలో దాచేస్తూ
    నౌకావిహారాలు చేసే పడుచుజంటల చిలిపిచేష్టలకి చిన్నగా నవ్వుకుంటూ
    తాను రేయంతా సాగరునితో చేసే అల్లరిని తలుచుకుంటూ
    బిడియంగా కదిలిపోతుంది మా గోదారి

    గోదారి మాతపై గల భక్తిభావం మీ కవితలో కనపడ్తుంది
    చాలా బాగుంది శ్రీగారూ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు స్వర్ణా ...చక్కని ప్రశంసకి ..@శ్రీ

      Delete
  2. గోదావరి కవిత ఆ గోదావరి అంత అందంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యువాదాలు వర్మ గారు మీ ఆత్మీయ ప్రశంసకి ...@శ్రీ ...:-)

      Delete
  3. అసలు గోదావరి గురించి రాయాలన్న ఆలోచనని అమలు చేయగలిగారు చూశారూ... దానికీ మీకు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫణి గారు ... మీ అభినందనలకి అభివాదాలు...@శ్రీ .../\....

      Delete
  4. గోదావరి ఇంకా దాటలేదు కాబోలు కవి గారు :-)
    మీ తదుపరి కవిత కోసం ఎదురుచూస్తూ.

    ReplyDelete
    Replies
    1. దాటేసాను మెరాజ్ గారు ...కృష్ణమ్మ దగ్గర ఉన్నాను ...చూడండి ఈరోజు :-)
      ధన్యవాదాలు మీ పలకరింపుకి ...:-)

      Delete
    2. గోదావరి కన్య అత్మావిష్కారం అందంగా చేసిన మీకు అభినందనలు

      Delete
    3. గోదావరి కన్య అత్మావిష్కారం అందంగా చేసిన మీకు అభినందనలు

      Delete