27/09/2013

|| వృద్ధాప్యం ||






కళ్ళ చివర మొదలై 
బుగ్గలమీదికి పాకుతూ 
మెడమీద విశ్రమిస్తూ మెలమెల్లగా 
ముందుకి కదులుతూ
మన ప్రమేయం లేకుండానే
ఒళ్లంతా ఆక్రమిస్తాయి ముడుతలు.

నుదిటిపై స్పష్టమౌతుంటాయి 
అనుభవాలు గీసిన వక్రరేఖలు 
శైవుల త్రిపుండ్రాలని తలపిస్తూ.
వెండితీగలుగా మారిపోతూ ఉంటాయి 
సంపెంగనూనెల మెరిసిన నల్లని కేశాలు.

బ్రతికే రోజులు తగ్గుతున్నా 
తనకేం పట్టనట్టు 
దినదినప్రవర్ధమానమౌతూ ఉంటుంది 
కళ్ళజోడు నెంబరు.
తగ్గిన ఎముక బరువును కూడా మోయలేక
వంగిపోతూ ఉంటుంది  నడుము.

కళ్ళల్లో కరిగిన స్వప్నాల్లా 
కండలు...వేలాడే చర్మంలో
కలిసిపోతూ ఉంటాయి.
కాలం చెల్లిందంటూ చివుళ్ళ నుంచి 
రాలిపడుతూ ఉంటుంది ఒకో పన్ను.
యవ్వనపు చిందులు చూసి 
మనసు గెంతులేసినా...
శరీరం మాత్రం అలిసిపోతూ ఉంటుంది.

వద్దనుకున్నా...వృద్ధాప్యం 
ధృతరాష్ట్రుని ఉక్కుకౌగిలిలా
ఊపిరి ఆడనివ్వకుండా నలిపేస్తూ    
శరీరాన్ని తన వశంచేసుకుంటుంది 
నెమ్మదిగా అణువణువునూ
నిర్దాక్షిణ్యంగా కబళించేస్తుంది.
బ్రతికుండగనే నరకమేమిటో చూపిస్తుంది.
మృత్యువుకి దగ్గరగా తీసుకుపోతుంది...            @శ్రీ 27/09/2013

2 comments:

  1. పుట్టి పెరిగిన ప్రతిది యీ భూమి మీద
    ముదిమి పైకొని చచ్చును - పుడమి గాక
    చావు లుండని లోక మెంచక్క వెదికి
    పట్టు కొన బోలు ముదిమికి పట్టు బడక .

    ReplyDelete
  2. ధన్యవాదాలు రాజారావు గారు ....
    చక్కని పద్యంతో తాత్విక భావాన్ని చెప్పినందుకు...@శ్రీ

    ReplyDelete