13/09/2016

12 గంటల రికార్డు భక్తి సదస్సు


తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వారు ప్రాజెక్ట్
మరియు శ్రీ పద్మావతీ మహిళా కళాశాల వారు సంయుక్తంగా నిర్వహించిన
12 గంటల రికార్డు భక్తిసదస్సుకి ఒక పర్యవేకునిగా వెళ్ళడం నా అదృష్టం.
ఈ కార్యక్రమాన్ని  వండర్ బుక్ అఫ్ రికార్డ్ , మరియు తెలుగు బుక్ అఫ్ రికార్డులలో నమోదు చేసారు.
ఆ కార్యక్రమంలో నా ప్రసంగం ఇలా  :

 శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | 
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ...
ఆదికావ్యనాయకుడైన శ్రీరామచంద్రమూర్తికి వందనాలు అర్పిస్తున్నాను.

ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగంకాంచనం
వైదేహీ హరణం  జతాయుమరణం  సుగ్రీవ సంభాషణం
వాలీ నిగ్రహం  సముద్ర తరణం లంకాపురీ దహనం
పశ్చాద్రావణ కుంభకర్ణ హననం యే తద్దిరామాయణం

ఒకే శ్లోకంలో రామాయణాన్ని చెప్పినప్పటికీ గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వేయి లెక్కతో  24000 శ్లోకాలతో 537 సర్గలతో ( ఉత్తరరామాయణం ప్రక్షిప్తమని అంటారు పరిశీలకులు )   వాల్మీకి మహర్షి రచించిన రామాయణం గురించి ఎంత వ్యాఖ్యానించినా సమయం సరిపోదు.

పురాణాలు వేదాలలో చెప్పిన యుగాలు అన్నీ పక్కనబెడితే  చరిత్రకారులు పరిశోధకులు వేసిన లెక్కల్ని పరిగణనలోనికి తీసుకుంటే రామాయాణంలో చెప్పబడిన కథంతా  క్రీస్తు పూర్వం 11000 నుండి 7000 ఏళ్ల క్రితం  జరిగినట్లుగా భావించవచ్చును.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాలలో  వేర్వేరు భాషలలో
వేర్వేరు విధాలుగా సుమారు 11000 కి పైగా రామాయణం వ్రాయబడింది. ఒకే విషయంమీద
ఇన్ని గ్రంథాలు బహుశా ఇప్పటిదాకా వచ్చి ఉండవేమో. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే
ఒక్కొక్క కవిదీ ఒక్కొక్క కల్పన, ఒక్కొక్క శైలి , ఒక్కొక్క వర్ణన . ప్రతీ కవికీ వేర్వేరు పాత్రలు నచ్చాయి. ఆ పాత్రలను ఉన్నతంగా వారి రచనల్లో చూపించారు . ఈ కావ్యంలోని పాత్రలకు
వారివారి ప్రవృత్తికి తగినట్లుగా పేర్లు పెట్టడం మామూలు విషయం కాదు. శ్రీరాముని నరావతారంగా చూపించినందువలన ఇందులోని  పాత్రలలో  సద్గుణాలనూ దుర్గుణాలనూ అన్నింటినీ వేర్వేరు పాళ్ళలో నింపారు వాల్మీకి మహాముని.

     శ్రీరామచంద్ర మూర్తిలాంటి నాయకుడు దొరికాడని అయోధ్యలోని ప్రజలూ అలాగే కోట్లాది వానరులు అనుకున్నప్పటికీ నేను నా కోణంలో చూస్తూ కాస్త భిన్నంగా అనుకుంటాను.

సకల విద్యాపారంగతుడు , దివ్యాస్త్రబలసంపన్నుడు , తపోనిధి , బ్రహ్మఋషి అయిన విశ్వామిత్రుడు లభించడం శ్రీరాముని అదృష్టం. 

           సాధారణంగా  బిడ్డలను విడిచిపెట్టి తల్లి ఉండలేదు. కానీ తనను అడవులకు వెళ్ళమని  చెప్పలేక శోకించి , ఆతనిపై బెంగతో రామా రామా అంటూనే ప్రాణాలు విడిచిన ప్రేమమూర్తి దశరథుడు తండ్రిగా లభించడం రాముని భాగ్యం.

               నడిచే దారిలో రాళ్ళు ఉంటాయో , ముళ్లుంటాయో అని కూడా ఆలోచించకుండా
సకల భోగభాగ్యాలతో పెరిగిన ఎండకన్నెరుగని రాకుమారి తన భర్త వెంట  అడవులకు వెళ్ళిపోయింది . ఎన్నో కష్టాలను ఓర్చుకొని ,లోకానికి తాను పవిత్రనని నిరూపించేందుకు
అగ్నిప్రవేశం చేసిన సీతవంటి సాధ్వీమణి భార్యగా లభించడం శ్రీరాముని భాగ్యం.

      ఒకే తల్లికి పుట్టకపోయినా అనుక్షణం నీడలా వెన్నంటి ఉండి తన ప్రాణాలను పణంగా పెట్టి
ఇంద్రుని జయించిన ఇంద్రజిత్^కి ఎదురునిలిచి పోరాడిన సౌమిత్రి , వనవాసం చేసినన్ని రోజులూ అన్నగారి పాదుకలనే రాజుగా భావిస్తూ పరిపాలన సాగించిన భరతుడు...ఇలాంటి సోదరులు  దొరకడం ,  నిజంగా శ్రీరాముని భాగ్యమే. 
                తనకు ఉన్న శత్రువు అన్న వాలిని సంహరించిన సాయానికి కోట్ల సంఖ్యలో ఉన్న
తన సేనను అంతటినీ శ్రీరాముని సేవకి సమర్పించిన మిత్రుడు సుగ్రీవుడు లభించడం నిజంగా శ్రీరామునికి వరమే కదా.
         కేవలం ఐదు రోజుల్లో నూరు యోజనాల సముద్రంపై వారధిని నిర్మించిన అపర విశ్వకర్మ నలుడు శ్రీరామునికి చేసిన సాయాన్ని తక్కువ చేయలేము.

               ఇక ఆఖర్న చెప్పడానికి ఒక్కరు ఉన్నారు. ఆయన ఎవరై ఉంటారనే సందేహం ఎవ్వరికీ రాదు ... రాకూడదు కూడా. వజ్రదేహుడు , బుద్ధిశాలి , అపరిమితమైన పరాక్రమ సంపన్నుడు , ఇంకా చెప్పాలంటే రామాయణానికి రెండో నాయకుడు అయిన హనుమంతుడు.
ఇక్కడ రెండో నాయకుడు అనడానికి కారణాలు చెప్పడం మొదలుపెడితే మరో చిన్న రామాయణం అయిపోతుంది బహుశా. సుందరకాండ మొత్తానికి నాయకుడు సుందరుడైన హనుమంతుడే కదా. ( ఇక్కడ మనోసౌందర్యం తీసుకోవాలి దేహ సౌందర్యం కాదు ) .
800 మైళ్ళ సాగరాన్ని లంఘించడం మొదలుకొని లంకలో వేలాది రాక్షసులను వధించి
లంకాదహనం చేసి ,(రావణునికి వానరమూకల బలాన్ని పరిచయించే ప్రయత్నం.)సీతాదేవికి ధైర్యవచనాలు చెప్పడం. యుద్ధసమయంలో సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి లక్షలాది ప్రాణాలను కాపాడడం ఇవన్నీ చూస్తుంటే హనుమంతుడే రామాయణం ... రామాయణమే హనుమంతుడు అనిపించడంలో ఆశ్చర్యం లేదు .
        ఒక సన్నివేశాన్ని వివరిస్తే ఆయన బలం ఏమిటన్నది అందరికీ  ఇంకా బాగా అర్ధమౌతుంది.  ఇంద్రజిత్తు పరాక్రమానికి వానరులంతా క్షతగాత్రులై పడి ఉన్నప్పుడు
నాగపాశాలతో రామలక్ష్మణులు బందీలైపోయినప్పుడు జాంబవంతుడు శ్రీరాముడిని
అడుగుతాడు హనుమ ఎక్కడ ఉన్నాడు అని . శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు .ఎవ్వరినీ అడగకుండా  హనుమంతుడి గురించి ఎందుకు అడుగుతున్నావు అని తిరిగి ప్రశ్న వేస్తాడు.
ఎవ్వరూ లేకున్నా హనుమ ఉంటే చాలు లంకనే కాదు ముల్లోకాలనూ జయించవచ్చును అని.
 
                        అలాంటి హనుమంతుడు సేవకునిగా లభించడం శ్రీరామచంద్రమూర్తి భాగ్యమని అందరూ ఒప్పుకొని తీరాల్సిందే.

 దేవ దేవం భజే  దివ్య ప్రభావం 
రావణాసుర వైరి  రఘు పుంగవం రామం 
దేవ దేవం  భజే దివ్య ప్రభావం 
రాజవర శేఖరం  రవికుల సుధాకరం 
ఆజానుబాహుం  నీలాద్రికాయం 
రాజారి కోదండ  రాజ దీక్షా గురుం 
రాజీవలోచనం  రామచంద్రం  రామం 
దేవదేవం భజే దివ్య ప్రభావం ..... 


ఇక్కడ రావణాసుర వైరిని గురించి మాట్లాడతాను. అన్ని లోకాలనూ
లోక పాలకులనూ అష్టదిక్పాలకులనూ గడగడలాడించిన మహా పరాక్రమశాలి రావణాసురుడులాంటి వైరి లభించడం నిజంగా రాముని
భాగ్యమే.
           ఉపమా కాళిదాసస్య అని మహాకవి కాళిదాసుని అంటారు.
అలాంటి మహాకవి సాగరానికీ , ఆకాశానికీ , రామరావణ యుద్ధానికీ
ఉపమానాలు లేవన్నాడు. వాటికి అవే ఉపమానాలు అన్నాడాయన. అంతటి మహాసంగ్రామంలో గెలిచినందుకే శ్రీరాముడు ఆచంద్రార్కం కీర్తించబడుతూనే ఉంటాడు.

దీనిని మాయలు మంత్రాలు ఏమీ లేవనుకొని ఒక పెద్ద నవల అనుకొని చదవండి. దీనిలోని పాత్రలను పరిశీలిస్తే నాకు ఒక అద్భుతమైన విషయం
కనబడింది. ఇందులో ఏ పాత్రా కూడా ద్వంద్వ ప్రవృత్తిని కలిగి ఉండలేదు.
ఒకచోట ఒకలా మాట్లాడడం వేరే చోట వేరేలా మాట్లాడడంలాంటి సన్నివేశం ఎక్కడా కనబడదు. దుష్టులైతే దుష్టులుగానే కనబడతారు .సజ్జనులైతే సజ్జనులుగానే కనబడతారు. దుష్టులంటే ఇక్కడ ఒక విషయం ఉటంకించి తీరాలి .
హనుమంతుడు రావణుని అంతఃపురంలో  రావణుని చూసినప్పుడు దూరంగా ఉండే చూస్తాడు. దానికి ఒక కారణం ఉంది
నీతిశాస్త్ర పారంగతుడైన హనుమకి
శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినమ్
గజం సహస్ర హస్తేషు దుష్టం దూరేన వర్జయేత్ అని తెలుసు .
( శకటానికి ఐదు మూరలదూరంలోనూ , రథానికి పదిమూరల దూరంలోనూ
  ఏనుగుకి  వేయి మూరలదూరంలోనూ , దుష్టునికి వీలైనంత దూరంలోనూ ఉండాలన్నమాట)

        రామాయణ కావ్యాన్ని ఎవరు రాసినదేనా చదవండి. వాటిలోని కల్పనలను అన్నిటినీ చదవండి . కానీ వాల్మీకి మహర్షి రచించిన శ్లోకాలు
తాత్పర్యాలతో ఉన్న మూలం ఏదైతే ఉన్నదో దానిని చదివితేనే మీకు
మనం సీరియల్స్^లోనూ సినిమాలలోనూ చూస్తున్న గాథలు ఏవైతే ఉన్నాయో వాటిలో మూలంలో ఉన్నవి ఏవో , మూలంలో లేనివి ఏవో మీకు సులువుగా తెలిసిపోతుంది.  

      { మూలం ఏదైతే ఉన్నదో అవి తెలుగులో శ్లోకం అర్ధంతో గీతాప్రెస్ వారు మూడు భాగాలలో విడుదల చేసారు .
గీతాప్రెస్ గోరక్ పూర్ వాళ్ళ షాప్ ( no 41 , 4-4-1 , dilshada plaza )
సుల్తాన్ బజార్ , హైదరాబాద్ లోనూ
సికిందరాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం -1 లోనూ దొరుకుతాయి .
అన్ని వాల్యూమ్స్ కలిపి 500 నుంచి 600 రూపాయలలో దొరికేస్తాయి.
ఇద్దరు మల్టీప్లెక్స్^లో సినిమా చూసి పాప్కార్న్ తిన్నంత ఖర్చు అన్నమాట }

       యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం,
        బాష్పవారిపరిపూర్ణ లోచనం, మారుతిం నమతః రాక్షసాంతకం. _/\_ @శ్రీ 

                  


1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete