18/09/2016

|| కావాలా - తెలుగు గజల్ ||
|| కావాలా - తెలుగు గజల్  || 

హృదయవీణ నాదాలకు రసరాగం కావాలా 
మనసులోని గీతాలకు అనునాదం కావాలా

మధుమాసం రాగానే పూలమీద వాలతాయి 
భృంగకాల బృందాలకు ఆహ్వానం కావాలా

చెలి నవ్వుల బాణాలకు పదునెంతో చెప్పలేను 
తిమిరాలను నరికేందుకు కరవాలం కావాలా

వివాహాన్ని నిలిపేందుకు ప్రేమసూత్రమే చాలును 
బంగారంతో చేసిన శతమానం కావాలా

జగతిలోని అందరికీ పంచుతూనె ఉంటాను 
నా ప్రేమను తూచేందుకు కొలమానం కావాలా

ప్రేయసి తనువున వన్నెలతో పోటీ పడలేదు 
వర్ణాలను చూపేందుకు హరిచాపం కావాలా

 కనులుకనులు కలుసుకున్న కాలంలో "నెలరాజా"
 ఇరువురి మధ్యన వేరే సంవాదం కావాలా

No comments:

Post a Comment