22/09/2016

|| తెలియలేదు - తెలుగు గజల్ ||
|| తెలియలేదు - తెలుగు గజల్  ||

కనులలోన మాయలెన్నొ ఉంటాయని తెలియలేదు 
చూపులతో  మంత్రమేదొ వేస్తావని తెలియలేదు 

తెలతెల్లని మల్లెలకై తీవెలెన్నొ తడిమాను 
నీ నవ్వుల తోటలలో(తోటలోన) పూస్తాయని తెలియలేదు 

పూలలోన మధువుందని నేటివరకు భ్రమించాను 
అధరాలను చిలుకుతుంటె పుడతాయని తెలియలేదు 

రెప్పలపై తీపివాన పడుతుంటే కొత్తగుంది
తేనెలున్న కలలమబ్బు కురిసిందని తెలియలేదు 

తపిస్తున్న గుండెలలో చల్లదనం చేరినది 
విరహాగ్నిని ప్రేమజల్లు తడిపిందని తెలియలేదు

జన్మలుగా మనం కలిసి ఉండడమొక చిత్రమే 
కాలమనే హంసకూడ(రాజహంస) ఓడిందని తెలియలేదు 

వెన్నెలతో పోటీపడు వెలుగేదో "నెలరాజా"
నను అల్లిన మేనిలోన విరిసిందని తెలియలేదు 

( నెలవంక నెమలీక మాసపత్రికలో  ప్రచురించబడిన గజల్ ) No comments:

Post a Comment