27/09/2016

|| ఉన్నదోయి - తెలుగు గజల్ ||


పాదాలకు పట్టుదలను పూయాలని ఉన్నదోయి
గమ్యాలకు వందనాన్ని నేర్పాలని ఉన్నదోయి

ద్వేషంతో రగులుతున్న వారిని గాలించాలి 
వలపుచువ్వతో వాతలు పెట్టాలని ఉన్నదోయి

ముడిరవ్వలతో సమమే భాషలోని అక్షరాలు 
సద్భావముతోటి సానపెట్టాలని ఉన్నదోయి

మమతకన్న త్వరితంగా మదిలోపల పెరుగుతుంది 
అహంకారమనే కలుపునేరాలని ఉన్నదోయి

ప్రబలుతున్న హింసచూసి కన్ను చెమ్మగిల్లుతోంది
విశ్వశాంతి నెలకొంటే చూడాలని ఉన్నదోయి

మూఢభక్తులందరికీ కొత్తదారి చూపాలి
మానవతకు ఒక కోవెల కట్టాలని ఉన్నదోయి

ప్రేమశరములన్నిటినీ సంధిస్తూ "నెలరాజా" 
పగలకు గాయాలెన్నో చేయాలని ఉన్నదోయి
No comments:

Post a Comment