03/10/2016

|| వింత కాదు - తెలుగు గజల్ ||

నేలదిగిన చంద్రసుతను చూసినాను వింతకాదు 
వెన్నెలలో నిలువెల్లా మునిగినాను వింతకాదు 

నేలస్పర్శ తెలియని సుకుమారపు పాదాలు తనవి 
బాటపైన వసంతాన్ని జల్లినాను వింతకాదు 

సౌందర్యపు వాహినిలా నా కనులకు కనబడింది 
చూపులన్ని నౌకలుగా చేసినాను  వింతకాదు 

రెప్పలపై చుంబిస్తూ నేనే తన ప్రాణమంది
కలగన్నానేమోనని తలచినాను వింతకాదు 

తలంబ్రాల వేడుకలో తన తలపై జార్చాలి 
నక్షత్రాలెన్నిటినో  తెచ్చినాను వింతకాదు

చందమామ కబురంపెను తనయను చేపట్టమని
పున్నమినే కట్నంగా కోరినాను వింతకాదు

ప్రేమరాణి త్వరలోనే వస్తుందని నెలరాజా
మనసంతా పుప్పొడితో అలికినాను వింతకాదు


 

No comments:

Post a Comment