03/11/2016

|| వారెవ్వరు - తెలుగు గజల్ |||| వారెవ్వరు - తెలుగు గజల్ || 

తొలకరిలో చినుకుపూలు జల్లుతున్న వారెవ్వరు 
హరివింటిని రంగులలో వంచుతున్న వారెవ్వరు

చీకటిలో మగ్గుతున్న తిథులు వెలిగిపోతున్నవి 
ఈ జగతిని వెన్నెలలో ముంచుతున్న వారెవ్వరు

పాకుతున్న పురుగొక్కటి రెక్కలొచ్చి ఎగురుతోంది 
సీతకోక చిలుకలాగా మార్చుతున్న వారెవ్వరు 

పడిలేచే తత్వానికి గురువులాగ అనిపించును 
కెరటానికి పట్టుదలను నేర్పుతున్న వారెవ్వరు

కిరణాలే కుంచెలైతె బిందువులే రంగులగును
సప్తవర్ణ చిత్రాలను  గీయుచున్న వారెవ్వరు

నిశలనాక్రమించేందుకు గుంపులుగా ఎగురుతాయి  
కాంతుల దివిటీలెన్నో మోయుచున్న వారెవ్వరు 

తారలకళ్ళకు గంతలు కట్టివేసి  "నెలరాజా" 
కలువలతో సరసాలను ఆడుతున్న వారెవ్వరు

No comments:

Post a Comment