18/12/2016

|| నీలోనే ఉన్నవిలే – తెలుగు గజల్ ||


వెన్నెలలో వెలుగులన్ని నీలోనే ఉన్నవిలే
తారలలో తళుకులన్ని నీలోనే ఉన్నవిలే

కనులలోని చీకట్లకు చుక్కలు చూపిస్తావు
పున్నమిలో కాంతులన్ని నీలోనే ఉన్నవిలే

ప్రేమమబ్బుపైన చరిచి చినుకులు కురిపిస్తావు
తొలకరిలో మెరుపులన్ని నీలోనే ఉన్నవిలే

స్ఫటికమంటి తనువులోన ఏ కిరణం వంగినదో
ఇంద్రధనువు విరుపులన్ని నీలోనే ఉన్నవిలే

చూపులన్ని మధుపాలై ప్రదక్షిణలు చేస్తున్నవి 
మధువనాల సొబగులన్ని నీలోనే ఉన్నవిలే

ప్రాణాలను ఐదింటిని వేటలాడుతుంటావు
కందర్పుని శరములన్ని నీలోనే ఉన్నవిలే

నింగిలోన చందమామ ఒకటేలే నెలరాజా
చౌదసీల చాందులన్ని నీలోనే ఉన్నవిలే
(ప్రతీ ఏటా వచ్చే 12 శుక్లపక్షాల చందమామలన్నమాట )

No comments:

Post a Comment