17/12/2016

|| వింతకదా - తెలుగు గజల్ ||
కన్నీటిని చిందించని కనులుంటే వింతకదా
బాధనెపుడు చవిచూడని మనసుంటే వింతకదా.

మోదాన్నీ ఖేదాన్నీ పరిచయిస్తు ఉంటుంది   
విరహాలను పంచనట్టి వలపుంటే వింతకదా

చివరి ఋతువు కాళ్ళకింద ఆకులన్నిచిట్లుతాయి  
పంతముతో చివురించని వనముంటే వింతకదా

వెలుగుతున్నసూరీడే వేకువలో జనిస్తాడు 
తూర్పుదిక్కులో చీకటి నిలుచుంటే వింతకదా

పుడుతూనే పరుగులతో కడలిదరికి ఉరుకుతాయి  
సంగమాన్ని కోరుకోని నదులుంటే వింతకదా 

పాతాళంలోకి కూడ వేర్లు పెంచి ఉంటుంది 
అవినీతిని పెళ్లగించు పలుగుంటే వింతకదా 

ఎండమావిలో తీయని జలములాగ "నెలరాజా" 
మూర్ఖునికడ పాండిత్యపు నిధులుంటే వింతకదా   #శ్రీ 

2 comments:

  1. మంచుకురియు వేళలందు మదిపొంగుట హాయికదా
    గగనమంత వింతవెలుగు విరియకుంటె వింతకదా
    nice beta

    ReplyDelete
  2. ధన్యవాదాలు అమ్మా :) _/\_

    ReplyDelete