06/07/2013

అమరం




ఏనాడైనా ఒక్క సెల్యూట్ కొట్టావా?
దేశానికై ప్రాణమర్పించిన యోధునికి. 

ఏనాడైనా ఒక్క గులాబీని ఉంచావా?
వీరమరణం పొందిన సైనికుడి సమాధిపై. 

ఏనాడైనా భుజం పట్టావా?
సమర యోధుని పార్ధివ శరీరానికి 

ఏనాడైనా ఆప్యాయంగా కౌగిలించుకున్నావా?
దేశం కోసం పోరాడిన యోధుడు నేలకొరిగిన చోటుని.

ఏనాడైనా మోకరిల్లావా?
అమరవీరుల స్మృతిచిహ్నం ముందు.

ఏనాడైనా ప్రేమగా స్పృశించావా?
యుద్దవీరుని కృత్రిమపాదాన్ని

ఏనాడైనా మందు పూసావా?
క్షతగాత్రుడైన దేశ సైనికుని శరీరానికి.

ఏనాడైనా వీరతిలకం దిద్దావా?
యుద్ధానికెళ్ళే వీరుని నుదిటిపై.

ఏనాడైనా శిరస్సున అద్దుకున్నావా?
విజయపతాకంతో తిరిగొచ్చిన సైనికుని పాదధూళిని.

ఏనాడైనా ప్రత్యక్షంగా చూసావా?
అమరసైనికునికిచ్చే గౌరవ వందనం.

ఏనాడైనా ఒక్కరూక విరాళమిచ్చావా?
కంటికి రెప్పలా కాపాడే సైనికుల సంక్షేమనిధికి.

ఏనాడైనా కన్ను చెమ్మగిల్లిందా?
శత్రు తుపాకుల తూటాలకి
ఛిద్రమైన యోధుల శరీరాలను చూసి.

ఏనాడైనా సంకల్పించావా?
నీ ఇంట్లో ఒక్కరినైనా దేశరక్షణకై పంపాలని.

ఏనాడైనా అనుకున్నావా?
శత్రు శతఘ్నికి ఎదురునిలవాలని.
దేశరక్షణకై ప్రాణమర్పించాలని.               @శ్రీ 


11 comments:

  1. ఏనాడైనా సంకల్పించావా?
    నీ ఇంట్లో ఒక్కరినైనా దేశరక్షణకై పంపాలని..... ఎంత బాగా చెప్పారు శ్రీ జీ హాట్సాఫ్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్వేతా వాసుకి గారు...మీ ప్రశంసకి ...@శ్రీ

      Delete
  2. @శ్రీ,

    మీ కవిత్వం అమరం!

    సైనికుల ధైర్య సాహస త్యాగాలను అత్యద్భుతంగా శ్లాఘించి అమిత ఆర్ద్రంగా హృదయాలకు హత్తుకునే అమరకవిత్వంతో నివాళి గావించిన మీకు శతకోటి వందనాలు.

    ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కవిత ఒక అమర గీతి!

    ~రత్నశిఖామణి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రత్న శిఖామణి గారు...మీ ప్రశంసకి ...
      మీకు కూడా అనేక వందనాలు @శ్రీ

      Delete
  3. ఏనాడైనా ఇంతగా ఎవరూ ఆలోచించలేదు , మీరొక్కరే ఆలోచించి అనేకమందిని ఆలోచింపచేయటం ఎంతో ఎంతో బాగుంది .

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శర్మ గారు...మీ ప్రశంసకి ...@శ్రీ

      Delete
  4. ఆలోచింప చేసే కవిత, చక్కటి భావం, మీ నుండి ఇలాంటి సామాజిక కవితలని కొరుకుంటూ...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మేరాజ్ గారు మీ ప్రశంసకి....@శ్రీ

      Delete
  5. ఆలోచింప చేసే కవిత, చక్కటి భావం, మీ నుండి ఇలాంటి సామాజిక కవితలని కొరుకుంటూ...

    ReplyDelete
  6. చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష! ఇక దేశం గురించి రక్షకులగురించి ఆలోచించే సమయమేదీ!

    ReplyDelete
  7. నమస్తే శర్మ గారు ...ఆలోచించాలనే వ్రాసాను ...ధన్యవాదాలు మీకు ...@శ్రీ

    ReplyDelete