చినుకు శరాలెలా గుప్పిస్తున్నాడో ఆ ఇంద్రుడు
మేఘాల విల్లుతో.
చినుకుబాణాలు ఎలా వదులుతున్నాడో
మెరుపు నారి సారిస్తూ.
చినుకుల శరసంధానం చేసే ఇంద్రుని ధనుష్టంకారం
ఉరుమై తరుముతుంటే,
నీటియజ్ఞం మొదలెట్టింది ధరణి వరుణుని జలయంత్రాల సాయంతో.
మేఘం ...చినుకుపూలతో పలకరించి పోతూ ఉంటుంది
వేడెక్కిన గిరులకి ఆ'విరులిస్తూ'.
చినుకులనెలా చిమ్ముతోందో వానమేఘం
వసుంధర అందాలను బహిర్గతం చేస్తూ.
చినుకులు నేల చేరేందుకు
దారి చూపే కాంతిమార్గమనిపిస్తోంది ఆ విద్యుల్లత.
ఆకాశం ఆరేసిన ఏడువారాల కోకలనెలా తడిపేస్తోందో
ఆ తుంటరి మేఘం.
మేఘుని నీటితుపాకి కాల్పుల అభ్యాసం
తొలకరిలోనే.
మేఘుని జల(అ)నియంత్రణలు
పుడమి కట్టిన పచ్చనిచీరను తడుపుతూ.
తొలకరి అలవోకగా అల్లేస్తూ ఉంటుంది
నీటితివాచీలను...చినుకు దారాలతో.
చిందేస్తూ చినుకుల చిన్నది
మేఘ తాళాలకి ధీటుగా.
ఎక్కడ నేర్చిందో ఆ కొండ
చినుకుచుక్కలని క్షీరధారలుగా మార్చే విద్య.
చినుకు పలకరిస్తే చాలు
సిగ్గుతో పరుగందుకుంటుంది సెలయేరు.
వానకారులో ధరణి కోసం తెల్లకోకలంపుతూనే
ఉంటాడు ఆ పర్వతుడు. .... @శ్రీ
సాహిత్యాంగనలో అక్షర సరాగాలు భావార్షాన్ని కురిపిస్తున్నాయి మీ కవితలు, అభినందనలు శ్రీ గారు.
ReplyDeleteధన్యవాదాలు మెరాజ్ గారు మీ చక్కని ప్రశంసకి ...@శ్రీ
Deleteexcellent sri garu
ReplyDeleteరమేష్ గారు ఎప్పుడో మీ బ్లాగ్ లో ఒక భావం చదివాను ..ఇలా నేను వ్రాయాలి అనుకుని ఇలా కొన్ని వ్రాసి వాటిని అంతా ఒక కవితగా చేసేసాను ... థాంక్ యు :-) ...@శ్రీ
Deleteచాలా బాగుంది శ్రీ సర్ "నీటితివాచీలను...చినుకు దారాలతో.
ReplyDeleteచిందేస్తూ చినుకుల చిన్నది
మేఘ తాళాలకి ధీటుగా."చాలా బాగుంది
థాంక్ యు అక్షర కుమార్ ....ఈ భావం మీకు నచ్చినందుకు ...@శ్రీ
Deleteచాలా చాలా బాగుందండి.
ReplyDeleteధన్యవాదాలు పద్మా రాణి గారు ...మీ ప్రశంసకి ....@శ్రీ
Deleteఈనాటికవిత-21
ReplyDelete___________________________
ఆర్.వి.ఎస్.ఎస్ శ్రీనివాస్-తొలకరి విరి ఝరి
భావకవిత్వానికి(romantic poetry)కి ఈవలి దశలో తెలుగులో అనుభూతి కవిత్వం (poem of feeling/pure poem)ఒకటి కనిపిస్తుంది.నిజానికి ఈరెంటిలోనూ వర్ణనే ప్రధానం.కాని వీటినిర్వహణలో వెంట్రుకవాసి అంతరం ఉంది.భావకవిత్వంలో సందేశం,ఆనందం రెండూ ఉంటాయి.అనుభూతిలో అనుభూతివల్ల కలిగే ఆనందమే ఉంటుంది.
వర్ణన విషయానికి వస్తే వస్తుగత వర్ణన(Conceptual discription)కళాత్మక వర్ణన (easthetic discription)అని రెండు భాగాలున్నాయి.చాలవరకు ప్రబంధకాలం నుండి కనిపించేది కళాత్మక వర్ణనే.కావ్యాల్లో ఇతిహాసాల్లో నదులు,వర్షం ,హిమాలయాలు వంటివి దొరికితే కవులు అద్భుతమైన వర్ణనలు చేసేవారు.
శ్రీనివాస్ గారు వర్షాన్ని అనేక భావచిత్రాల ద్వారా అందించారు.కావ్యాల్లో సంస్కృత భారతంలో వ్యాసుడు,తెలుగు భాగవతంలో పోతన,హరివంశంలో ఎర్రన..ఈకాలానికి వస్తే ఇస్మాయిల్ వర్షాన్ని గురించి అద్భుతమైన వర్ణనలు చేసారు.ఈ కవితలోనూ ఆసంప్రదాయాలు కనిపిస్తున్నాయి.
"చినుకు శరాలెలా గుప్పిస్తున్నాడో ఆ ఇంద్రుడు
మేఘాల విల్లుతో.
చినుకుబాణాలు ఎలా వదులుతున్నాడో
మెరుపు నారి సారిస్తూ.
చినుకుల శరసంధానం చేసే ఇంద్రుని ధనుష్టంకారం
ఉరుమై తరుముతుంటే,
నీటియజ్ఞం మొదలెట్టింది ధరణి వరుణుని జలయంత్రాల సాయంతో"
చాల అందమైన ఊహలు చేసారు శ్రీనివాస్.ఉరుముని>ధనుష్టంకారమని
..చినుకుని>బాణమని..మెరుపు>నారి అని ఒక యుద్ద దశని చూపినట్టుగా వర్ణించారు..
కావ్యాలల్లోనూ "ఇంద్రుని"పేరే ఎక్కువ.దిక్పాలకులకు అధిపతి గనుక..ఈ వాక్యాల్లో ప్రాబంధిక సృజన కనిపిస్తుంది.
"తొలకరి అలవోకగా అల్లేస్తూ ఉంటుంది
నీటితివాచీలను...చినుకు దారాలతో.
చిందేస్తూ చినుకుల చిన్నది
మేఘ తాళాలకి ధీటుగా."...చినుకుల్ని దారాలుగాచెప్పటం ఆధునిక దశ..బహుశః మొదట ఈ ప్రయోగాన్ని సాదించింది ఇస్మాయిల్ గారు."రేకు డబ్బాను పొట్లమని..చినుకుల్ని దారాలని"ఆయన రాసిన గుర్తు?-ఇక్కడ మేఘాల ఉరుములని తాళాలుగా చెప్పటమూ కనిపిస్తుంది.ఈ వాక్యంలో భాషకూడా ఆధునిక స్థాయికి వచ్చింది.ఈ కోణం లో పరిశీలించి చూస్తే శ్రీనివాస్ గారిలో పఠనానుభవ ప్రభావం కనిపిస్తుంది.
అడుగడుగునా శ్రీనివాస్ గారు చిత్రించిన భావ చిత్రాలు,కళాత్మక వాక్యాలు ఆహ్లాద పరుస్తాయి.
"ఆకాశం ఆరేసిన ఏడువారాల కోకలనెలా తడిపేస్తోందో
ఆ తుంటరి మేఘం."
"
ఎక్కడ నేర్చిందో ఆ కొండ
చినుకుచుక్కలని క్షీరధారలుగా మార్చే విద్య."
ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి.శ్రీనివాస్ గారిలో మంచి ఊహా చాతుర్యం ,ప్రత్యేకించి ప్రకృతిని బాగా అనుభవించ గల అనుభూతి దారుఢ్యం కనిపిస్తుంది.ఈకాలంలో వచనం కొంత ముందుకు చేరింది.దాన్ని అర్థం చేసుకోడానికి ఆధునిక కవిత్వాన్ని ,భాషాశైలిని అధ్యయనం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది.అందువల్ల రెండురకాల భాషాశైలుల నుండి తనదైన దారివెదుక్కోగలుగుతారు.కాలానికి తగిన వస్తువు శ్రీనివాస్ గారు ..జయహో..
16.08.2013
https://www.facebook.com/groups/kavisangamam/permalink/606171659435590/?comment_id=606173549435401&offset=0&total_comments=5
ఎక్కడ నేర్చిందో ఆ కొండ
ReplyDeleteచినుకుచుక్కలని క్షీరధారలుగా మార్చే విద్య."
....అద్భుతః శ్రీనివాస్ గారు...మీ తొలకరి విరిఝరి మా మదిలో తోలకరి జల్లులై కురిసి ఆనందాతిశయాన్ని కలిగింపచేసింది.ఈ ఆనందాన్ని కలకాలం మీ కవితల ద్వారా పొందాలని ఆశిస్తున్నాను.